ఓంకార స్వరూపుడు

omkar swaroopదేవాదిదేవుడు అయిన శివుడు ఓంకారస్వరూపుడు. ప్రణవ స్వరూపుడు. బ్రహ్మమే శివుడని ఆత్మబోదోపనిషత్ చెప్తోంది. శివుడే ప్రణవం. ప్రణవమే శివుడు. ఈ రెండిటికీ భేదం లేదు. ఇది శివపురాణం మాట. ఓంకారం మూడు రకాలు. స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు రకాలు. అకార, ఉకార, మకార సంయుక్తంగా ఓం అవుతుంది.

ఓం అనే దివ్య నాదాన్ని ప్రకృతి ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటుంది.

అలాగే శివుడన్నా, ఆదిపరాశక్తి అన్నా ఒక్కటే. శైవ సిద్ధాంతం ప్రకారం పరమశివుడు నిరాకారుడు.

సూర్యుడు, వెలుగూ ఎలా వేర్వేరు కాదో అలాగే శివుడూ, ఆది పరాశక్తి కూడా. అలాగే చంద్రుడూ వెన్నెలకూ ఏమాత్రం తేడా లేదో అలాగే శివుడూ ఆదిపరాశక్తికీ
కూడా తేడా లేదు. అందుకే శివుడినీ పరాశాక్తినీ వేర్వేరుగా చూడకూడదు. ఇద్దరూ ఒక్కటే.

శివుడు నిర్గుణుడు. నిర్మలుడు. నిరంజనుడు. నిరాకారుడు. నిరాశ్రయుడు. నిరతిశయ అద్వైత పరమానంద స్వరూపుడు. పరమేశ్వరుడు చైతన్య స్వరూపుడు. ఆదిదేవుడు.

పరమేశ్వరుడు తన కుడి భాగం నుంచి సృష్టి కర్త అయిన బ్రహ్మను, తన ఎడమ భాగం నుంచి విష్ణువుని, తన హృదయ భాగం నుంచి లోక ప్రళయ కారకుడైన రుద్రుడిని పుట్టించాడు. ఈ రహస్యాన్ని వశిష్టుడు శ్రీరాముడికి చెప్పాడు.

చంద్రశేఖరుడు

శివుడి మొదటి భార్య సతీదేవి. ఈమె మరో పేరు దాక్షాయిణి. ఆమె తండ్రి దక్షుడు. పిలవని పేరంటంగా దాక్షాయిణి తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్తుంది. అయితే తండ్రి అందరి ముందు పరాభవిస్తాడు. దానితో ఆగ్రహం చెంది దాక్షాయిని యజ్ఞ గుండంలో పడి భస్మం అవుతుంది. అప్పుడు సతీ వియోగాన్ని తట్టుకోలేక శివుడు మతిస్థిమితం కోల్పోతాడు. ఉన్న చోట ఉండలేక బాధ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాడు. శివుడి ఆగ్రహానికి తరులు లతలూ బుగ్గిపాలవుతాయి. రవిచంద్రులు తేజస్సు తగ్గుతుంది. ఇదీ అదీ అని కాకుండా ప్రతిదీ తమ వైభవాన్ని కోల్పోతాయి. సకల దివ్యులూ కళాహీనులవుతారు. అసలు విషయం తెలియక దేవతలు అందరూ ఏకమై పరమేష్టి దగ్గరకు వెళ్లి తమ బాధ చెప్పుకుంటారు.

అంతట బ్రహ్మ తన దివ్య దృష్టితో వారితో ఇలా అంటాడు –
”శివుడు సతీవియోగంతో బాధ పడుతున్నాడు. ఆ వ్యధతో ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన తపోగ్ని ప్రభావమే. ఈ తాపం చల్లారాలంటే శివుడి వ్య్ధతోపాటు తపోగ్ని శాంతించాలి. ఇక్కడ మీకో ఉపాయం చెప్తున్నాను. మీరు చంద్రుడిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అర్పించండి. ఆ సుధాకరుడిని శివుడు దాలిస్తే ఆయన తాపమంతా చల్లారుతుంది. అలాగానీ మీరు చేయలేకపోతే శివుడి తపోగ్నికి త్రిలోకాలూ మాడి మసైపోతాయి…” అని.

ఇంద్రాదులు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమృతకలశంతో మందరగిరిపై తపస్సు చేస్తున్న శివుడి వద్దకు వెళ్తారు. శివుడికి నమస్కరించి ఆ అమృతకలశాన్ని తమ కానుకగా సమర్పిస్తారు. ఆ కలశ కమ్మని వాసనకు శివుడు ఆకర్షితుడు అవుతాడు. దానిని తీసుకుంటాడు. అంతే, అదేం మాయో అది కాస్తా ఆ క్షణమే అర్ధ చంద్రాకారమై శివుడి శిరస్సుపై స్థిరంగా నిలిచిపోతుంది. దాని చల్లదనానికి శివుడి తాపం చల్లారుతుంది. దానితో లోకాలన్నీ శాంతిస్తాయి. ఈ విధంగా శివుడు చంద్రుడిని దాల్చడంతో చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది.

శివలింగం
శివలింగ లక్షణాలను వివరించే హైందవ గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే ఒకటి రెండు విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పుకుందాం.

శివలింగాలు మూడు విధాలు. అవి, చలం, అచలం, చలాచలం.

ఎక్కడికైనా భక్తుడు తనతో తీసుకుపోవడానికి వీలైన దానిని చల లింగం అంటారు.

దేవాలయంలాటి ఓ నిర్దిష్ట ప్రదేశంలో స్థిరంగా స్థాపించబడిన దానిని అచల లింగం అంటారు. ఇక మూడోదైన చలాచల లింగం అవసరమైనప్పుడు పానవట్టం నుంచి విడిగా తీసుకుని మళ్ళీ పానవట్టం మీద అమర్చే స్థిర లింగాన్ని చలాచల లింగం అంటారు.

ఇలాఉండగా రంగులు బట్టి కూడా శివలింగాలు నాలుగు రకాలు. అవి, తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు.

ఆవుపాలు, శంఖం, జాజి, చంద్రుడు, ముత్యం, స్ఫటికం, మల్లెపూవులా కొన్ని లింగాలు తెల్ల రంగులో ఉంటాయి.

ఎర్ర రంగులో ఉన్న లింగాన్ని రక్త లింగం అంటారు.

పసుపు పచ్చని లింగాన్ని పీతలింగం అని అంటారు.

నల్లని లింగాన్ని కృష్ణలింగం అంటారు.

ఇవేకాకుండా కొన్ని రూపభేదాలను బట్టి కూడా కొన్ని రకాల లింగాలు ఉన్నాయి. అవి, సమలింగం, వర్ధమాన లింగం, శైవాదికం, స్వస్తికం, సర్వతోభద్రం, సార్వదేశికం, తారా లింగం, ముఖ లింగం.

Send a Comment

Your email address will not be published.