ఐకమత్యం, అంకితభావంతోనే అభివృద్ధి

పల్లె ప్రజలకు కె సి ఆర్ పిలుపు
—————————————-

పల్లెల్లో ప్రజల మధ్య ఐకమత్యం, అంకితభావం చాలా అవసరమని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. అప్పుడే ప్రతీ పల్లెతో పాటు ప్రజలూ వృద్ధి చెందుతారని ఆయన అన్నారు. ప్రతి పల్లె బంగారు పల్లె అవుతుందని చెప్పారు.

మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలోని ఎరవల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె సి ఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎరవల్లి గ్రామం తన స్వస్థలమని చెప్పిన కె సి ఆర్ కు ఆ పల్లెలో యాభై ఎకరాల సాగు భూమి ఉంది. ఈ గ్రామంలో ఆయన దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు. పల్లె ప్రజలతో ఆయన మాట్లాడి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా కె సి ఆర్ మాట్లాడుతూ రెండు వేల చేతులు ఓ రెండు గంటల పాటు ఒక్కటవుతే ఈ పల్లెలో పచ్చదనంతో పరిశుభ్రమై కలకలలాడుతుందని చెప్పారు. ఇక్కడి ప్రజల స్థితిగతులు మెరుగుపడాలని, ఈ పల్లె నుంచే తాను తెలంగాణా సాధించానని అన్నారు. మన రాష్ట్రంలోనే ఈ పల్లె నెంబర్ వన్ కావాలన్నది తన ఆశయమని చెప్తూ ప్రతి ఒక్కరూ అందుకు కృషి చేయాలని అన్నారు.

ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆగక ప్రజలు తమ సొంత పల్లెగా భావించి అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. మీ వెనుక ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని, అభిప్రాయభేదాలు విడనాడి ఒక్కటిగా కలసి కట్టుగా గ్రామాభి వృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.

సర్వ వర్గ సమితి ద్వారా పల్లెలు వృద్ధి చెందగలవని చెప్తూ నిజామాబాదు జిల్లాలోని అంకాపూర్, వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి ఎలా విజయపధంలో కొనగుతున్నాయో ఆయన వివరించారు. ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ పల్లెలు ఉదాహరణమని అన్నారు.

పల్లెల్లో ఏ ఒక్కరూ కూడా పేదరికంతో బాధ పడకూదదన్నదే తన అభిమతమని, ప్రభుత్వపరంగా అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్య మంత్రి కె చంద్ర శేఖర రావు చెప్పారు.

కె సి ఆర్ సభ జరుగుతున్న సమయంలో ఓ పాము కలకలం సృష్టించింది. అధికారులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది ఒక కన్నంలోకి దూరి తప్పించుకుపారిపోయింది.

Send a Comment

Your email address will not be published.