కృష్ణం వందే జగద్గురుం

Janmashtamiశ్రీకృష్ణుడు భగవద్గీతని ఒక్క అర్జునుడి కోసం మాత్రమే చెప్పింది కాదు. సమస్త మానవాళికి ఉపయోగపడేదే. దారి చూపించేదే. స్వామీ వివేకానంద గీతను జ్ఞాన గుళికలు అన్నారు. ఉపనిషత్తులు అనే తోటలో నుంచి ఆధ్యాత్మికమైన సత్యాలను పుష్పాలను ఏర్చి కూర్చి మానవాళి మనుగడకు ఆడించిన మణిహారం గీత అని ఆయన అభివర్ణించారు.

శ్రీకృష్ణుడు దాత. నువ్వే దిక్కు అంటే చాలు మనకు దారి చూపడమే కాకుండా దాసుడైపోతాడు. సర్వం ఆయనే….

కృష్ణుడి గీత గురించి చెప్తూ జాతిపిత మహాత్మా గాంధీ ఇలా అన్నారు – “బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికి గీత నాకు ఎంత గానో ఉపయోగపడింది” అని.
శ్రీకృష్ణుడు……..మహావిష్ణువు అవతారాలలో విశిష్టమైనది కృష్ణావతారం. విలక్షణమైన అవతారం. ప్రతిభావంతమైన అవతారం.

ద్వాపర యుగంలో అంతకుముందు ఎన్నడూ కనీ వినీ ఎరగని రీతిలో దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. ధర్మసంస్థాపనతో కర్మ భూమిలో ధర్మ రక్షకుడిగా అనిపించుకున్న కృష్ణుడి లీలలు అన్నీ ఇన్నీ కావు.
బాలకృష్ణుడి లీలలు అద్భుతం. మరే అవతారంలోను ఇన్ని లీలలు కనిపించవు. రాక్షసులను హతమార్చడమే కాకుండా వెన్న దొంగ అనిపించుకున్న కృష్ణుడికి కన్నతల్లి యశోద. కృష్ణుడిపై ప్రేమను తల్లిగా యశోద అనుభూతుల్ని చలం యశోదా గీతాలు పేరిట రాశారు. అందులో యశోద అంటుందిలా……

“అమ్మా!” అని నన్ను అత్యంత అవసరమన్నట్టు పిలిచి నాకు అందకుండా ఇల్లంతా దాగుడుమూతలు ఆడడం చూస్తే నాకు నువ్వెవరో తెలీడం నీకు ఇష్టం లేదని, నన్నిట్లా నిరంతర అన్వేషణలో ఉంచడమే నీ ఉద్దేశమని, నీ కొరకైనా నా తృష్ణలోనే నీ ఆనందమని అనుకుంటాను……నీ ధ్యాస నా మనసులో ఏదీ గట్టిగా నిలవనీదు……అందువల్లనే పరధ్యానం. లోక సౌందర్యాన్ని నా ఇంట్లోకే తీసుకొచ్చావు….ఎక్కడికీ వెళ్లాలనిపించదు…..నువ్వే నా గర్వం…నువ్వే నా నిరాశ…..నీ కోసమే నా కోపం…నా కన్నీరు….నీ కోసమే ఏ గోవులు….నీ కోసమే ఈ యశోద….నీ కోసమే ఈ ఉదయాలూ అస్తమయాలు….” యశోద చెప్పడంలో చలం ఊహ ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది.

లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో స్మరించిన తీరు చూద్దాం
“ఖరారు విందేన పదార విందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం
బాలం ముకుందం మనసాస్మరామి
– అంటే తామర పువ్వులాంటి చేతితో తామరపువ్వులాంటి పాదాన్ని పట్టుకొని తామరపువ్వులాంటి నోట్లో ఉంచుకుని మర్రి ఆకు మీద శయనించి ఉన్న బాలకృష్ణుడిని స్మరిస్తున్నాను అని ……

ప్రేమ విషయానికి వస్తే కృష్ణుడంతటి గొప్ప వాడు ఇంకెవరుంటారు….ఆయన రాసలీల కానివ్వండి రాధామాధవ ప్రణయ పారవశ్యం, గోపికలతో ఆనంద క్షణాలు…మరెవరికైనా సాధ్యమా…ఈ కథనంలోనే ఎన్నో పాఠాలు చెప్పిన కృష్ణుడికే ఒక గురువు లేకపోలేదు. ఆయన గురువు పేరు సాందీపుడు. ఆయన దగ్గర మిగిలిన వారి లాగానే శిష్యరికం చేసిన కృష్ణుడు బాల్య మిత్రుడు కుచేలుడు ఇచ్చిన అటుకులకే మురిసిపోయే తరగని సంపద భాగ్యం కలిపించాడు స్నేహితుడికి.

పాండవులను అన్ని వేళలా వెన్నంటి ఉంది సంరక్షిస్తూ వచ్చిన కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వారికి బాసటగా నిలిచి విజయాన్ని సాధించిపెట్టిన తీరు తెలిసిందే కదా….
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి పుట్టుక ఇచ్చిన వాడుగా కీర్తి పొందిన శ్రీమన్నారాయణుడు ముల్లోకాలకు పూజ్యుడు. అటువంటి విష్ణువు శృంగార, వైరాగ్య, భక్తి, స్నేహ, రౌద్ర రసాల సమన్వయుడిగా కృష్ణుడిగా దేవకీ గర్భాన శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. కృష్ణుడు అని పేరు పెట్టింది గర్గ ముని.

కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారిగా చెప్పినా అతనికి ఎనిమిది మంది భార్యలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వారి పేర్లు – రుక్మిణి. సత్యభామ. కాళింది. మిత్రవంద. భద్ర. నాగ్నజితి, లక్షణ. జాంబవతి. వీరికి ఒక్కొక్కరికీ పదేసి మంది జన్మించారు. వారిలో – ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు. సుచారుడు, భద్రచారుడు, తామ్రుడు, చక్రుడు, మిత్రవంతుడు, సునీధుడు తదితరులు.
పాండవులు మనసా వాచా కర్మణా కృష్ణుడిని విశ్వసించి అనన్య భక్తితో కొలిచారు.

ఎన్నో భోగభాగ్యాలు, రాగద్వేషాలు, శీతోష్ణాలు, సమభావంతో స్వీకరించి సమగ్ర ధర్మస్వరూపుడిగా అనిపించుకుని కృష్ణం వందే జగద్గురు అయ్యాడు.
కృష్ణుడికి వెయ్యి పేర్లు ఉన్నప్పటికీ అష్టోత్తరాలు ఉన్నా నందగోప ప్రియ, యశోద వత్సల, గోవిందా వంటి పేర్లు సుప్రసిద్ధం.
కృష్ణుడు సమగ్ర ఐశ్వర్యానికి, సంపూర్ణమైన ధర్మానికి, స్వచ్ఛమైన యశస్సుకి, పరిపూర్ణమైన భాగ్యానికి, పరిపూర్ణమైన జ్ఞానానికి, నిశ్చలమైన వైరాగ్యానికి ప్రతీక. అందుకే పరమాత్ముడయ్యాడు శ్రీకృష్ణుడు.

అందుకే ఆయన గీతోపదేశం ప్రపంచ సాహిత్యంలో ఓ గొప్ప కావ్యమైంది.

వినోబాభావే గీత గురించి చెప్తూ తన శరీరాభివృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడిందో తన బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది అన్నారు.
ఆయనకే కాదు, యావత్ ప్రపంచానికీ గీతా సారం అమూల్యమైన మణిరత్నం.

కృష్ణుని గురించి కొన్ని సంగతులు
——————————–
– మహా విష్ణువు అవతారాల్లో కృష్ణుడు ఒకడు.
– శ్రీకృష్ణుడు పాండవులకు అమ్మ వైపు నుంచి బంధువే. పాండవుల తల్లి అయిన కుంతీ కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడికి సోదరి.
– దేవకీవసుదేవులకు కృష్ణుడు ఎనిమిదో సంతానం. నక్షత్రం రోహిణి. వసుదేవుడి సంతానంలో మొదటి ఆరుగురిని కంసుడు హతమారుస్తాడు.
– ద్రౌపది స్వయంవరానికి వచ్చినప్పుడు మొదటిసారిగా పాండవులను అక్కడే చూసాడు.
– యాదవులలో జన్మించిన నారాయణుడు.అందుకే నరుడైన అర్జునుడికి స్నేహితుడయ్యాడు. అత్యంత సన్నిహితుడయ్యాడు.
– కంసుడు, మురుగు, నరకుడు, బాణుడు, పంచజనుడు, శిశుపాలుడు, జరాసంధుడు తదితరులను హతమార్చాడు.
– నల్లని వాడు కావడంతోను భూమిని సాగు చేసే కృషితోనూ కృష్ణుడు అనే పేరు వచ్చింది.
– కశ్యపుడికి అదితియందు వామనుడై జన్మించి ఉపేంద్రుడయ్యాడు. ఈయన కపిల మహర్షిగా కూడా యున్నాడు. ఆయన రథానికి శైబ్యమ్, సుగ్రీవం, మేఘపుష్పమ్, వలాహకం గుర్రాలు ఉండేవి.
– ఈతని ధ్వజం పేరు గరుత్మంతుడు.
– ఈతని శంఖం పేరు పాంచజన్యం.
– ఈతని చక్రం పేరు సుదర్శనం.
– ఇతను నిద్రపోతున్నప్పుడు జరా అనే రాక్షసి అక్కడ తిరిగే ఒక వేటగాడిని చూసి వాడికి కృష్ణుడి శరీరం జింకలా కనిపించేటట్లు చేస్తాడు. అప్పుడు అతను ప్రయోగించిన బాణం కృష్ణుడి అరికాలిలో గుచ్చుకోగా ప్రాణాలు వదులుతాడు.
– శ్రీకృష్ణుడి మరణానంతరం అర్జునుడు వజ్రుని ఇంద్రప్రస్థానికి రాజును చేసాడు.
– తమ గురువు గారు సాందీపుడి పుత్రుడు చనిపోతే అతనిని బతికించి గురువుకు దక్షిణగా ఇస్తాడు కృష్ణుడు.
– కృష్ణుడి శాపగ్రస్తుడు. ఇతనిని శపించిన వారిలో డుర్వాసుడు కూడా ఉన్నాడు. కృష్ణుడిని చూడటానికి ద్వారకకు వచ్చి పిండారక క్షేత్రంలో యాదవులు సాంబుడికి స్త్రీ వేషం వేసి అవమానించగా దుర్వాసుడు కోపించి యాదవ నాశం కోసం ముసలం పుడుతుంది అని శపించాడు.
– దేవకీవసుదేవులకు కృష్ణుడి తర్వాత జన్మించిన కన్య సుభద్ర.
– కృష్ణుడు కాళీయుడి మదాన్ని అణిచాడు.
– సుదర్శనుడి శాపంతో పాము రూపంలో ఉంది నందుడిని మింగగా కృష్ణుడు ఆ పాముని చంపి అతని శాపాన్ని తొలగించాడు.
– రుక్మిణి , ఇతరులనూ జయించి రుక్మిణిని రాక్షస వివాహ పద్ధతిలో పెళ్లాడాడు శ్రీకృష్ణుడు.
– గదతో మయుడు నిర్మించిన సౌమ్భకం అనే మాయానగరాన్ని తునకలు చేసాడు. నారాయణుడు తన నల్లని వెంట్రుకలతో భూభారాన్ని తగ్గించడానికి కృష్ణుడుగా జనించాడు.
– పెంచిన తల్లి యశోదకు తన నోట్లో లోకాలన్నింటినీ చూపించాడు కృష్ణుడు.
– కౌరవుల వందమంది మరణానికి కారణంగా ఎంచి గాంధారి కూడా కృష్ణుడిని శపిస్తుంది.
– ఏకలవ్యుడి తండ్రి వసుదేవుడికి సోదరుడే. కనుక కృష్ణుడు, ఏకలవ్యుడు పెత్తండ్రి పినతండ్రి పిల్లలే.
– ఒకసారి అర్జునుడిని తన చెల్లెలు సుభద్రను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోమని చెప్పింది కృష్ణుడే,. దుర్యోధనుడికి సుభద్రను ఇచ్చి పెళ్లి చేస్తారనే కారణంగానే కృష్ణుడు అర్జునుడితో అలా చెప్పాడు. బలరామ కృష్ణుల దీవెనలతోనే సుభద్ర, అర్జునుల పెళ్లి అయింది.
– .దేవకీ వసుదేవుల ఏడవ సంతానం బలరాముడు.
– రాధకు వేణువు అంటే అసూయట. .
– కర్ణుడితో అతని పుట్టుక గురించి మొట్టమొదటగా చెప్పింది కృష్ణుడే.
– కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పినా దానిని ఒకేసమయంలోనే విన్న వాళ్ళు మరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళే హనుమంతుడు, సంజయుడు.
– ద్రౌపదిని కృష్ణుడు అసలుసిసలు మిత్రురాలిగా కాపాడుతూ వచ్చాడు.

Send a Comment

Your email address will not be published.