కమలహాసన్ ఆవేదన

తమిళ నాడులో భారీ వర్షాలకు, వరదలకు నానా అవస్థలో పడుతున్న ప్రజల పట్ల నటుడు కమలహాసన్ త్హేరని ఆవేదన వ్యక్తం చేశారు. “సురక్షితమైన ఇంట్లో ఉంటూ వరదలో చిక్కుకున్న చెన్నైనీ , ప్రజలనూ కిటికీ ద్వారా చూడాల్సి రావడం సిగ్గుపడే విషయం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు కడుతున్న పన్నులు ఏమైపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదిస్తున్న డబ్బుకి సక్రమంగా పన్ను కడుతున్నానని, అయితే అది సరైన చోటుకి పోవడం లేదని అర్థం అవుతోందని ఆయన ట్వీట్ చేశారు. “నాకు దేవుడి మీద నమ్మకం లేదు. తమను తామే దేవుళ్ళుగా చెప్పుకునే రాజకీయ నాయకుల మీద కూడా నమ్మకం లేదు. కానీ ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చుపెట్టాల్సిన వారు ఆ పని సక్రమంగా చేయకపోవడం బాధాకరంగా ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రభుత్వాలు మాలాంటి వారి సహాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ప్రజలను ఆదుకునేందుకు ఉన్నామన్న సంగతిని ప్రభుత్వాలు మరచిపోతున్నాయి” అని ఆయన అన్నారు. “ప్రభుత్వం కంటే నేను తక్కువగానే సంపాదిస్తున్నా. అయినా సహాయం చేయడం నా బాధ్యత అని నాకు తెలుసు. కచ్చితంగా చేస్తాను కూడా. నాది ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బు కాదు. ప్రజలను నిజాయతీగా ప్రేమించే ఒక భాతీయ పౌరుడి కష్టం” అని ఆయన వివరించారు.

Send a Comment

Your email address will not be published.