ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగులు, శాఖల విభజన దాదాపు 90 శాతం పూర్తయినందువల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులంతా ఇక అమరావతి దారి పట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఏడాది జూన్ నెల లోగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు అమరావతికి తరలాలని ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, గుంటూరు నగరాలలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేశామని, అందువల్ల ఉద్యోగులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి విధులకు హాజరు కావాలని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, స్పీకర్, పోలీస్, పాలనా సంబంధమయిన అధికారులంతా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నుంచి పనులు ప్రారంభిస్తున్న పరిస్థితిలో ఉద్యోగులు మాత్రం హైదరాబాద్ నగరం నుంచి పని చేయడంలో అర్థం లేదని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితి వల్ల ఒక్కొక్క ఫైల్ పరిష్కారం కావడానికి మూడు రోజులకు పైగా పడుతోందని, అధికార్లు విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య తిరగాల్సి వస్తోందని ఆయన అన్నారు. అయితే, తమకు కార్యాలయాలు చూపెడితే అమరావతి లేదా విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లి విధులకు హాజరు కావడానికి అభ్యంతరం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయం ఎక్కడ నిర్మిస్తారో తెలియని స్థితిలో తాము వెళ్లి అమరావతిలోపని చేయడంలో అర్థం లేదని వారు పేర్కొన్నారు. త్వరలో తాత్కాలిక భవనాలను చూపెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.