కళ్యాణ్ బాబు రాజకీయాల్లోకి రాడు

నా సపోర్ట్ కాంగ్రెస్ కే – నాగేంద్ర బాబు

రజనీ కాంత్ తర్వాత సౌత్ ఇండియా స్టార్ ఎవరంటే మా తమ్ముడు కళ్యాణ్ బాబు. ఈ సమయం లో తను రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకోను. మా తమ్ముడు, నేను కలిసి తెలుగు దేశం లో చేరతామని వచ్చిన వార్తలు అబద్దం. మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటే పబ్లిక్ గా చెప్పి వస్తాము. మీడియా కి ఫీలర్లు వదిలి, రహస్యంగా పార్టీలతో మంతనాలు చేయాల్సిన అవసరం లేదు. అంత దొంగ చాటు గా చేయడానికి రాజకీయాలు ఏమన్నా సంఘ విద్రోహ కార్యకలాపాలా?

మా తమ్ముడు కళ్యాణ్ కి ప్రస్తుతం రాజకీయాల పైన ఆసక్తి లేదు. ఎప్పటికీ రాడా? అంటే కూడా చెప్పలేను. మరో పదేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ ఊహించ లేరు. నాకు ప్రత్యేకించి రాజకీయాల పైన ఆసక్తి లేదు. అయితే మా అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి కేంద్ర మంత్రి గా ఉన్నారు. అందుకని రాబోయే ఎన్నికల్లో నేను మా అన్నయ్యతో పాటు కలిసి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తాను అని బర్త్ డే బాయ్ నాగ బాబు చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 29, 1962లో మొగల్తూరి లోని సాధారణ ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబంలో రెండో సంతానంగా పుట్టాను . మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. అన్నయ్య చిరంజీవి సినిమా యాక్టర్ గా పేరు తెచ్చు కోవడంతో నేను కూడా సినిమాల్లోకి ప్రవేశించాను . లా చదివి మద్రాస్ బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నా అన్నయ్య బాట లోనే సినిమాల్లో స్థిర పడ్డాను. అన్నయ్య సినిమాల్లో సపోర్టివ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పని చేయడంతో పాటు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు కళ్యాణ్, అన్న కొడుకు రామ్ చరణ్ తోనూ స్వయం గా సినిమాలు నిర్మించాను.

రామ్ చరణ్ తో తీసిన ఆరంజ్ సినిమా అప్పుల ఊబి లోకి నెట్టినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే మెగా స్టార్, పవర్ స్టార్ కలిసి ఆ అప్పులు తీర్చి ఆదుకున్నారు. మనస్పర్ధలు, గొడవలు ఎన్ని ఉన్నా రక్త సంబంధం గొప్పదని పెద్దలు అందుకే అంటారు.
ప్రస్తుతం సినిమా నిర్మాణం వైపు వెళ్ళ దలుచు కోలేదు. ఈటీవీ లో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాంలో జడ్జి గాను, సీరియల్స్ లోను నటిస్తున్నాను. మా అబ్బాయి వరుణ్ హీరోగా రాబోతున్నాడు. అతన్ని మంచి హీరోగా చూడాలని ఉంది. అందుకు తగ్గ కధల ఎంపికలో ఉన్నాను. అంతే కానీ మాకెవరికీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే తీరిక లేదు.

Send a Comment

Your email address will not be published.