కాన్బెర్రా గాట్ టాలెంట్

కాన్బెర్రా ఉగాది వేడుకలు ఈ సంవత్సరం క్రొత్త పుంతలు తొక్కి తెలుగుదనాన్ని, తెలుగు భాషలో వున్న కమ్మదనాన్ని వెలుగెత్తి చాటింది. గత సంవత్సరమే తెలుగు బడిని మొదలు పెట్టిన కాన్బెర్రా తెలుగు సంఘం ఆ బడిలో చదివిన పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ సంవత్సరం ఉగాది వేడుకలను జరుపుకోవడం ఎంతో ముదావహం. అంతే కాకుండా ఈ సంఘం చరిత్రలో మొట్టమొదటి సారిగా “తెలుగు వెలుగు” అన్న పేరుతొ ఉగాది సంచికను ఆవిష్కరించడం తెలుగు భాషపై వారికున్న మమకారానికి ప్రతీక. కాన్బెర్రాలోని చాలామంది కవులు, రచయితలు వారి కలానికి పదునుపెట్టి కాలంతో పోరాటం సాగించి వ్రాసిన కవితలు, కధల సంకలనం ఈ “తెలుగు వెలుగు”. షుమారు 450 మంది హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాస భరితంగా పసందైన విందుతో గాన నృత్య కార్యక్రమాలతో జరిగింది.

ఏప్రిల్ 12 వ తేది (శనివారం) కాన్బెర్రాలో ఉగాది సంబరాలు అంబారాన్నంటి తెలుగు మాట పాట సాంప్రదాయ నృత్యరీతులతో కనువిందు చేసాయి. పిల్లలు, పెద్దలు అందరూ నూతనోత్సాహంతో ఈ జయ నామ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు.
మరెంతో మంది ప్రముఖులు ఇండియన్ హై కమిషనర్ (బీరేన్ నంద), పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కేట్ లెండి మరియు ఇతర కాన్బెర్ర రాజకీయ ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమానికి ఎంతో హుందాతనాన్ని తెచ్చారు.

గణపతి దేవుని నామ స్మరణం తో ప్రారంభమై లుగు వారి సాంప్రదాయ నృత్యమైన కూచిపూడి నృత్యాన్ని “వెంపటి చిన సత్యం” గారి మేనకోడలు “శ్రీమతి దశిక వనజ గారు ” అత్యద్భుతంగా ప్రదర్శించారు. ఆ తరువాత పంచాంగ శ్రవణంమరియు కవిత్వాలతో ప్రారంభించి చిన్నారులు, యువత నృత్య రీతులను ప్రదర్శించగా ఈ సంవత్సరం ప్రారంభించిన “తెలుగు బడి” చిన్నారులు తాము నేర్చుకొన్న తెలుగు సామెతలు, పాటలను, పద్యాలను వినిపించి మరియు మన కవులు,రాజులు, నాయకుల వేష ధారణలతో అందరి ప్రశంసలను అందుకొన్నారు.

కాన్బెర్ర తెలుగు సంఘం ఎంతో నిబద్దతతో .. తెలుగు అక్షరంపైన మక్కువతో ఈ జయ నామ సంవత్సరం “తెలుగు వెలుగు” పేరిట ఒక ఉగాది ప్రత్యెక సంచికను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కాన్బెర్ర తెలుగు సంఘం ఇతర సంస్కృతులను గౌరవిస్తూ “ఆఫ్రికన్ డ్రమ్స్” వారికి కొంత సమయాన్ని కేటాయించి .. ఆంగ్ల యువతులను కూడా కలుపుకొని మన భారతదేశాన చీరకట్టుకు ఉన్న ప్రత్యేకతను ప్రదర్శించి చూపటం ఎంతో హర్షణీయం.

“తెలుగు మల్లి” సంపాదకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కాన్బెర్ర తెలుగు సంఘానికి “తెలుగు వెలుగు” సంచిక ముద్రణలో ఎంతో సహకరించి వారి చిరకాల వాంఛను రూపు దాల్చటంలో ముఖ్యభూమికను పోషించారు.

అధ్యక్షులు శ్రీ కృష్ణ నడింపల్లి గారు చేస్తున్న కార్యక్రమాలను వివరించి వాటి అభివృద్దికి ఉత్తరోత్తరా చేయవలసిన విధానాన్ని వివరించారు .. చివరగా.. ఉపాధ్యక్షులు శ్రీమతి సాహితి, కార్యదర్శి శ్రీ చిట్టిబాబు గార్ల ధన్యవాదాలతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

 

Send a Comment

Your email address will not be published.