కుష్వంత్ సింగ్ ఓ అద్భుతం....

కుష్వంత్ సింగ్ మరో 11 నెలలు జీవించి వుంటే వందేళ్ళు నిండి వుండేది.  20వ శతాబ్దపు భారతదేశపు రచయితలలో తనదైన శైలిలో ఒక రచయితగా, పాత్రికేయునిగా, గ్రంధ రచయితగా మరువరాని ముద్ర వేసి తన ఆఖరి శ్వాస వరకూ కలమే ఆయుధంగా కాలం గడిపిన చిరస్మరణీయుడు శ్రీ కుష్వంత్ సింగ్.  వారి గురించి వారి మాటలల్లోనే…

“ఎవరినీ కలవక ఈమధ్య రోజులు గడిపేస్తున్నాను. అయినా నన్ను ఒంటరిగా వదిలేస్తేనే నాకు ఆనందం. హాపీగా ఉంటాను. నేనెప్పుడూ ఏకాకినని ఫీల్ అవలేదు. నాకెప్పుడూ పుస్తకాలు తోడు ఉండేవి. రోజంతా పుస్తకాలు చదువుతూ గడిపేయగలను. నా చేతులు వణకడం మొదలుపెట్టాయి. అయినా నేను ఎలాగోలా రాసేస్తున్నాను.

వయస్సు మీదపడిన ఈ రోజుల్లో మునపటికన్నా మరింత త్వరగానే  లేస్తున్నాను. ఇంకా నేను రాయవలసినది ఏముంది? అని ఆలోచిస్తాను. ఆ రోజు ఇంకా ఏం చెయ్యాలి అని అనుకుంటాను. టీవీలో వార్తలు వింటాను. తరచు నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోతాను. దేశ విభజన జరగని రోజుల్లో అంటే  మా పూర్వీకులు ఉన్న, నేను పుట్టిన   హదాలి గ్రామం (ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ పరిధిలోనిది) గురించి ఆలోచిస్తాను. అక్కడ ఎక్కువ శాతం మంది ముస్లీములే. అక్కడి జనాభాలో 95 శాతం మంది వారే. కొన్ని హైందవ, సిక్కు కుటుంబాలు అక్కడ ఉండేవి. ఒకే ఒక్క గురుద్వారా ఉండేది. ఎప్పుడూ కులమత వైషమ్యాలు ఉండేవి కావు. దేశ విభజన జరిగిన తర్వాత అంటే భారత్, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయిన తర్వాత రెండు సందర్భాల్లో నేను పుట్టిపెరిగిన హదాలి గ్రామానికి వెళ్ళివచ్చాను. వాళ్ళు నన్ను చూడగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నాకు ఘన స్వాగతం పలికారు. ఊరంతా బానర్లు  కట్టారు. ఆ స్వాగతం నన్ను కట్టిపడేసింది. ఆరోజుల్ని తరచు స్మరించుకునేవాడిని.

దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలపై ఆందోళన పెరిగిపోతోంది.

మరణం గురించి నేను తరచుగా ఆలోచిస్తాను. అలాగే నా మిత్రుల గురించి కూడా. వాళ్ళందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో ? ఏం చేస్తున్నారో?

మన  ఇళ్ళల్లో ఎందుకని మృత్యువు గురించి మాట్లాడుకోమో అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరణమనేది వాస్తవం. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కొన్నేళ్ళ క్రితం నేను ఒక్కడిని వెళ్లి శ్మశానంలో కూర్చునేవాడిని. అలా కూర్చోవడం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అదొక థెరపీలా పనిచేసింది. ఒకసారి మృత్యువుపై కూడా రాసాను…ఇక్కడ ఒకడున్నాడు…అతను మనిషిని గానీ దేవుడిని గానీ విడిచిపెట్ట లేదు. అతని కోసం నీ కన్నీళ్లను వృధా చెయ్యకు. అతను నానా చెత్తా రాసాడు. అతను మరణించాడు….థాంక్స్….

మృత్యువు అనేది వినూత్నమైనది కాదు. పుట్టిన ప్రతీ మనిషికి మరణం తప్పదు. కనుక మరణం చేరువ వుతున్నప్పుడు బాధపదవలసింది లేదు. అయినా తమ సన్నిహితులను కోల్పోయినప్పుడు బాధపడటం మానవసహజం. అలాగని కుళ్ళి కృశించి పోవలసిన పని లేదు. మరణమనేది ప్రకృతిపరమైనది. మృత్యువు వచ్చినప్పుడు హుందాగా చచ్చిపోవాలి. డై విత్ డిగ్నిటీ పేరిట మినూ మసాని స్థాపించిన సొసైటీ లో నేను సభ్యుడిని. అలాగని నేను మృత్యువుకు భయపడనని  చెప్పను. కానీ అది సుధీర్గమైనదిగా బాధాకరమైనదిగా ఉండకూడదన్నదే నా అభిప్రాయం.

70 ఏళ్ళు పైబడినవాళ్ళు మరణిస్తే వారి మరణాన్ని కొనియాడాలి. పాటలు పాడాలి. నృత్యాలు చెయ్యాలి. విందులు చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మరణమనే వాస్తవాన్ని ఒప్పుకోవాలని. నేను దాదాపుగా అన్ని మతాలకు దూరమే అయినా జైనిజానికి కాస్తంత దగ్గరలో ఉన్నానా అని అనిపిస్తుంది. ప్రతీ మనిషి తన ప్రాపంచిక బాధ్యతలన్నింటినీ తృప్తిగా నెరవేర్చిన తర్వాత, తాను ఎవ్వరికో భారమైపోతున్నానని అనుకున్నప్పుడో తనువు చాలించడం అతని హక్కు.

నన్ను సమాధి చేసిన చోట దాని పైన ఒక మొక్క నాటితే మంచిదని నా కోరిక. ఆశ. అంతేతప్ప దానిపైన స్తూపాలు వంటివి కోరను.

ఒక వేళ సముద్రానికి దగ్గరలో నివసిస్తే వారు మరణిస్తే  సముద్రంలో పడెయ్యాలి. అలా చెయ్యడం వల్ల కట్టెలను ఆదా చేసినట్లు అవుతుంది. …”

ఇలా అనేక విషయాలు చెప్పిన కుష్వంత్ సింగ్ “నేను నా  రాత జీవితాన్ని మరింత ముందుగానే ప్రారంభించవలసింది. లీగల్ ప్రోఫెసన్ కోసం ఎన్నో సంవత్సరాలు వృధా చేశాను. ఈ భూమిపై కులమతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చిన మత చాంధసవాదుల గురించి ఎక్కువ రాయలేకపోయినందుకు బాధ పడుతున్నాను.  మత చాంధసవాదులపై చర్యలు తీసుకోవాలి. విచ్చిన్నకర శక్తుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. జీవహింస తగదు. జంతువులను వేటాడకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉత్తరాలు రాసాను. కొన్ని ప్రభుత్వాలు నా మాటను మన్నించాయి…..” అని కూడా రాసుకున్నారు.

…ఇలా సాగిన ఆయన రచనలు  ఎప్పటికీ చదివిస్తూనే ఉంటాయి. ఆలోచనలో పడేస్తుంటాయి.

Send a Comment

Your email address will not be published.