ఎమ్మెస్వీ కన్నుమూత

నాకు ప్రజల చప్పట్లే గొప్ప ఆనందాన్ని ఇస్తాయి అని పదే పదే చెప్పుకునే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎస్ విశ్వనాథన్ ఇక లేరు. అయితేనేం ఆయన పాటతో, స్వరపరచిన సంగీతంతో మనతో ఎప్పుడూ ఉంటారన్న ప్రముఖ గాయనీగాయకులు చెప్పిన మాట అక్షర సత్యం.

మెల్లిసై మన్నార్ గా అనిపించుకున్న ఎమ్మెస్వీ మంగళ వారం తెల్లవారుజామున (జూలై 14వ తేదీ 2015) నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆయన దాదాపు నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. వెంటనే ఆయనను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినా కోలుకోలేకపోయారు. విషయం తెలియడంతోనే చెన్నైలోని శాంతోంలో ఉన్న ఆయన నివాసానికి తరలి వెళ్లి ఎమ్మెస్వీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ తాలూకాలో ఉన్న ఎలప్పళి గ్రామంలో సుబ్రమణియణ్, నారాయణి కుట్టి లకు 1928 జూన్ 24వ తేదీన ఎమ్మెస్వీ జన్మించారు. ఆయన తన నాలుగో ఏట తండ్రి సుబ్రమణియణ్ చనిపోవడంతో దక్షిణ కణ్ణనూరులో ఉంటున్న తన తాతగారి వద్ద పెరిగారు. ఎమ్మెస్వీ తాతగారు జైలు వార్డెన్.

నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ళు సంగీతం నేర్చుకున్న ఎమ్మెస్వీ తన పదమూడో ఏట మూడు గంటలు సంగీత కచేరి చేసి పలువురి ప్రశంసలు పొందారు. ఆయన స్కూల్లో చదువుకున్నది లేదు. థియేటర్ లలో తినుబండారాలు అమ్ముతుండేవారు.

జైలు డే రోజు ఖైదీలతో “హరిశ్చంద్ర” అనే నాటకాన్ని ఎమ్మెస్వీ వేయించారు. ఈ నాటకంలో ఆయన లోహితాస్యునిగా నటించారు. ఆయన నటనను అందరూ తెగ మెచ్చుకున్నారు. పొగిడారు. దీనితో జైల్లో ఉంటున్న ఖైదీలందరూ కలిసు ఆయనను సినిమాలో నటించమని ప్రోత్సహించారు. ఆయనకు కూడా నటుడిగా గాయకుడిగా ఎదగాలనే కోరిక ఉండటంతో ఖైదీల ప్రోత్సాహం తోడైంది. కానీ మొదట్లో ఆయన ఆశ నెర వేరలేదు. సినిమా కంపెనీలో సర్వర్ గా పని చేశారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు సి ఆర్ సుబ్బురామన్ బృందంలో హార్మోనియం ఆర్టిస్టుగా చేరారు. అదే సంస్థలో టీ కె రామమూర్తి వయోలిన్ వాయిస్తుండే వారు.

ఇంతలో సుబ్బురామన్ ఆకస్మిక మరణంతో ఆయన సంగీతం స్వరపరుస్తున్న చిత్రాలు మధ్యలోనే ఆగిపోయినప్పుడు ఎమ్మెస్వీ, టీ కె రామమూర్తీ కలిసి స్వరాలు అందించారు. వీరిద్దరూ కలిసి దేవదాసు, చండీరాణి అనే చిత్రాలకు సహాయ సంగీతదర్శకులుగా పరిచయమై పనం అనే తమిళ చిత్రం మొదలుకుని ఆయిరత్తిల్ ఒరువన్ అనే చిత్రం వరకు 700 వందల చిత్రాలకు సంగీతం అందించారు. ఎమ్మెస్వీ విడిగా అయిదు వందల చిత్రాలకు పైన సంగీతం స్వరపరిచారు. ఇళయరాజాతో కలిసి మూడు చిత్రాలకు కలిసి పనిచేశారు. సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేయగా మరో రెండు పాటలు “జగమే మాయ బ్రతుకే మాయ”, బాలసరస్వతి పాడిన “ఇంత తెలిసియుండి” అను పాటలను కూడా స్వరపరిచారు.

కన్నగి, కాదల్ మన్నన్, కాదలా కాదలా తదితర పది చిత్రాలలో నటించారు ఎమ్మెస్వీ.

భీంసింగ్, కృష్ణన్ పంజు, త్రిలోకచందర్, కె. బాలచందర్ దర్శకులతో కలిసి ఎక్కువ సినిమాలకు పని చేసిన ఎమ్మెస్వీ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషలన్నీ కలిపి మొత్తం 1200 చిత్రాలకు పైగా సంగీతం స్వరపరిచారు.

పుదియపరవై అనే తమిళ చిత్రంలో ఎంగె నిమ్మడి అనే పాటకు మూడు వందల సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించారు. అలాగే బాగపిరివినై అనే చిత్రంలో ఒక పాటకు ఆయన మూడంటే మూడు వాయిద్యాలే వినియోగించారు.

పియానో, హార్మోనియం, కీ బోర్డు వాయిద్యాలు బాగా వాయించగల దిట్ట ఎమ్మెస్వీ.

తమిళనాడు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలలో ఆలపించే నీరాడుం… అనే పాటకు ఆయనే సంగీతం స్వరపరిచారు.

కర్నాటక సంగీత విద్వాంసులు ఎం ఎల్ వసంతకుమారి, బాలమురలీకృష్ణ, వంటివారితో ఆయన పాటలు పాడించారు. అంతేకాదు ఆయన కూడా స్వయంగా అనేక పాటలు పాడారు.

భారత్ – పాకిస్తాన్ యుద్ధం ముగింపులో 1965 లో ఆయన యుద్ధం జరిగిన ప్రాంతానికి తన బృందంతో వెళ్లి ఆయన హార్మోనియం మెడలో వేసుకుని గాయ పడిన సైనుకుల కోసం పాటలు పాడారు.

“నాలాగ ఎందరో” చిత్రానికి 1978 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనను నంది ఉత్తమ సంగీతదర్శకులుగా సత్కరించింది.

ఏదేమైనా ఆయన తన పాటలతో మనతోనే మన మధ్యే ఉంటారు అనడం అతిశయోక్తి కాదు.

Send a Comment

Your email address will not be published.