ప్రముఖ హాస్యనటుడు కళ్ళు చిదంబరం ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015 అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు
ఆయన మృతి సందర్భంగా మా అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ టీవీతో మాట్లాడుతూ “ఆయన కళ్ళు ఆయనకు ఎలా ఉన్నాయో కానీ మేము వాటిని ఉపయోగించుకున్నాం. ఆయన క్యారక్టర్ ఉన్న నటుడు” అని పేర్కొన్నారు.
మూడు వందలకు పైగా చిత్రాలలో నటించిన కళ్ళు చిదంబరం ఇంటిపేరు కొల్లూరి. ఎం.వి.రఘు “కళ్ళు” చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఈ చిత్రం పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.
1945 అక్టోబర్ 10న విశాఖలోని అక్కయ్యపాలెంలో జన్మించారు. చిదంబరం కళ్లు చిత్రంతోపాటు అమ్మోరు, చంటి, మనీ, పెళ్లిపెందిరి, పవిత్రబంధం, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒకరోజు, కొండవీటి దొంగ, మృగరాజు, శ్వేత నాగు తదితర చిత్రాల్లో నటించారు. ఆయన తన ప్రత్యేకమైన నటనతో విశేష గుర్తింపు పొందారు. టాలీవుడ్ లోకి రాకముందు ఆయన అనేక నాటకాల్లో నటించారు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించినా దానికి కూడా ఆయనకు మంచి పేరే వచ్చింది. ఆయనకు దర్శకులు ఈ వీ వీ సత్యనారాయణ, ఎస్ వీ కృష్ణా రెడ్డి, రేలంగి నరసింహారావు తదితరులు మంచి అవకాశాలు ఇచ్చారు.
ఆయనకు నంది అవార్డు కూడా కళ్ళు సినిమా వల్లే దక్కింది.
ఆయన మృతిపట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపం తెలిపింది.