ఏడవ ఏటనే రంగప్రవేశం

నటి, దర్శకురాలుగా పేరుప్రఖ్యాతులు పొందిన విజయనిర్మల తన ఏడవ ఏటనే సినీ రంగ ప్రవేశం చ్జేసారు. విజయనిర్మలకు రావు బాలసరస్వతి సమీప బందువులు. అలనాటి హీరో టీ ఆర్ మహాలింగం ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు చిన్న హీరో వేషానికి ఒక బాల నటుడు కావలసి వచ్చింది. అప్పుడు రావు బాలసరస్వతి గారు విజయనిర్మలను తీసుకువెళ్ళి ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు పరిచయం చేసారు. ఆ సినిమాలో వేషం కూడా వేయించారు. ఆ తర్వాత విజయనిర్మల కొన్ని చిత్రాల్లో బాలనటిగా నటించారు. ఆమె తొలిసారిగా మేకప్ వేసుకుని నటించినప్పుడు ఆమె వయస్సు ఏడేళ్ళు. ఆమె బాలనటిగా నటించిన చివరి చిత్రం పాండురంగమహత్యం. ఆ తర్వాత ఆమె వేషాలు వెయ్యడం మానేసి భరతనాట్యం నేర్చుకున్నారు. తిరిగి ఆమె తన 16వ ఏట నటించడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక ఒక మళయాళ చిత్రంలో ప్రేమ్ నజీర్ తో కలిసి నటించిన విజయనిర్మల హీరోయిన్ గా నటించిన మొదటి తెలుగు సినిమా బీ ఎన్ రెడ్డి గారి రంగులరాట్నం. అనంతరం ఆమె ఎన్నో రకాల వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. నటనకు శ్రీకారం చుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు తనపై చూపిస్తున్న అభిమానం చెరగిపోనిదని విజయనిర్మల అంటూ ఉంటారు. అది తన అదృష్టమని, అంతకు మించి పెద్దల దీవెనలని కూడా ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.