ఉగాది వేడుకలు – వారి తీరే వేరు

ఎంత చెప్పినా తక్కువే! ఏం చెప్పినా మక్కువే! వారి తీరే వేరు, వారి దారే వేరు. మహాభారతంలో 18 పర్వాల సుదీర్ఘ ప్రస్థానంలా 18 వసంతాల సుదీర్ఘ ప్రయాణం. ప్రతీ సంవత్సరంలో నూతనత్వం. ప్రతీ వసంతం ఒక యాగం. ఒక సవాలు. ఒక సమరం. మరో సంరంభం. గతించిన సంవత్సరానికి సాదర వీడ్కోలు. క్రొత్త సంవత్సరానికి కొంగ్రొత్త ఆశలతో స్వాగతాలు. ఇందులో అలుపెరుగని వీరులెందరో. పట్టుదల, అకుంటిత దీక్ష, భాషాభిమానం, భావాలకు రూపం, మన భాషే ఆయుధం – ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతీ ఏట ఒక్కొక్క మెట్టు నదిరోహిస్తూ ముందుకు సాగుతున్న ప్రయాణం.

భూతలానికి తలిమానికంలా వున్న న్యూజిలాండ్ దేశంలో ఇక్కడి తెలుగు సంఘం మిగిలిన తెలుగు సంఘాలకి కూడా ఆదర్శంగా ఉగాది వేడుకలు జరుపుకుంది. నవయవ్వన ప్రాయంలో వ్యవస్థాపక సభ్యులు చూపిన త్రోవనే ఆచరిస్తూ క్రమం తప్పకుండా తెలుగు వారి ఉగాది మరోసారి షడ్రుచుల సమ్మేళనంతో 64 కళలను మేళవించి రసాత్మకంగా జరుపుకోవడం ముదావహం. పండగ వాతావరణం ఆ పరిధుల్లో ఆవహించి తెలుగునాడు తన్మయం చెంది అరుదెంచినట్లు ఉండింది ఆ కళా వేదిక. చాలామంది సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుతల్లి ఒడిలో పులకించిపోయారంటే అతిశయోక్తి కాదు.

ఉగాది పచ్చడి:
తెలుగువారి పండగ “ఉగాది” అనగానే షడ్రుచుల “ఉగాది పచ్చడి” గుర్తుకు రావడం తధ్యం. పరభాషా సంస్కృతులతో సహజీవనం చేస్తూ మన ఆచార వ్యవహారాలను నిలబెట్టుకోవాలన్న తపన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ సభ్యుడికీ ఉగాది పచ్చడితో స్వాగతం పలకడం ఆనందదాయకమైన విషయం. చాలామంది సాంప్రదాయ దుస్తులు ధరించి పరదేశంలో ఉన్నామన్న విషయాన్ని మరపిమ్పజేసారు. మన తరతరాల తెలుగు తరగని వెలుగని నిరూపించారు. తెలుగువెలుగుల జిలిగులను కురిపించారు.

పంచాంగ శ్రవణం:
ఉగాదికి “ఆది” అయిన పంచాంగ శ్రవణం (పంచాంగం అనేది ఒక రోజులోని పంచ అంగాలు అంటే తిది, వార, నక్షత్ర, యోగ, కరణాలకు సమబందించింది) శాస్త్రోక్తంగా చదివి వినిపించారు. పుణ్యభూమికి దూరంగా వున్నా మన పల్లె పదాలను వల్లె వేసుకొని పులకించిపోయారు. పలకరింపుతోనే పులకిరింపజేసే తేనెలొలుకు తెలుగు భాషకు పరవశించి పోయారు. తెలుగుతల్లికి నీరాజనం పట్టారు.

పిల్లలు కాదు – పిడుగులు:
సాంప్రదాయ బద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో మొదలైన కార్యక్రమం ఆద్యంతమూ ఒక సినిమా రీలులా ఎంతో చాకచక్యంతో నడిపించిన వాచస్పతులు మానస మరియు శృతి అభినందనీయులు. భారతమాతను వందేమాతరంతో మననం చేసుకొని కార్యక్రమాన్ని ప్రార్ధనా గీతంతో ఆరంభించి చిన్నారులు చేసిన నృత్యాలు, పాడిన గీతాలు, మనబడి పిల్లల కార్యక్రమం – ఇవన్నీ మన తరువాతి తరం వారికి పెద్ద పీటవేసి మన సంస్కృతీ సంప్రదాయాలను అనేక రూపాలలో అందివ్వాలన్న తపన ఇక్కడి తెలుగు సంఘం అభిలాషని చెప్పకనే చెప్పారు.

గత కొన్ని వారాలుగా చిన్న పిల్లలతో రిహార్సల్స్ చేయించి చక్కని హావభావాలతో, ఆహార్యాలతో అభినయింప చేయడం ఎంతో శ్లాఘనీయం. చాలామంది పిల్లలు తెలుగు పాటలను చక్కని పద ఉచ్చారణతో కాగితాలపై వ్రాసుకోకుండా వారివారి శైలిలో పాడటం సంతోషకరమైన విషయం.

చక్రికి నివాళి:
సినీ సంగీత దర్శకులు శ్రీ చక్రి గారు గత సంవత్సరం న్యూజిలాండ్ వచ్చి ఇక్కడి తెలుగువారిపై చెరగని ముద్ర వేసారనడానికి నిదర్సనంగా వారికి నివాళులర్పిస్తూ శ్రీ చక్రి గారు సంగీత దర్సకత్వం వహించిన కొన్ని పాటలు శ్రీమతి శ్రీసుత గారు మరియు శ్రీ రవి ముత్తు (వీరికి తెలుగు రాకపోయినా ఆంగ్లంలో వ్రాసుకొని పాడారు) కలిసి పాడారు. ఈ పాటలు ప్రేక్షకుల్ని ఆనాటి గత స్మృతుల్ని జ్ఞప్తికి తెచ్చి కంటతడి పెట్టించాయి.

లఘు చిత్రం:
భారతదేశంలో పరిక్షలు వ్రాసే తీరుపై నలుగురు కుర్రాళ్ళు ఒక లఘు చిత్రాన్ని తాయారు చేసి ప్రదర్శించిన తీరు అందరినీ నవ్వుల పువ్వుల్లో ముంచెత్తింది. తెలుగు సంఘం ఇటువంటి యువతను ప్రోత్సహించడం చాలా సంతోషం. వారు  సినిమా పరిశ్రమలో స్థిరపడడమే అయితే తప్పకుండా నెరవేరుతుందని ఆశిద్దాం.

విందు భోజనం:

షుమారు 600 మందికి పైగా వచ్చిన ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఉచితం. అంతే కాకుండా పసందైన విందు భోజనం కూడా వడ్డించి న్యూజిలాండ్ తెలుగు సంఘం వారి పరంపరను కొనసాగించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగువారు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! అయితే ఏదో రూపంలో కార్యక్రమ నిర్వహణ ఖర్చులకైనా కొంత డబ్బు కట్టాల్సిందే. అయితే ఈ తెలుగు సంఘం ప్రత్యేకం ఏమిటంటే గత 18 ఏళ్లుగా జరుపుకుంటున్న ఏ కార్యక్రమానికీ ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహించడం.

గత రెండు దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి నివసిస్తున్న చాలామంది తెలుగువారు మన భాషా సంస్కృతులపై ఉన్న అభిమానం, మమకారంతో కార్యక్రమాలకు తగు ఆర్ధిక సహాయం అందివ్వడమే ఇందుకు కారణం. ఆ విధంగానే ప్రతీ కార్య నిర్వాహక వర్గం సేవా తత్పరతతో, అకుంటిత దీక్షతో తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘంలోని పెద్దలకు, ఆర్ధిక సహాయం అందించిన వ్యాపారవేత్తలకు, దాతలకు తగు గౌరవ మర్యాదలను కల్పిస్తూ విజయపధం వైపు దూసుకుపోతున్నారు.

భేద వైషమ్యాలు లేవు:
సెలవుదినాల్లో నిర్వహించినా, అనూహ్య స్పందన వచ్చిన ఈ కార్యక్రమం అలవోకగా జరిగిపోయిందంటే అందుకు అందరూ సహకరించడమే. గత 18 ఏళ్లుగా అతిరధ మహారధులైన ఎంతోమంది సంఘంలో వివిధ హోదాల్లో అనేక బాధ్యతలను నిర్వహించారు. అంచెలంచెలుగా ఎదిగి తమ తమ వృత్తుల్లో నిష్ణాతులై ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తెలుగు కీర్తి బావుటాని ఎగురవేస్తున్నారు. అందరూ మమేకమై ఈ ఉగాది పండగకు ఒకే వేణువై పల్లవి పాడారు. “తెలుగు భాష మనది నిండుగ వెలుగు జాతి మనదని నినదించారు. అరమరికలు లేవు. హెచ్చు తగ్గులు లేవు. తరతమ బేధాలు లేవు. వర్గ వైషమ్యాలు లేవు.

కృతజ్ఞతలు:
తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ జగదీశ్వర రెడ్డి పట్లోళ్ళ మాట్లాడుతూ ఇంతకుముందు ఈ తెలుగు సంఘానికి సేవలందించిన చాలామంది అధ్యక్షులు ఇతర కార్యనిర్వాహక సభ్యుల మార్గదర్శకత్వంలో ప్రస్తుత కార్యవర్గం ముందుకెల్తుందనీ ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది మాజీ అధ్యక్షులు అందించిన సహాయసహకారాలు అభినందించదగినవనీ ఇక ముందు కూడా మా కార్యక్రమాలకు అందరూ సహకరించాలనీ కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములై దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడిన స్వచ్చంద కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  ముఖ్యంగా గత సంవత్సరం అధ్యక్షులు శ్రీ జగదీశ్వర రెడ్డి మగతల మరియు శ్రీ సీతారాం సల్వాజీ గార్లు అన్ని విధాలా ఎంతో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.