కృష్ణం వందే జగద్గురుం

మహావిష్ణువు సృష్టికర్త. బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అనికూడా పిలుస్తారు. ఉట్ల పండుగ అని కూడా చెప్పుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

దేవకీవసుదేవులకు ఎనిమిదో సంతానంగా రోహిణీ నక్షత్రాన కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు యాదవులలో జన్మించిన నారాయణుడు. దేవకీవసుదేవులకు ఎనిమిది మంది కుమారులు పుట్టారు. వారి పేర్లు – కీర్తిమంతుడు. సుషేణుడు, భద్రసేనుడు, ఋజువు, సమదనుడు, భద్రుడు, బలరాముడు, కృష్ణుడు.

కృష్ణుడు నల్లగా ఉండటం వల్లా, సాగుచేసే కృషితోనూ ఈయనకు కృష్ణుడు అనే పేరు వచ్చింది. కానీ విష్ణుదేవుని నల్లని వెంట్రుకలు కృష్ణుడుగా జన్మించినట్టు ఆదిపర్వంలో ఒక చోట చెప్పబడింది.

ఒకరోజు గోపబాలకులు గోవులూ అలసిపోయి దప్పికతో కాళిందిలోని విషం కలిపిన నీరు తాగి ప్రాణాలు కోల్పోయినప్పుడు కృష్ణుడు తన చూపులు అనే అమృత ధారలతో అందరినీ బతికిస్తాడు. కృష్ణుడు రెండు సార్లు దావాగ్నిని మింగాడు.

ద్రౌపది స్వయంవర సందర్భంలో మొదటిసారిగా కృష్ణుడు పాండవులను చూసాడు.

కృష్ణుడి గురువు సాందీపుడు. సాందీపుడు కాశీకి దగ్గరలోని అవంతి పట్టణంలో నివసించే బుధవర్యుడు. ఈయన వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రం, ధర్మశాస్త్రాలు, న్యాయం, తర్కం, రక్షకత్వం, రాజవిద్యాలు నేర్పాడు. బలరామకృష్ణులు ఈయన దగ్గర అరవై నాలుగు విద్యలను అరవై నాలుగు రోజులలో నేర్చుకున్నారు.

సాందీపుడు కుమారుడిని పంచజనుడు అనే రాక్షసుడు మింగేసాడు. అప్పుడు సాందీపుడు తమ కుమారుడిని తీసుకురావలసిందిగా బలరామకృష్ణులను కోరుతాడు. అంతట కృష్ణుడు సముద్రంలో ప్రవేశించి పంచజనుడిని చంపి కడుపు చీల్చి చూడగా అందులో సాందీపుడు కుమారుడు కనిపించలేదు కానీ పాంచజన్యం అనే శంఖం కనిపించింది. ఆ శంఖాన్ని కృష్ణుడు తీసుకున్నాడు. ఆతర్వాత బలరామకృష్ణులు యమపురికి వెళ్లి అక్కడ పాంచజన్యాన్ని భీకరంగా ఊదుతారు. అప్పుడు యముడు వచ్చి బలరామకృష్ణులకు నమస్కరించి తాను ఏం చేయాలి అని ఆదేశించమంటాడు. అప్పుడు తమ గురువుగారి పుత్రుడిని ఇవ్వవలసినదిగా అడగ్గా యముడు ఆ బాలుడిని బలరామకృష్ణులకు అప్పగిస్తాడు. ఆ బాలుడిని వారు తీసుకొచ్చి గురువుగారికి గురుదక్షిణగా ఇస్తారు.

కంసుడు కృష్ణుడి మేనమామ. ఉగ్రసేనుని తొమ్మిది మంది కుమారులలో పెద్దవాడు. కృష్ణుడి చేత చంప బడతాడు. కంసుడు పూర్వజన్మలో కాలనేమి. ఆ జన్మలో కాలనేమిని విష్ణువు హతమారుస్తాడు. దేవకీ పుత్రులలో ఆరుగురు గత జన్మలో కాలనేమి పుత్రులు. వారిని తండ్రే చంపుతాడు అని హిరణ్యకశిపుడు శపిస్తాడు. ఆవిధంగానే మరుసటి జన్మలో దేవకీ గర్భాన మొదట పుట్టిన ఆరుగురిని కంసుడు చంపుతాడు. కాలనేమి పుత్రుల పేర్లు – హంస, సువికర్మ, కృత, దమన, రిపుర్మర్దన, క్రోధహంత.

కృష్ణుడికి 16,108 మంది భార్యలు. వారిలో ఎనిమిది మంది పట్టపు రాణులు. వారినే అష్ట భార్యలు అంటారు. వారి పేర్లు – రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, భద్ర, లక్షణ, కాళింది, మిత్రవింద. వేరేరిలో రుక్మిణి అవతారం. రుక్మిణి సోదరుడు రుక్మి. రుక్మిణి, ఇతరులను జయించి రుక్మిణిని కృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో పెళ్లాడుతాడు. ఇక పదహారు వేలనూరు మందిని నరకాసురుడి చెర నుంచి కాపాడుతాడు. కృష్ణుడి భార్యలలో సత్యభామకు రుక్మిణిపై ఒకింత ఈర్ష్య ఎక్కువే. కృష్ణుడి పర్వంలో తులాభార ఘట్టం విశేషమైనది. కృష్ణుడి ఎనిమిది మంది భార్యలకు తలో పది మంది జన్మిస్తారు.

కృష్ణుడి సోదరి సుభద్ర. ఈమె అర్జునుడి నాలుగో భార్య. వీరి కుమారుడు అభిమన్యుడు.

ప్రేమ అనగానే రాధాకృష్ణులనే ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే మహాభారతంలో గానీ, శ్రీమద్ భాగవతంలోగానీ రాధ ప్రస్తావన ఎక్కడా లేదు. వేదవ్యాసుడు అంతటి వాడు రాధ విషయం ప్రస్తావించకపోవడం విచిత్రమే. అయితే జయదేవుడు రాధను ప్రముఖంగా ప్రస్తావించాడు తన గీతగోవిందంలో.

ఏకలవ్యుడు కృష్ణుడి బంధువు. కృష్ణుడి తండ్రి వాసుదేవుడి సోదరుడు దేవాశ్రవ పుత్రుడే ఏకలవ్యుడు.

రుక్మిణి స్వయంవరం సమయంలో తన తండ్రిని కాపాడే క్రమంలో మరణిస్తాడు. ఇతనిని కృష్ణుడే చంపుతాడు.

శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు మాత్రమే కాదు, కురుక్షేత్ర సంగ్రామం కడదాకా అర్జునుడి రధంపై పతాకంలో ఉన్న హనుమంతుడు, వేదవ్యాసుడి ఆశీర్వాదబలంతో సంజయుడు కూడా విన్నారు.

కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు. ఇతను రుక్మిణీకృష్ణులకు సనత్కుమారుని అంశలో జన్మించాడు. ద్రౌపది స్వయంవరానికి వచ్చిన వారిలో ఒకడు. ఇతడు సౌంభకుడితో యుద్ధం చేస్తాడు. అయితే ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకో పాల్గొనలేదు. మరణానంతరం ఇతడు సనత్కుమారుడిలో కలిసిపోయాడు.

శ్రీకృష్ణుడి తల్లి వైపు బంధువులే పాండవులు. వారి తల్లి కుంతి. వాసుదేవుడి సోదరి.

శ్రీకృష్ణుడి ప్రధాన ఆయుధం సుదర్శన చక్రం. కృష్ణుడు రుక్మిణితో కలిసి బ్రహ్మచర్యం పాటిస్తూ హిమాలయ సానువులలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ఈ చక్రాన్ని పొందాడు.

కర్ణుడు సూర్యుడి అంశతో జన్మించాడు. కుంతీదేవికి దుర్వాసుడు ఇచ్చిన మంత్రం ప్రభావంతో సూర్యుడి సద్యోగర్భంలో జన్మించిన పుత్రుడు. ఇతనికి పుట్టుకతోనే కవచకుండలాలు ఉన్నాయి. కర్ణుడి పుట్టుక రహస్యాన్ని అతనికి ముందుగా చెప్పినది కృష్ణుడే.

రాసలీల సమయంలో కృష్ణుడు గోపికలతో నృత్యం చేస్తాడు. అలా అతను నృత్యం చేసినప్పుడు గోపికలు ఎవరికి వారు తనతో మాత్రమే కృష్ణుడు నృత్యం చేస్తున్నాడని అనుకున్నారట.

కుబ్జ అనే స్త్రీకి గూనిని కృష్ణుడు సరి చేసాడు.

పెంచిన తల్లి యశోదకు తన నోట్లో లోకాలన్నింటినీ చూపిస్తాడు.

బృందావనంలో కృష్ణుడు తన మురళిని ఋషభంలోను, దైవతంలోను, గాంధారంలోను, నిషాదంలోను, పంచమం లోను, షడ్జమంలోను, మధ్యమంలోను వాయిస్తాడు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.