తెలుగు తల్లికి భువన విజయ నీరాజనం

తరతరాల మన తెలుగు
తరగని మన వెలుగు
కొన్ని వేల సంవత్సరాల మన సంస్కృతీ సాంప్రదాయాలకు వెన్నెముకగా నిలచిన మన భాషలో వన్నె తరగడం భాషాభిమానులకు, కళాభిమానులకు కించిత్ చింతా క్రాంతులను చేస్తుంది. అయితే వేల సంవత్సరాల సంస్కృతీ సంప్రదాయాలు కాలానుగుణంగా ప్రపంచీకరణలో భాగంగా ఎత్తు పల్లాలు చూడడం సహజం. ఈ దిశలో “భాషోద్ధరణ”, “భాషా పరిరక్షణ” అన్న నినాదాలతో ఆంధ్ర ప్రదేశ్ లోను విదేశాల్లోనూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కోవలోనే మెల్బోర్న్ కవుల సంస్కృతిక సంవేదిక “భువన విజయం” మూడవ జన్మదిన వేడుకల్లో కనుల విందైన “తెలుగుతల్లికి భువన విజయ నీరాజనం” పేరిట ఒక సాంస్కృతిక భాషా సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సభా వాచస్పతులు శ్రీ సరిపల్లి సూర్యనారాయణ గారు మరియు శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం గార్లు ఆంధ్రుల సాహితీ వాన్జ్మయంలో మహా కవుల గురించిన కొన్ని విషయాలను గుర్తు చేసారు. ఇతర కవులు ఎన్నో వైవిధ్యమైన కవితలు, పద్యాలూ, జానపదాలు, హాస్య నాటికలు, కధలు, శాయిరీలు చదివి ప్రేక్షకుల్ని ఆంధ్రుల స్వర్ణ యుగాన్ని గుర్తుకు తీసుకొచ్చారు.

భువన విజయ మూడేళ్ళ ఉత్సవం ఒక పెద్ద మైలు రాయి. ఈ మూడేళ్ళలో భువన విజయ సభ్యులు అలుపెరుగని సాహితీ ప్రయాణం చేసి తెలుగు తల్లి ఒడిలో సేద దీర్చుకుంటున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రక్రియలో మొట్ట మొదటగా మెల్బోర్న్ కవులు కవి తా సంకలనం “కవితాస్త్రాలయ” శ్రీ యండమూరి వీరంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, శ్రీ శంకు గణపతి రావు గారి రెండవ ప్రచురణ “నిప్పుల తూఫాన్” ముద్రణకై ఆర్ధిక సహాయం అందించడం, ప్రతీ సంవత్సరం తాయి నిర్వహించే “రస రాగ సుధ” కార్యక్రమంలో పాల్గొనడం, కాన్బెర్రా తెలుగు సంఘం అద్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించడం, ఇవన్నీ ఒక ఎత్తైతే సిడ్నీ నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవంలో జాతర సభ్యులతో పాటు పాల్గొని “భువన విజయ” కవి సమ్మేళనం నిర్వహించడం ఆస్ట్రేలియా ఆంధ్రుల చరిత్రలో ఒక అనిర్వచనీయమైన ఘట్టం. ఈ కార్యక్రమంలో భువన విజయ సభ్యులు ఇద్దరు శ్రీ యోగి వల్తాటి “అక్కో నీ బాంచన్” మరియు శ్రీ మురళి ధర్మపురి గారు “మురళి ముశాయిరీ” అన్న పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది. ఇదే వరుసలో ” కవితాస్త్రాలయ ” రెండవ ప్రచురణ కు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్లోబల్ ఉమెన్స్ నెట్ వర్క్ అధ్యక్షులు శ్రీమతి అరుణ చంద్రాల గారు ప్రత్యేకంగా సిడ్నీ నగరం నుండి వచ్చారు. వారు మాట్లాడుతూ “సిడ్నీలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవం లో పాల్గొన్న జాతర మరియు భువన విజయం సభ్యులకు అభినందనలు తెలుపుతూ మెల్బోర్న్ బృందం సిడ్నీవాసులకు ఎంతో స్పూర్తి నిచ్చిందని వచ్చే సంవత్సరం ‘తెలుగు సందడి’ పేరిట ఉగాది కార్యక్రమం చేయ తలపెట్టామని” చెప్పారు.
ఈ సందర్భంగా ఆస్త్రేలియ న్యూ జిలాండ్ దేశాల తెలుగు వారికి ఒక సమాచార వేదికగా “తెలుగుమల్లి.కాం” వెబ్సైటుని ఆవిష్కరించడం జరిగింది. భువన విజయ కవి పితామహులు శ్రీ సరిపల్లె భాస్కర రావు గారు ఈ వెబ్సైటుని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆంధ్రుల భగవద్గీతగా వర్ణింపబడ్డ “పెద్ద బాల శిక్ష” పుస్తకం తెలుగుమల్లి న్యూస్ లెటర్ సబ్స్క్రయిబ్ చేసిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. మొదటి ప్రతిని శ్రీమతి చంద్రాల గారు శ్రీ భాస్కర రావు గారికి అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ పవన్ మటంపల్లి మరియు వారి కార్యవర్గ సభ్యులు ఇంకా షుమారు 200 మంది భాషాభిమానులు పాల్గొని జయప్రదం చేసారు. ఈ కార్యక్రమ నిర్వహణకు “ప్లానెట్ ఇన్సురెన్స్” అధినేత శ్రీ ఆలి అహ్మద్ గారు ఆర్ధిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలందించిన వారందరికీ భువనవిజయం తరఫున శ్రీమతి షర్మిల అజిత్ కృతజ్ఞతలు తెలుపారు. వారిలో జాతర బృందం, శ్రీ మురళి బుడిగె, సునీల్ సిస్ట్ల, శ్రీ భార్గవ్ బొప్ప, సత్య నల్లం, శ్రీ మహేష్ గూడూరు, మానస ఇంకా ఎంతో మంది కార్యకర్తలున్నారు.

షిర్డీ సాయిబాబా గుడిలో మొట్టమొదటిగా భువన విజయ కార్యక్రమం జరిగిన సందర్భంగా గుడి కార్యవర్గం భువన విజయ సభ్యులందరికీ శ్రీ సాయిబాబా ఆశీస్సులు అందజేసారు. భువన విజయ సభ్యులు బాబాకు సదా మదిలో తలచుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.