"ఊర్వశి" కే వన్నె తెచ్చిన శారద

నేనొక ప్రేమ పిపాసిని
నీబోక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది
నీ హృదయం కదలనిది

– 1978 లో ఇంద్రధనస్సు అనే చిత్రంలోని ఈ పాట అంటే ఊర్వశి శారదకు చాల ఇష్టం. ఇప్పుడు విన్నా ఈ పాటను ఇష్టపడని వారుండరు. అది సూపర్ హిట్ పాట అనడంలో సందేహం లేదు. 350కి పైగా చిత్రాలలో నటించిన శారద తన కెరీర్ లో మూడు సార్లు ఊర్వశి అవార్డు పొందడం ఒక రికార్డు. ఈ క్రమంలో ఆమె ఆ అవార్డుకే వన్నె తెచ్చారనడం అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి మలయాళంలో ఆమెకోసమే కొన్ని సినిమాలు తీసి ఆమెలోని ప్రతిభను ప్రేక్షకుల ముందు ఉంచారని కూడా చాలా మంది అంటూ ఉంటారు.

మన తెలుగు వారిలో ఒక గుణముంది. కొన్ని సందర్భాలలో ఇతరులు గుర్తించి ప్రోత్సహించిన తర్వాత మన వాళ్ళు మేల్కొని వారిని ఆదరించడం అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. ఊర్వశి శారద విషయంలో ఇది అక్షరాలా నిజమైంది చెప్పుకోవచ్చు. అందుకే ఆమె ముందు రచ్చ గెలిచి ఇంట గెలిచిందని అంటూ ఉంటారు.

ఆమె తెలుగులో తొలుత నటించినా ఆ తర్వాత మళయాళ సినీ రంగంలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకుని గుర్తింపు పొందినప్పుడు మన వాళ్ళు కళ్ళు తెరిచారు. శారదకు నాటకానుభవం కూడా ఉంది.

ఆమె అసలు పేరు సరస్వతి దేవి. ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో 1945 జూన్ 12వ తేదీన జన్మించారు. ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వర రావు, సత్యవతి దేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆమెకు ఒక సోదరుడు ఉన్నారు. పేరు మోహన్ రావు. శారద చిన్న వయసులోనే మద్రాసు చేరుకుంది.. ఆమె బామ్మ కనకమ్మ దగ్గర పెరిగారు. తమ బామ్మ ఎంతో స్ట్రిక్టుగా ఉంటారని, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని శారద చెప్పే వారు. తొలి రోజుల్లో హీరోలెవరూ ఆమెను తాకడానికి బామ్మ ఒప్పుకునే వారు కాదు. ఆదివారాలు మాత్రమే రిహార్సల్స్ ఉండేవి.

ఆమె తన ఆరో ఏట డ్యాన్స్ నేర్చుకున్నారు. దసరా పండుగ రోజుల్లోనూ, ఆలయ ఉత్సవాలలోను ఆమె డ్యాన్స్ చేసేవారు. ఆమె తన తల్లి కోరికగా డ్యాన్స్ నేర్చుకున్నారు. అంతేకాదు తమ కూతురు సినీ రంగంలో గొప్ప స్టార్ కావాలన్నది కూడా శారద తల్లి కోరిక. ఈ విషయంలో ఆమె తండ్రి పెద్దగా ఆసక్తి చూపకపోయినా ఆమె ఎదుగుదలకైతే అడ్డుపడలేదు.

ప్రముఖ తెలుగు హీరో చలంను శారద వివాహమాడారు. చలం నిర్మాత, కమెడియన్ కూడా. శారద నటించిన తొలి సినిమా తండ్రులు కొడుకులు. ఈ చిత్రంలో చలం సహా నటుడు. అలా వీరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. అయితే ఆతర్వాత వీరు విడిపోయారు.

ఆమె పద్మనాభం సరసన దాగుడు మూతలు చిత్రంలో డువ్వు డువ్వి డవ్విట్టం…. అని అంటూ నర్తించి నటించినప్పుడు చూసిన వారందరూ శారద హాస్య పాత్రలకు పరిమితమై పోతుందేమో అని అనుకున్నారు. కానీ ఆమె అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో ఓ స్థాయికి చేరడం విశేషం.

మనుషులు మారాలి చిత్రంలో శారద నటన ఉన్నత శిఖరాలను చేరింది. ఆ చిత్రాన్నే మలయాళంలో తీసినప్పుడు ఆమెకు బహుమతులు వచ్చాయి. ఈ చిత్రం ఎన్ని భాషలలో తీస్తే అన్ని భాషలలోను ఆమె కథానాయికగా నటించింది.

ఊర్వశి చిత్రంలో శారద కురూపిగా నటించిన తీరు అద్భుతం. ఆ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. రాధమ్మ చిత్రంలో శారద తల్లీ కూతురుగా నటించడం మరో విశేషం.

అమాయకురాలు, జీవితం, బలిపీటం, మంగళ గౌరీ, స్వాతి, ప్రతిధ్వని, ముద్దాయి, శారదాంబ, చండశాసనుడు, మా తెలుగు తల్లి తదితర చిత్రాల్లో శారద నటన తెలుగు సినీ రంగంలో చిర స్థాయిగా నిలిచిపోయింది అని చెప్పడానికి ఆలోచించక్కరలేదు. న్యాయం కావాలి చిత్రంలో జీవితంలో ఓడిపోయి తనలా మరో స్త్రీ జీవితం నాశనం కాకూడదనే ఆశయంతో లాయర్ పాత్రలో శారద నటన ఓహొ అనిపించుకుంది. నారీ నారీ నడుమ మురారి, అనసూయమ్మ గారి అల్లుడు చిత్రాలలో శారద అత్తగా ఎంతో గొప్పగా నటించారు. ఆమె ఒక సినిమాలో తనకన్నా దాదాపు 30 ఏళ్ళు పెద్దాయనకు పెళ్ళాంగా నటించారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 13 ఏళ్ళు.

హీరోయిన్ పేరుతో (శారద) సినిమా టైటిల్ పెట్టడం అనేది ఆమెతోనే మొదలైంది.

ప్రముఖ నిర్మాత ఎల్ వీ ప్రసాద్ తో ఆమె ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆయన తీసిన చిత్రాల్లో ఆమె నటించక పోయినా ఆయన సమక్షంలో నటనలో శిక్షణ పొందసాగారు. నవరసాలు ప్రదర్శించడంలో ఆమె నైపుణ్యం పొందారు. ప్రసాద్ గారి సమక్షంలో పొందిన నేర్చుకున్నవిషయాలు ఆమె కెరీర్ కు ఎంతగానో తోడ్పడినట్టు శారద చెప్పుకునే వారు.

కన్యాశుల్కంలో ఆమె ఓ చిన్న పాత్రలో నటించింది. అది ఆమెకు తొలి చిత్రం. అయితే అనంతరం ఆమె నాటకంలో నటించారు. ఆ నాటకం పేరు రక్త కన్నీరు. అదొక తమిళ నాటకం. ఈ నాటకం తమిళ నాడులో వంద సార్లు పైనే ప్రదర్శించారు.

అక్కినేని నాగేశ్వర రావుతో నటించిన ఇద్దరు మిత్రులు చిత్రం ఆమె ఉన్నతికి ఎంతో దోహదపడింది. ఆ సినిమా హిట్టు కొట్టడం ఆమెకు లాభించింది. ఆ వెంటనే ఆమెకు ఒక తమిళ చిత్రంలోనూ. మలయాలంలోను నటించేందుకు అవకాశాలు వచ్చాయి.

తమిళంలో ఆమె నటించిన తొలి చిత్రం కుంగుమం (1963). మలయాళంలో ఆమె నటించిన తొలి చిత్రం ఇనప్రవుకల్ (అంటే ప్రేమ పావురాలు అని అర్ధం). ఈ చిత్రం ఆమె సినీ జీవితంలో గొప్ప మలుపు తిప్పింది. మలయాళంలో సత్యం, ప్రేమ నజీర్ వంటి గొప్ప నటులతో ఆమె నటించారు. ఒక చిత్రంలో కుంచేరియా కుమార్తెగా రాహెల్ పాత్రలో నటించినప్పుడు ఆమెకు ఎనలేని ఖ్యాతి లభించింది. దానితో ఆమె మలయాళం చలనచిత్రపరిశ్రమలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. మలయాళం పరిశ్రమలో కీర్తిప్రతిష్టలు తెచ్చుకున్న కొద్దిమంది తారల్లో శారద ఒకరు కావడం గమనించవలసిన విషయం. మలయాళంలో నటించిన ప్రతి సినిమాలోను ఆమె తన ప్రతిభను మెరుగుపరచుకుంటూ వచ్చారు.

తులాబారం (1969) అనే మలయాళం చిత్రంలో ఆమె భర్తను కోల్పోయిన పాత్రలో నటించి ప్రేక్షకుల కంట తడి పెట్టించింది. ఆమె నటనకు ఎంతో పేరు వచ్చింది. ఈ పాత్రకు జీవం పోసిన శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు దక్కింది. దీనినే ఊర్వశి అవార్డు అని అంటారు. ఇక రెండో సారి మళ్ళీ ఒక మలయాళం చిత్రం ద్వారానే (స్వయంవరం, 1972) దక్కింది. ఇక మూడో సారి ఆమెకు ఊర్వశి అవార్డు తెలుగు చిత్రమైన నిమజ్జనం (1977) ద్వారా లభించింది. షబానా ఆజ్మీ తర్వాత మూడు సార్లు ఊర్వశి అవార్డు గెల్చుకున్న రెండో నటిగా ఆమె జాతీయస్థాయిలో రికార్డు పుటలకెక్కింది. 1970 లో తిరువోణం అనే మలయాళం చిత్రంలో నటించిన దానికి కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న శారద ఫిలిం ఫేర్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

1993 తర్వాత ఆమె తక్కువ చిత్రాలలోనే నటిస్తూ వచ్చారు. 2006 లో తెలుగులో నటించిన స్టాలిన్ చిత్రంలో ఆమెకు మంచి పేరే వచ్చింది.

2010 లో ఆమెకు ఎన్ టీ ఆర్ జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డు తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని శారద చెప్పారు. ఎన్ టీ ఆర్ తో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ వాటిలో తనవన్నీ బరువైన, ప్రధానమైన పాత్రలేనని తెలిపారు. ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరని ఆమె చెప్పారు.

ఆమెకు మెడిటేషన్ చేయడమంటే ఇష్టం. అలాగే ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్తారంటే అవి వినడానికి ఎంతో ఇష్టపడతారు శారద. సీరియస్ గా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. కానీ ఆమె ఎక్కువ చిత్రాలలో నటించిన పాత్రలు అందుకు భిన్నమైనవి కావడం విశేషం.

ఆమెకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. దాని పేరు లోటస్ చాక్లెట్స్. ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆమెకు చాక్లెట్ లంటే చాలా ఇష్టం. మరొకటి పది మందికి ఉపాధి కల్పించినట్టు కూడా అవుతుందని ఆమె అనుకోవడం.

ఆమె రాజకీయాలలోనూ ఓ విజయాన్ని చవిచూదకపోలేదు. ఆమె గతంలో ఒకసారి గుంటూరు జిల్లా తెనాలి నుంచి తెలుగు దేశం టికెట్ పై పోటీ చేసి గెలుపొంది పార్లమెంట్ సభ్యత్వం పొందారు.

మహిళలు ఏ రంగంలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా శ్రమించడం వాళ్ళ ఉన్నతికి చేరుకోవచ్చన్నది ఆమె అభిప్రాయం.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.