ఒబామా భారీ హామీలు

భారత దేశంలో నాలుగు వందల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సంసిద్ధత ప్రకటించారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వచ్చిన ఒబామా ఇక్కడ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సి ఈ ఓ లు, పారిశ్రామికవేత్తలను  ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశా లయిన భారత, అమెరికా దేశాల మధ్య ఇక నుంచి వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయని ఆయన వెల్లడించారు.

నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా వచ్చారు. ఇటువంటి ఉత్సవానికి ఒక అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే మొదటిసారి. కోట్లాది డాలర్ల విలువైన అణు వాణిజ్యం నెరపడానికి, రక్షణ ఒప్పందాలను పటిష్టం చేసుకోవడానికి కూడా చర్యలు తీసుకుంటామని ఒబామా తెలిపారు. ఈ ఇద్దరు నాయకులూ కలిసి రేడియో ప్రసంగం చేసారు. అనేక దఫాలుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్న వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసి నూతన శిఖరాలకు తీసుకు వెళ్లాలని ఈ నాయకులు నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్యంలో భారత్ వాటా రెండు శాతం మాత్రమే.

అమెరికాతో భారత్ సుమారు పదివేల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తున్నప్పటికీ అది చైనాతో పోలిస్తే అయిదు శాతం మాత్రమేనని  ఒబామా గుర్తు చేశారు. అయితే, ఈ వాణిజ్యం గత నాలుగైదు నెలల్లో బాగా పెరిగిందని మోడీ వివరించారు. దేశంలో అధికారిక ఆలస్యాలను తొలగించడానికి గట్టి ప్రయత్నాలను చేస్తున్నామని, అమెరికా వంటి దేశాలతో పెద్దఎత్తున వ్యాపారం చేయడానికి వీలయిన

వాతావరణాన్ని కల్పించబోతున్నామని   మోడీ తెలిపారు. భారతదేశంలో అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి వంద కోట్ల డాలర్ల ఆర్ధిక సహాయానికి అవకాశం కల్పిస్తామని,  ఇక్కడి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఆర్థికంగా చేయూతనందిస్తామని ఒబామా హామీ ఇచ్చారు.

Send a Comment

Your email address will not be published.