ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు

Venkaiah naiduభారత 13వ ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు పదవీస్వీకార ప్రమాణం చేసారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఉదయం (2017 ఆగస్టు పదకొండో తేదీన) రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో వెంకయ్య నాయుడిచేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువారైన వెంకయ్యనాయుడు ఆశీనులయ్యారు.

“వెంకయ్య నాయుడు అను నేను……. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ప్రదర్శిస్తానని ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేస్తున్నా” అంటూ ఆయన హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన పుస్తకంలో సంతకం చేశారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మొదటిగా రాష్ట్రపతి కోవింద్‌ అభినందించారు. పది నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, విపక్షాలకు చెందిన కీలక నేతలు, రాష్ట్రాల సీఎంలు, పలు దేశాల రాయబారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.ఈ క్రమంలో ఆయన అరుదైన రికార్డు దక్కించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా వెంకయ్యనాయుడు రికార్డుపుటలకెక్కారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఈ విషయాన్ని గుర్తుచేయగానే సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. వెంకయ్యనాయుడు 1949 జూలై ఒకటో తేదీన ఆంధ్రప్రదేశులోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు.
ప్రమాణ స్వీకారం తర్వాత వెంకయ్యనాయుడు తిన్నగా రాజ్యసభకు వెళ్లి చైర్మన్‌ పీఠంపై కూర్చొని సభను నడిపించారు.

ఆయనకు ప్రధాని మోదీ, విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం తరువాత జన్మించినవాళ్లలో ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి ఆయన ఎనలేని సేవ చేశారు” అని ప్రశంసించారు.

అంతకుముందు వెంకయ్యనాయుడు రాజ్‌ఘాట్‌కు వెళ్లిన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. సర్దార్‌ వల్లభాయి పటేల్‌, దీన్‌దయాళ్‌ ఉపాథ్యాయలకు కూడా ఆయన పుష్పాంజలి ఘటించారు.

Send a Comment

Your email address will not be published.