మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తాను కొత్తగా ప్రారంభించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని అతి త్వరలో రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయిన రెండు రాష్ట్రాలనూ మళ్ళీ కలపడమే ధ్యేయంగా ఆయన తన పార్టీని గత జనవరిలో ప్రారంభించారు. తన పార్టీకి చెప్పుల గుర్తును ఎంచుకున్నారు. సీమాంధ్ర, హైదరాబాద్ లలో ఆయన 40 మందికి పైగా అభ్యర్థుల్ని కూడా నిలబెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో ఆయన పార్టీ బలం పుంజుకోలేక పోతోంది. పైగా ఆయన పార్టీలో చేరిన సీనియర్ నాయకులంతా ఒక్కరొక్కరే అందులోంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. చివరికి ఆయన తన ఓటమిని ముందే ఊహించి తానే పోటీ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయ దలచుకోక తన తమ్ముడిని తన నియోజకవర్గంలో నిలబెట్టారు. బహుశా కొద్ది రోజుల్లో ఇక పార్టీని రద్దు చేసి (ఎన్నికల తరువాత కావచ్చు) తాను రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది.