తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం కోసం అయ్యే ఖర్చును పూర్తిగా భరించడానికి ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇది తెలంగాణా ఉద్యోగుల దీర్ఘకాలిక కల. ప్రీమియం లేకుండా, పరిమితి అన్నది లేకుండా వైద్యం ఖర్చు ఎంతయినా ఇక ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలంగాణా ఉద్యోగుల నేతలకు హామీ ఇచ్చారు. “పైసా ఖర్చు లేకుండా ఉద్యోగులందరికీ అపరిమిత వైద్యం అందిస్తాము.
ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఏ ఆస్పత్రి అయినా ఖర్చు ఎంతయినా ప్రభుత్వానిదే భారం” అని ప్రకటించిన కేసీఆర్, “” ఈ పథకాన్ని నవంబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తున్నాం” అని తెలిపారు. ఆరు నెలల తరువాత ఎయిడెడ్ ఉద్యోగులకు కూడా దీన్ని వర్తింపజేస్తామని ఆయన వెల్లడించారు. అంతే కాదు, మహిళా ఉద్యోగి అత్త మామలకు కూడా ఈ పథకాన్ని మున్ముందు వర్తింపజేస్తామని కూడా ఆయన తెలిపారు.