కాంతం జిందాబాద్....

“నాకెంతో కొంత కీర్తి ఉంది. ముప్పై అయిదు పుస్తకాలు రాసాను. ప్రచురించాను. కథలు, స్కెచ్చులు, నాటికలు, నాటకాలూ, వ్యాసాలు రాసాను. అలాగే పిల్లలకు కూడా కొన్ని రాసాను. నేను సృష్టించిన కాంతం పాత్ర తెలుగు భాష మాట్లాడేంత వరకు సాహిత్యంలో సజీవంగానే ఉంటుంది. ఆహునిక సాహిత్యంలో కాంతం కథలు ఎంతో విశిష్టమైనవి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. తెలుగు సాహిత్యానికి నేను గణనీయమైన సేవ చేసినట్టే నమ్ముతున్నాను”
అని మునిమాణిక్యం నరసింహా రావు చెప్పుకున్నారు.

“నా హాస్య గ్రంధాలు విస్తృతంగా చదువుతున్నారు. బాగా మెచ్చుకుంటున్నారు. నేను తెలుగు హాస్యానికి చేసిన సేవను ప్రశంసిస్తున్నారు….” అని చెప్పుకున్న మునిమాణిక్యం అనే పేరు స్పురించడంతోనే మన ముందు రెండు విషయాలు ఉంటాయి. అవి కాంతం. హాస్య రస పోషణ.

కాంతం క్యారక్టర్ తో హాస్యం పండిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న మునిమాణిక్యం కాంతం కథలలో ఆమె భర్త ఎక్కువగా ఉత్తమ పురుషలోనే కనిపిస్తారు. అక్కడక్కడా వెంకట్రావు అనే పేరుతో కనిపించేలా కథలు రాసిన మునిమాణిక్యం 1898 మార్చి 15వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో సంగం జాగర్లమూడి అనే చోట జన్మించారు.

తెనాలి, విజయవాడ తదితర ప్రాంతాలలో చదుకున్న మునిమానిక్యానికి గుంటుపల్లి వారి ఆడపడచు శేశాగిరితో పెళ్లి అయ్యింది. ఆయన టీచర్ గా పనిచేసారు.

ఆయన కథలు చాలావరకు ఆత్మ సద్రుశాలే. ఆయన కాంతం కథల్లో కాంతం పాత్ర ఎంతో గొప్పదో ఆమె భర్త పాత్ర కూడామరీ మరీ గొప్పది.

ఆయన ఒక చోట ఇలా అన్నారు –
ఒక చమత్కార వాక్యం వింటే తాము పులకించి పోతామని, దానిని ఎలాగైనా పదిలపరచి పది మందికీ అందజేయాలని ఆరాటం కలుగుతుందని ఆయన పదే పదే చెప్పుకునే మునిమాణిక్యం పుస్తకాలు ముద్రించిన సంస్థ ఆయనను పరిచయం చేస్తూ ఇలా అనేది….”మునిమాణిక్యం వారిని చూచి ముసిముసి నవ్వులు నవ్వని ఆంధ్రుడు ఉండడు. వీరి రచనలు అన్నీ నవ్విన్చేవే.” అని

ముట్నూరి కృష్ణారావు గారితో తమ తొలి సమావేశం గురించి రాస్తూ ఆయన ఇలా చెప్పుకున్నారు –

“విశ్వనాధ సత్యనారాయణ నన్ను పంతులు గారికి చూపిస్తూ ఇతడే మునిమాణిక్యం నరసింహారావు ” అన్నారు. అప్పుడు ముట్నూరి వారు ముసిముసిగా నవ్వి కాంతం మొగుడేగా అని అన్నారు. అప్పుడు నాకూ నవ్వు వచ్చింది….”

ఆయన ఒక పుస్తకం ముందుమాటలో “నేను హాస్య విష్ణువును. బ్రహ్మ వేరే ఉన్నారు. ఆయన భమిడిపాటి కామేశ్వర రావు. నేను శతాధిక గ్రంధకర్తను. హాస్యరహస్య విదిత యశోభూషణుడు అని చెప్పుకోవాలి అని సరదాగా ఉంది. చెప్పుకుంటాను” అని చెప్పుకున్న మునిమాణిక్యం హాస్యం తెలికైనదని, బరువులేనిదని అంటారు. బరువు లేకపోతేనేం బంగారంలాంటి సరుకు హాస్యం అని ఆయన అభిప్రాయం.

జీవితానికి ఆనందాన్ని ఇచ్చేది హాస్యం. అంతకన్నా ఇంకేం కావాలి అని ప్రశ్నించేవారు. హాస్య సృష్టికి విశిష్టమైన దృష్టి అవసరమని చెప్పేవారు.

హాస్యం లోతులు తెలియడం కొంచం కష్టమే. అయితే కవిత్వాన్ని అర్ధం చేసుకున్నట్లే హ్హస్యాని అర్ధం చేసుకోవాలంటారు. చమత్కారపు లోతులు తెలిసి ఆనందిస్తే ఎంతో బాగుంటుందని ఆయన మాట.

నవ్వడం, నవ్వించడం నీకు, ఎదుటివారికి కూడా మేలు చేస్తుంది. అయితే ఇతరులను నవ్వించడం అంత సులభం కాదు. వెకిలి మాటలు చెప్పి నవ్విస్తే ఎదుటివారి దృష్టిలో తక్కువవడం తధ్యమని ఆయన హెచ్చరిక చేసారు.

ఆయన రాసిన మొదటి కథ “టీ కప్పులో తుఫాను” ఓ చిన్న శృంగార కలాపమే ఇందులోని ప్రధాన కథా వస్తువు. అందులో కనిపించిన కాంతం ఆయన జీవితమంతా ఎంతగా ముదివేసుకుపోయిందో వేరేగా చెప్పక్కర్లేదు.

ఆయన మొదట్లో తన భార్య మాటలూ, శృంగార చేష్టలూ కథా వస్తువుగా చేసుకుని కథలు రాసారు. రాయగా రాయగా కాంతం ఆయన మనసులో పెరిగి పెద్దదైంది. మనసులో పెరిగి పెద్దదైన కామ్థాఅనికి నా భార్య ఎప్పటికప్పుడు ప్రతిబింబంగా నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మునిమాణిక్యం తొలి నాటకం తిరుగుబాటు. అది 1938 – 39 ప్రాంతంలో రాసిన నాటకం.

హాస్య రచనలో సుప్రసిద్ధులైన మునిమాణిక్యం జీవితంలో 1938వ సంవత్సరం అత్యంత విషాదకర సంవత్సరం. ఆ ఏడాది మొదట్లో ఆయన భార్య పది రోజుల అనారోగ్యంతో మరణించగా మరో ఎనిమిది నెలలకు పెళ్ళైన పెద్ద కుమార్తె రుక్మిణి చనిపోయింది. ఈ రెండు విషాదకర సంఘటనల నుండి కోలుకోవడానికి ఆయనకు కొంత కాలం పట్టింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ కాంతం కథలు, ఇతర చమత్కార రచనలూ చేసారు. ఆయన జీవితంలో ద్వితీయ వివాహం ఒక ముఖ్యఘట్టమే. ఈ క్రమంలో ఆయన కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన రెండో భార్యను ప్రేమగానే చూసుకున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కుటుంబంలో కొన్ని కలతలు వచ్చినప్పుడు ఆయన లోలోపల బాధపడ్డారు.

ఆయన తమ స్వీయ చరిత్రలో కొన్ని ఘట్టాలు తెసుకుని మేరీ కహానీ అంటూ ఒక పుస్తకం రాసారు. అది మొదటిసారి 1943 లో అచ్చయ్యింది. దీనిని అద్దేపల్లి అండ్ కో వారు 1946 లో అచ్చు వేసారు. మేరీ కహానీ అంటే నా కథ. అంది ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్తూ తన కథ రాసేవాళ్ళు ఎవ్వరూ దొరకక తన సంగతులు తానె రాసుకుంటున్నాను అని వెల్లడించారు. ఈ పుస్తకానికి ముందు మాట తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు రాసారు. ఈ పుస్తకంలో ఆయన మిత్రులతోను, ఇతరులతోనూ తనకు సమకూడిన కొన్ని సన్నివేశాలను రమణీయంగా రాసుకున్నారు. ఆయన రచనలు ఆంద్ర భారతి, ఆంధ్రజ్యోతి వార పత్రిక, ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలు, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో వెలువడ్డాయి.

ఆయనకు తర్క శాస్త్రం అభిమాన విషయం. అలాగే మనస్తత్వ శాస్త్రం. మృదుమధురమైన వ్యావహారిక భాషలో రచనలు చెయ్యడం ఆంధ్రులు చేసుకున్న అదృష్టం .

1973 ఫిబ్రవరి 4వ తేదీన ఆయన తన 75వ ఏట హైదరాబాదులో కన్నుమూసారు.

జీవితంలో ఏడుపు ఎటూ ఉన్నది…కాస్త నవ్వించే ఉల్లాస పరిచే వస్తువు తీసుకొని రచనలు చేద్దాం అనే ఆంతర్యాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన మునిమాణిక్యం హాస్యం ఈ భూమి ఉండేంత వరకు వర్ధిల్లుతుంది. ఇది అతిశయోక్తి కాదు. మనసారా కోరుకుంటున్న నిజమైన మాట. నిజమవుతున్న మాట….నిజమయ్యే మాట కూడా.

– కళ్యాణీ రెడ్డి

Send a Comment

Your email address will not be published.