ఉక్కు మనిషి ఎవరి వాడు?

సర్దార్ వల్లభాయ్ పటేల్ …. భారత దేశ ముఖ చిత్ర రూప శిల్పి. బ్రిటిష్ వాళ్ళు అఖండ భారతావనిని రెండు ముక్కలుగా ఇండియా, పాకిస్తాన్ లు గా చీల్చి మన భారత దేశాన్ని వదిలి పోయిన తర్వాత మన దేశ పరిస్థితి దారుణం గా తయారైంది. స్వాతంత్ర్య పోరాటంలో సామాన్యుల్లా పాల్గొన్న రాజులు, సంస్థానాధీశులు, జమీందారులు తిరిగి అధికారం కోసం తిరగబడ్డారు. మా రాజ్యాలు మాకు కావలసిందే అని పట్టు పట్టారు. ఈ సమస్యని తీర్చడానికి జాతిపిత మహాత్మా గాంధీ, మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు తర్జన భర్జన పడుతుంటే అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వచ్చారు. భారత దేశానికి ఎదురు తిరిగిన 500 కి పైగా సంస్థానాల్ని నయానా, భయానా చెప్పి ఇండియన్ యూనియన్ లో కలిపారు. అత్యంత సంక్లిష్టంగా మారిన కాశ్మీర్ ని, హైదరాబాద్ సంస్థానాన్ని కుడా పటేల్ ఇండియాలో విలీనం చేశారు. అప్పటి నుంచి సర్దార్ పటేల్ ని భారతీయులంతా ఉక్కు మనిషి అని ఎంతో గౌరవంగా పూజిస్తారు. అయితే, ఇప్పుడు ఆ ఉక్కు మనిషి ఏ పార్టీకి చెందిన వాడో తేల్చమని ప్రజల ముందుకు నెట్టారు రాజకీయ నాయకులు. ఆ సమస్యని ప్రజల ముందుకు నెట్టిన వారు మరెవరో కాదు ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్, కాబోయే ప్రధాని రేస్ లో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.
సర్దార్ పటేల్ వారసత్వాన్ని అందిపుచ్చు కోడానికి కాంగ్రెస్, బి.జె.పి లు అహ్మదాబాద్ ని వేదిక చేసుకున్నాయి. సర్దార్ పటేల్ పేరు మీద అహ్మదాబాద్ లో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం ప్రారంభోత్సవానికి ప్రధాని మన్మోహన్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
సమావేశంలో మొదట మోడీ మాట్లాడుతూ, భారతీయులంతా సర్దార్ పటేల్ ప్రధాని కాలేదన్న ఒకటే విషయంలో బాధ పడుతున్నారు. పటేల్ కనుక మొట్ట మొదటి ప్రధాని అయి ఉంటే భారత దేశ ముఖ చిత్రం మరోలా ఉండేది, దేశాన్ని ఐక్యం చేసిన ఘనత పటేల్ దే. ఆయన సాధించిన ఐక్యత, సమగ్రత ఇప్పుడు తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ప్రమాదంలో పడ్డాయని అన్నారు.
భారతదేశ మొట్ట మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు పేరు ఎత్తకుండా కాంగ్రెస్ పార్టీ పై మోడీ విమర్శలు కురిపించడంతో మౌన మోహనుడు మన్మోహన్ కూడా తన మాటలకి పదును పెట్టారు. “సర్దార్ పటేల్ నిజమైన కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జీవితాంతం కృషి చేశారు. నిజమైన లౌకిక వాది. ఉదారవాది. సైద్ధాంతిక విభేదం ఉన్న వారిని కూడా సమానంగా గౌరవించే వారు. దేశ సమగ్రతను మనస్పూర్తి గా నమ్మడం వల్లనే సుమారు 500 సంస్థానాల్ని విలీనం చేశారు.” అని మోడీ కి చురకలేసారు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరి వాడో తేల్చు కోవాల్సింది ఓటర్లే.

Send a Comment

Your email address will not be published.