సీమంధ్రలో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ స్థానాలు ఏమీ రాక పోవచ్చనే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. రాష్ట్ర విభజనకు సారధ్యం వహించి 90 శాతం కంటే ఎక్కువ మంది ఒద్దన్నా నిట్టనిలువునా చీల్చిన పాపానికి ఒడిగట్టాల్సిందేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 25 లోక్ సభ స్థానాలున్న సీమంధ్రలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి ఎక్కువ అనుకూలంగా వుందని వారికి షుమారు 11 – 17 సీట్లు వచ్చే అవకాశం వుందని తరువాత స్థానంలో తెలుగు దేశం 10 – 16 సీట్లు వచ్చే అవకాశం ఉందనీ పలువురు మేధావులు రాజకీయ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. 10 ఏళ్ల క్రితం 2004 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ కు 29 సీట్లతో అత్యధిక మెజారిటీ వచ్చి పార్టీకి ప్రాణం పోసింది. ఈ పరిస్థితి పూర్తిగా తలక్రిందులై ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నట్లు చాల మంది అభిప్రాయ పడుతున్నారు. ఇదంతా పార్టీ స్వయం క్రుతాపరాధమేనని పార్టీ అధిష్టాన వర్గం బాధ్యత వహించాలని ఉద్దండులైన రాజకీయ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. వైఎస్సార్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశం ఉందనీ తెలుగు దేశం మరియు బి జె పి సంయుక్తంగా రెండవ స్థానంలో వున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇతరత్రా చిన్న పార్టీల కన్నా తక్కువ వచ్చే అవకాశం వున్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. 175 స్థానాలున్న సీమంధ్రలో ఈ తడవ వైఎస్సార్ పార్టీకి షుమారు 110 స్థానాలు రావచ్చన్న అంచనా. అయితే ఎన్నికలకు ఇంకా కొంత సమయం వుండటం వలన పరిస్థితులు తారు మారవ్వచ్చనే అంచనాలు కూడా వున్నాయి.
ఇదిలా వుండగా తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ వరకు తెలంగాణ రాష్ట్ర సమితికి వోటర్లు పెద్ద పీట వేసే అవకాశం ఉందనీ లోక్ సభ ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం వున్నట్లు రాజకీయ వేత్తలు భావిస్తున్నారు.
ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తెలిసేంత వరకు వేచి చూడాల్సిందే.