చట్ట సభలంటే నిర్లక్ష్యం

Indian Parliament

పలువురు రాజకీయ నాయకులకు చట్ట సభ అంటే నిర్లక్ష్యం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి దాదాపు అన్ని పార్టీలలోనూ కనిపిస్తోంది. లోక్ సభ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి పార్లమెంటుకు రావడం తక్కువే. చాల ముఖ్యమయిన బిల్లులు ఆమోదం పొందాల్సిన సమయంలో కూడా వాళ్ళిద్దరూ సభలో కనిపించడం తక్కువే. పైగా ఈ ఇద్దరి కంటే బీజేపీ నాయకుల హాజరు ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుత పదిహేనవ లోక్ సభ సమావేశాలలో సోనియా హాజరు 47 శాతం మాత్రమే. కానీ బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ హాజరు 78 శాతం. ఇది జాతీయ సగటు 77 కంటే ఒక్క శాతం ఎక్కువ.

ఇది ఇలా ఉండగా, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ 82 శాతం హాజరయ్యారు. ఇక జనతా దళ (యు) నాయకుడు శరద్ యాదవ్ 83 శాతం హాజరు కాగా, సమాజ్ వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ హాజరయిన శాతం 86. ఆర్.జె.డి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ 79 శాతం హాజరయ్యారు. రాహుల్ గాంధి ఎక్కువగా హాజరయింది చివరిసారిగా 2009 మార్చిలో. అప్పుడు ఆయన హాజరు శాతం 77. అనారోగ్యం కారణంగా సోనియా అప్పట్లో ఎక్కువగా సభకు హాజరు కాలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మీనాక్షి నటరాజన్ 85 శాతం, మిలింద్ దేవరా 88 శాతం, దీపెందర్ హుడా 82 శాతం లోక్ సభకు హాజరయ్యారు.

కాగా, రాహుల్ గాంధీ కంటే ఆయన పినతండ్రి కొడుకు లోక్ సభ సమావేశాల్లో ఎక్కువసార్లు, అంటే 65 శాతం పాల్గొన్నారు. మొత్తం 545 మంది లోక్ సభ సభ్యుల్లో 92 మంది సగానికి సగం రోజులు లోక్ సభలో అడుగు పెట్టలేదు. కానీ 120 మంది సభ్యులు 90 శాతానికి పైగా హాజరు కావడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే, ఉత్తర ప్రదేశ్ లో సోనియా ప్రాతినిధ్యం వహించే రాయ్ బరేలీ జిల్లా రాష్ట్రంలో అతి పేద జిల్లా అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడి ప్రజల్లో 57 శాతం మంది బీదవారే. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుమారు ఆరువేల కోట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్క పథకం కూడా అమలు కావడం లేదు. రాహుల్ గాంధి ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.

Send a Comment

Your email address will not be published.