కాన్బెర్రా లో కొత్త కవి

కాన్బెర్రా లో కొత్త కవి

ఆస్ట్రేలియాలో తెలుగు సాహితీ పరిమళాలు వెల్లువై పయనిస్తున్నాయనడానికి ఈ క్రింది కవితే నిదర్శనం.  తెలుగు భాషాభిమాని, కాన్బెర్రా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ నడింపల్లి కృష్ణ గారు తెలుగు వారన్నా తెలుగు భాషన్నా అమితమైన ప్రేమ.  గత ఏడాదిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించి సిడ్నీ తెలుగు మహోత్సవానికి కాన్బెర్రా తెలుగు ప్రతినిధులందరికీ సారధ్యం వహించి ఇప్పుడు తెలుగులో ఎంతో చక్కని కవితల్ని వ్రాయడం ప్రారంభించారు.  వారు వ్రాసిన కవిత ఇక్కడ ప్రచురిస్తున్నాం.  ఈ కవితని స్పూర్తిగా తీసుకొని మరెందరో తెలుగు కవులు ముందుకు రావాలని తెలుగుమల్లి కోరుకుంటోంది.

 

 

నాకు ఆదర్శం….

సముద్ర కెరటం నాకు ఆదర్శం –
తీరం చేరినందుకు కాదు
తీరం చేరేందుకు పడినా లేచినందుకు
నిశ్చల నీటిలోనున్నమహాశక్తిని కూడ దీసుకున్నందుకు
ప్రశాంత పవనాన్ని తోడు తీసుకున్నందుకు
తీరం చేరడానికి పోరాట పటిమ చూపినందుకు
అందరిని ఆహ్లాధపరచి తన లోకానికి తిరిగి చేరినందుకు

మౌన మనస్సులో నిశ్చల శక్తిని గ్రహించమని
తోటి వారిని కలుపుకొని పాటు పడమని
నీ సంతోషం నలుగురితో పంచుకోమని
సందేశం నా కిచ్చినందుకు
కర్తవ్యం భోధించినందుకు –
సముద్ర కెరటం నాకు ఆదర్శం
అదే జీవితానికి అర్ధం పరమార్ధం

Send a Comment

Your email address will not be published.