ఎన్సైక్లోపీడియా అఫ్ తెలుగు సినిమా

వందేళ్ళకు పైగా చరితం గల తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని వేల చిత్రాలు, వందల దర్శక నిర్మాతలు, ఆరితేరిన మహా నటులు, గాయకులు, కేమరామేన్లు, షూటింగ్ లో సహాయకులు, గిన్నీస్ బుక్ రికార్డులు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో పాటు వ్యాపార పరంగా ఎన్నో మైలు రాయిలనదిగమించిన ఘన చరిత్ర మనది. హిందీ చిత్ర రంగంతో సరైన పోటీనిచ్చే తెలుగు చిత్ర పరిశ్రమ సంవత్సరానికి షుమారు 300కు పైగా చిత్రాలు తీయడమే కాకుండా సరిసమానమైన బడ్జెట్ కూడా ఖర్చుపెడుతోంది. కొన్ని వేలమందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ వందేళ్ళ సమగ్రమైన చరిత్ర ఒకే చోట మనకు దొరకాలంటే కష్టతరమైన పని.

సిడ్నీ వాస్తవ్యులు శ్రీ వుటుకూరి వెంకట సత్యనారాయణ గారు మన సినిమాలపై మమకారంతో కొన్ని సంవత్సరాలు కృషి చేసి 1932 నుండి 2000 సంవత్సరం వరకూ షుమారు 4, 700 చిత్రాల సమాచారం ఒక సమగ్ర గ్రంధంగా రూపొందించి మనకందించారు. ఈ గ్రంధంలో ప్రతీ పేజీలో ఒక్కొక్క సినిమా యొక్క సమాచారం సంవత్సరముల వారీగా పొందుపరిచారు. ముఖ్యంగా చిత్ర దర్శక నిర్మాతల గురించి, అందులో నటించిన నటీనటుల వివరాలు, కధ ప్రాముఖ్యత, పాటల మాటల రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, ఎప్పడు విడుదలైంది మొదలైన వివరాలు వున్నాయి.

శ్రీ సత్యనారాయణ గారి వివరాల్లోకెళితే వారు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందినవారు. ఆస్ట్రేలియా దేశానికీ మొదటిగా (1970) వలస వచ్చిన తెలుగువారిలో శ్రీ సత్యనారాయణ గారు ఒకరు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పట్టా పుచ్చుకుని అక్కడే పనిచేస్తూ అమెరికాలోని విన్స్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మైనింగ్ ఇంజనీరింగ్ లో ఉన్నత పట్టభద్రులయ్యారు. అయితే అమెరికాలో చేయగలిగింది మనం భారత దేశంలో ఎందుకు చేయలేం అన్న పట్టుదలతో తిరిగి భారతదేశానికి వచ్చి బనారస్ విశ్వవిద్యాలయంలో కొంత కాలం పని చేసిన తరువాత ఆస్ట్రేలియా రావాలని నిర్ణయించుకున్నారు.

వచ్చిన కొత్తలో బ్రోకెన్ హిల్ లోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో 14 ఏళ్ళు పని చేసిన తరువాత సిడ్నీకి రావడం జరిగింది. అధ్యాపక వ్రుత్తి, పరిశోధనా రంగంలో శ్రీ సత్యనారాయణ గారు చాలా కృషి చేసారు. వీరు 100 కు పైగా పరిశోధనా పత్రాలను మైనింగ్ ఇంజనీరింగ్ కి సంబంధించి కొన్ని పుస్తకాలను ప్రచురించారు. కొన్ని ప్రచురణలు జపనీస్ , చైనీస్ మరియు పెర్షియన్ భాషల్లోకి అనువదించబడ్డాయి. వీరికి అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు ప్రధానం చేసిన Distinguished Alumnus Award మరియు జపాన్ ప్రభుత్వం నుండి Research Award for Foreign Specialists ముఖ్యమైనవి. శ్రీ సత్యనారాయణ గారికి 1950 నుండి తెలుగు భాషాభిమానంతో పాటు తెలుగు చిత్రాలన్నా సంగీతం అన్నా చాలా ఇష్టం. సినిమాలు చూస్తున్నప్పుడు వాటి సమాచారం ఒక పుస్తకంలో వ్రాసుకోవడం అలా ఈ గ్రంధానికి దారి తీసింది.

ముఖ్యంగా సినిమా పాటల పుస్తకాల్లోని వివరాలు, ఆడియో కేసెట్ల పైనున్న వివరాలు, ఆడియో CD ల పైనున్న వివరాలు, వీడియో కాసెట్లు, VCD ల పైవున్న వివరాలు , DVD కవర్లపైనున్న వివరాలు, అంతర్జాలంలో ప్రసారమైన సినిమాలు, భారతదేశం వెళ్ళినపుడు తీసుకొచ్చిన సమాచారం మొదలైన అనేక వనరులనుండి ఎన్నో వివరాలు సేకరించి ఈ పుస్తకంలో వీలైనంతవరకూ తప్పులు లేకుండా నిజనిర్ధారణ చేసుకుని ఒక ప్రామాణిక గ్రంధంగా తీర్చిదిద్దారు. దీనంతటికీ ముఖ్య కారణం తొలుత వారు నిజమైన, విశ్వసనీయమైన సమాచారం దొరకక ఇక్కట్లు పడడమే అని శ్రీ సత్యనారాయణ గారు చెప్పారు.

శ్రీ సత్యనరాయణ గారు ప్రస్తుతం జనరంజని రేడియో (Radio 2NBC FM 90.1) కార్యక్రమంలో అప్పుడప్పుడు ప్రముఖ సినీ రచయితల పాటల కార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.

ఈ పుస్తకం PDF రూపంలో అందుబాటులో వుంది. ఎవరైనా కావాలనుకుంటే శ్రీ సత్యనారాయణగారికి ఈమెయిలు vvutukuri@optusnet.com.au ద్వారా సంప్రదించవచ్చు.

Send a Comment

Your email address will not be published.