ఎక్కడా "ఆత్మ" కనిపించదు

“మొదట్లో ఒక ప్రేక్షకుడిగా సినిమాల గురించి తెలుసు. 1935 – 51 సంవత్సరాల మధ్య చాలా మంచి సినిమాలు వచ్చాయి. దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు ఒక ఆశయం, ఆదర్శం చిత్ర నిర్మాణంలో ఉండేవి. సంఘ సంస్కరణ అభిలాష కనిపించేది” అంటూ కీర్తిశేషులు కొంగర జగ్గయ్య ఓ మారు చెప్పారు.

ప్రముఖ సినీ నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా, మాజీ పార్లమెంటు సభ్యుడిగా, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరిగా సుపరిచితులైన జగ్గయ్య “కంచు కంఠం” జగ్గయ్యగా, “కళా వాచస్పతి”గా వినుతికేక్కారు.

1967లో నాలుగవ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచిన క్రమంలో ఆయన లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అనిపించుకున్నారు.

ఆయన నాటి, నేటి సినీ నిర్మాణాల పై మాట్లాడుతూ “మాలపిల్ల అనే సినిమా వీరేశలింగం గారి ప్రేరణతో వచ్చిన చిత్రం. జమిందారీ వ్యతిరేక ఉద్యమ స్పూర్తిగా రూపొందిన చలన చిత్రం రైతుబిడ్డ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి” అన్నారు.

“అయితే క్రమంగా సమష్టి కుటుంబ వ్యవస్థ ధ్వంసమైంది. సెంటిమెంట్స్ గాలికి ఎగిరిపోయాయి. భార్యా భర్తా చిన్న కుటుంబాలుగా విడిపోయారు. స్వార్ధ చింతన పెరిగిపోయింది. బస్తీ జీవితంలో ఈ మార్పు, తత్త్వం మరింత స్పష్టంగా కనిపించడం మొదలైంది. దీనితో సినిమాల స్వరూపం కూడా మారిపోయింది” అని బాధ పడ్డారు.

“ఇప్పుడున్న వాళ్ళు యాంగ్రీ టీన్ ఏజ్ పాపులేషన్. ఆడ పిల్లలను ఏడిపించడం, తమ బాసెస్ ను చావగొట్టేయడం, సరదాలు….ఇవి సీనియర్ సిటిజన్స్ కి నచ్చవు. ఎన్ని పాటలు, ఎన్ని ఫైట్లు ఉన్నాయో లెక్కలు వచ్చాయి. సినిమా స్వరూపం మారిపోయింది.ఓ కథ, ఓ పది ప్రధాన పాత్రలు, వాటికి సహజ స్వరూప స్వభావాలు ఉండే కథ నడిపే కాలం ఎప్పుడో తెర మరుగైంది. రాను రాను ఒకే వ్యక్తి ప్రాధాన్యత వచ్చింది. ఆ హీరోతోనే కథ నడుస్తుంది. అసలు కథంటూ ఉంటే. ఇతర పాత్రలు సెట్ ప్రాపర్టీస్ కి సమానం. టెక్నికల్ ఆకర్షణలు పెరిగిపోయాయి. విదేశాలలో పాటలు చిత్రీకరించామనే గొప్పలు చెబుతూ ఫిజికల్ ఆకర్షణ కోసం కథానాయికను కళ్ళ ముందు నిలబెట్టి పరుగులు తీయించి, రకరకాల భంగిమలు కసరత్తులు చేయిస్తున్నారు. ఎక్కడా మనకు ఆత్మ కనిపించదు. సంభాషణల స్థాయి పోయింది. మర్యాద మట్టికొట్టుకుపోయింది. చవకబారు డైలాగులు వచ్చేసాయి. నిజమైన జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాలు రావడం మానేశాయి. సెన్సార్ ఒప్పుకోదని మానేస్తున్నామంటున్నారు. ఒప్పుకుంటే మరింత బరితెగించేవారేమో…” అని జగ్గయ్య చెప్పారు.

Send a Comment

Your email address will not be published.