కాంగ్రెస్ వల్లే తెలంగాణా వచ్చింది

తెలంగాణా రాష్ట్రం రావడం తనకెంతో ఆనందంగా ఉందని విజయశాంతి చెప్పారు. తెలంగాణా ప్రజల సుదీర్ఘ కల అని చెబుతూ, వారి దీర్ఘకాల పోరాటానికి లభించిన విజయమిది అని ఆమె తెలిపారు.
1998 లో రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఆమె తాను ప్రత్యేక తెలంగాణా కోసం పోరాటం చేసానని చెప్తూ 1999 లో తెలుగు దేశంలో చేరానన్నారు. కానీ ఆ పార్టీ అధినేత తెలంగాణకు అనుకూలంగా లేకపోవడంతో తాను పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరానని వివరించారు. అయితే బీజేపీ నాయకుడు అద్వానీని కలిసి తన మనసులోని మాటను చెప్పగా ఆయన కూడా అప్పట్లో తెలంగాణా గురించి అనుకూలంగా మాట్లాడక పోవడంతో తాను విడిగా తల్లి తెలంగాణా అనే పార్టీ స్థాపించానని గుర్తుచేశారు. అప్పుడే తెలంగాణా రాష్ట్ర సమితి (టి ఆర్ ఎస్) నేత కె సి ఆర్ మనమిద్దరం కలిసి పోరాడుదామని చెప్పడంతో సరేనని తన  తల్లి తెలంగాణా పార్టీని టీ ఆర్ ఎస్ లో విలీనం చేసినట్టు విజయశాంతి పేర్కొన్నారు.
కానీ ఆ తర్వాత కె సి ఆర్ నన్ను దగా చేసారన్న విషయాన్ని తెలుసుకున్నానని అంటూ తానుగా టీ ఆర్ ఎస్ నుంచి బయటకు రాలేదని, కె సి ఆర్ తనను పార్టీ నుంచి బహిష్కరించారని అన్నారు.
దాదాపు నాలుగున్నర సంవత్సరాలు తాను టీ ఆర్ ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. గత లోక్ సభ  ఎన్నికలప్పుడు తాను  గెలవకూదడనే దురుద్దేశంతో కె సి ఆర్ తనను మహబూబ్ నగర్ నుంచి పోటీ చెయ్యమని అడిగినప్పుడు తాను అక్కడ నుంచి పోటీ చేయనని గట్టిగా చెప్పడంతో ఆ తర్వాత తాను మెదక్ నుంచి పోటి చెయ్యవలసి వచ్చిందని అన్నారు. ఈ మెదక్ నుంచే కదా గతంలో ఇందిరా గాంధి పోటీ చేసి గెలిచారని ఆనాటి ఎన్నికల విషయాన్ని చెప్పిన ఆమె 2009 నాటి లోక్ సభ ఎన్నికల్లో గెలిచినప్పటికీ తాను తెలంగాణా కోసం చేస్తూ వచ్చిన డిమాండ్ ను మాత్రం మానలేదని చెప్పారు.
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కావడానికి కారణం కాంగ్రెస్ కావడం వాళ్ళ తాను ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధిని కలిసి థాంక్స్ చెప్పానని అన్నారు. అలాగీ ఆ క్షణంలోనే తాను ఆ పార్టీలో చేరానని తెలిపారు. తెలంగాణా ఇస్తే టీ ఆర్ ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే మాట మార్చిన కె సి ఆర్ ను ఎవరూ నమ్మరని,  ప్రజలు అన్ని గమనిస్తున్నారని విజయశాంతి చెప్పారు.
వచ్చే జూన్ నెలలో తెలంగాణా రాష్ట్రం వస్తుందన్న ఆనందంలో తాను ఉన్నానని చెబుతూ తాను ఇప్పట్లో సినిమాలో నటించే అవకాశం లేదని అన్నారు. తన దృష్టి అంతా తెలంగాణా అభివృద్ధి పైనే ఉందని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.