కాంగ్రెస్ కురు వృద్ధులు - పాల్వాయి గోవర్ధన రెడ్డి

భారత మొదటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పటి రాహుల్ గాంధీ వరకు షుమారు 50 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల శ్రీ పాల్వాయి గోవర్ధన రెడ్డి గారు మొదటి సారిగా ఆస్ట్రేలియా రావడం జరిగింది. వారు గత వారం మెల్బోర్న్ నగరం వచ్చిన సందర్భంగా మన తెలుగు కమ్యూనిటీ అధినేత శ్రీ రాంపాల్ ముత్యాల గారు సన్మాన సభ ఏర్పాటు చేసారు. ఈ సన్మాన సభకు బెంట్లీ మాజీ పార్లమెంట్ సభ్యలు ఎలిజబెత్ మిల్లర్ మరియు ఇండియన్ వైస్ కాన్సుల్ శ్రీ భగత్ గారు కూడా విచ్చేసారు. ఈ సన్మాన సభలో శ్రీ గోవర్ధన రెడ్డి గారికి శ్రీ రాంపాల్ రెడ్డి గారు, ఎలిజబెత్ మిల్లర్ మరియు మెల్బోర్న్ ఫోరం మరియు ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీ గోవర్ధన రెడ్డి గారు తెలుగుమల్లితో ముచ్చటించడం జరిగింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి కారణాలు చెబుతూ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొంత అశ్రద్ధ జరిగిందనీ ఇప్పుడు అట్టడుగు స్థాయి నుండి అన్ని వర్గాలను కలుపుకొని పనిచేయడం జరుగుతుందనీ వివరించారు. ఆ కారణంగానే మొన్న బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మ్రోగించిందని చెప్పారు. శ్రీ మోడీ ఆద్వర్యంలోని ప్రస్తుత బి.జె.పి. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే అమలు చేస్తుందని క్రొత్తగా ఏ కార్యక్రమాలూ వారి అజెండాలో లేవని ఎద్దావా చేసారు. బి.జె.పి. ప్రభుత్వం పెట్టుదారులు, వ్యాపారవేత్తల ప్రభుత్వమనీ, ప్రజలకు ఏమీ మేలు కలగదనీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమనీ చెప్పారు.

శ్రీ గోవర్ధన రెడ్డి గారు 1936 నవంబరు 20 వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట మండలం, నడింపల్లి గ్రామంలో శ్రీ రంగారెడ్డి మరియు అనసూయమ్మల మొదటి సంతానంగా జన్మించారు. హైదరాబాదు లోని వివేకవర్ధినీ కాలేజీలో పట్టా పుచ్చుకొని సామాజిక రాజకీయ రంగాల్లో చురుకుగా పనిచేస్తుండేవారు. 1967లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాజకీయ రంగానికి అరంగేట్రం చేసారు. అటు ప్రభుత్వంలోనూ రూరల్ వాటర్ సప్లై, యూత్ సర్వీసెస్, సెరి-కల్చర్ ఇంకా ఎన్నో మంత్రి పదవులు చేపట్టి ఇటు పార్టీ శ్రేణుల్లోనూ నమ్మకమైన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ అంతరంగ సలహాదారునిగా కొనసాగుతూ 2012 లో రాజ్యసభకు ఎన్నికై వాటర్ రిసోర్సెస్, సివిల్ ఏవియేషన్ మొదలైన అనేక కీలక పదవుల్లో భారత ప్రభుత్వానికి వారి సేవలందిస్తున్నారు.

ఇక్కడి భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సేవలందిస్తూ ఆస్ట్రేలియా-భారత ప్రభుత్వాల మధ్య వారధిగా సత్సంబంధాలు నెలకొల్పడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. బొగ్గు, యురేనియం, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలున్నాయని శ్రీ రెడ్డి గారు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.