ముసాయిదా తెలంగాణా బిల్లు మీద రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మాత్రమే ఈ బిల్లును పంపించినట్టు ఆయన చెప్పారు. నిజానికి ఇదే విషయాన్ని పలువురు రాజ్యాంగ నిపుణులు ఇదివరకే చెప్పడం జరిగింది. రాష్ట్రాలను విభజించే విషయంలో పార్లమెంట్ ఆమోదం వుంటే సరిపోతుంది. తెలంగాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కూడా ఆయన నొక్కి చెప్పారు.
ఇంతకూ, శాసనసభలో సభ్యులు క్లాజ్ వారీగా చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక దీనిమీద వెనక్కి వెళ్ళడం జరగదు” అని ఆయన స్పష్టం చేశారు. కాగా తెలంగాణా ముసాయిదా బిల్లు ప్రతుల్ని ప్రత్యేక విమానంలో తీసుకు రావడం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఈ ముసాయిదాకు నకళ్ళు కూడా తీయించి గోనె సంచూల్లో తీసుకు రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నకళ్ళు తీయించుకోలేరా? ఈ సంచూల్లో వచ్చినవి నకళ్ళు కావు. నగదు కట్టలు” అని ఆయన ఆరోపించారు.