ఎట్టకేలకు చర్చలు

కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దాదాపు ప్రతి రోజూ విమర్శలు, ఆరోపణలతో కాలం గడిపిన తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడిక్కడ మొదటిసారిగా చర్చలు జరిపారు. ఈ చర్చలు రాజ్ భవన్ లో దాదాపు గంటన్నర సేపు జరిగాయి. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సభాపతులు, తెలంగాణా శాసనమండలి చైర్మన్ కూడా పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన కొన్ని విభేదాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఉద్యోగుల విభజన, నీటి పంపకాలు, విద్యుత్, ఫీజుల చెల్లింపులు వంటి అంశాలపై ‘సుహృద్భావ’ వాతావరణంలో ముఖ్యమంత్రులు మనసు విప్పి మొదటిసారిగా మాట్లాడుకున్నారు. ఉద్యోగుల విభజన వంటి కీలక అంశాలను అధికారుల స్థాయిలో చర్చి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అవసరమయితే మరో సారి సమావేశం కావాలని కూడా వారిద్దరూ భావించారు.

మంత్రులకు అధికారిక కార్యాలయాలు కేటాయించడం దగ్గర నుంచి వివిధ ఆస్తుల పంపకం వరకూ అనేక అంశాలపై రాష్ట్ర విభజన నాటి నుంచీ కలహించుకుంటున్న తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదర్చడానికి గవర్నర్ నరసింహన్ మరోసారి ప్రయత్నం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఇచ్చిన ఎట్ హోమ్ లో గవర్నర్ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చెరో పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరి మధ్యా సామరస్యం ఉండాల్సిన అవసరాన్ని వివరించి చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన విమానాశ్రయంలోనే ఇద్దరి మధ్యా సామరస్యానికి మొదటిసారి ప్రయత్నం చేశారు. “ఇక మేమిద్దరమూ మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుంటాం” అని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ కు హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయినప్పుడు సమస్యలు తలఎత్తడం సహజమనీ, వీటిని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోని పక్షంలో నష్టపోయేది ప్రజలని గవర్నర్ చెప్పారు. న్యాయస్థానాలకు, కేంద్రం వద్దకు వెళ్ళకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని కూడా ఆయన వారికి హితవు చెప్పారు. ఈ చర్చలు సుమారు 45 నిమిషాలపాటు జరిగాయి.

Send a Comment

Your email address will not be published.