కార్తీకంలో అమావాస్య

కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు ఎంతో పవిత్రమైనది. శివకేశవులకు ప్రీతిపాత్రమైనది. మహిమాన్వితమైనది. ఈ మాసంలో ఏ సత్కార్యం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని చెప్పాలంటారు. ఈ మాసంలో శివార్చన చేసే వారికి ఈతి బాధలు, గ్రహదోషాలు ఉండవంటారు. ఈ నెలలో ముఖ్యమైన పండుగలు క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి అని ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఈ రెండింటినీ అటుంచితే ఈ నెలలో వచ్చే అమావాస్య రోజు ఆలయాలలో రకరకాల ఆకారాలలో దీపాలు పెట్టడం ఆనవాయితీ. ప్రమిదలలో నూనె పోసి వత్తులు వేసి వెలిగిస్తే ఆ కార్తీక దీపాలు, పాపాలనే చీకటిని దూరం చేస్తాయి. ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం లభిస్తుందని నమ్మిక. అంతెందుకు కొందరైతే లక్ష వత్తుల నోము కూడా చేస్తారు.

ఇక్కడో దీపం ప్రత్యేకత చూద్దాం.

అరటి చెట్లు కొట్టి మానులు తీసుకొస్తారు. ఒక్కొక్క పొరా వలిచి కొంతసేపటికి ఆకుపచ్చ పట్టాలు పోయి తెల్లటి పట్టాలు వస్తాయి. వాటిని కత్తిరించి అడుగు పొడుగున దొన్నెలుగా చేస్తారు. ఈ దొన్నెలకు రెండు వైపులా మైదా పిండి ముద్దలతో వాటి అంచులను మూస్తారు. ఇలా చేయడం వల్ల లోపల పోసే నూనె , వత్తి వంటివి బయటకు రావు. ఇలా తయారైన అరటి దొన్నెల పడవలలో పోలి అనే ఓ పవిత్రురాలు దీపారాధన చేసినట్లు ఓ కథనముంది. ఈమె మహా భక్తురాలు. తాను పెట్టిన ఈ దీపాల వల్లే ఆమెకు స్వర్గప్రాప్తి కలిగిందని అంటారు. అరటి దోన్నెల్లో చిన్న చిన్న ప్రమిదలు ఉంచి దీపాలు వెలిగిస్తారు. పసుపు, కుంకుమ, పువ్వులతో ఆ దీపాలను పూజించి నీళ్ళలోకి విడిచిపెడతారు. నిజానికి ప్రవహించే నీటిలో ఈ దీపాలను విడిచిపెట్టాలని శాస్త్రం. కానీ ఆ వీలు లేని వారు కనీసం నీటిలో వాటిని విడిచిపెట్టినా పరవాలేదంటారు పెద్దలు. ఈ తరహా దీపారాధన ఏడాదికోసారి కార్తీక మాసంలో జరుపుకోవడం పుణ్యప్రదం.

Send a Comment

Your email address will not be published.