కేంద్రంతో ఏపీ ఢీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదనపు నిధుల కోసం ఇక కేంద్ర ప్రభుత్వంతో పోరాటాలకు దిగాలని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి, అదనపు నిధులు, ప్యాకేజీలు అందజేస్తామని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించి ఆ మాట నిలబెట్టుకోకపోవడం పట్ల చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఆగ్రహంతో ఉంది. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో తెగేసి చెప్పినప్పటినుంచీ చంద్రబాబు ప్రభుత్వం తమ మిత్ర పక్ష బీజీపీ ప్రభుత్వంపైన కినుకతో ఉంది. తమ రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి, తాము రాజధాని నిర్మాణం చేసుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తమకు అదనపు నిధులు అవసరమని చంద్రబాబు నాయుడు కేంద్రానికి అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా అనేక పర్యాయాలు హామీలు ఇచ్చింది. అయితే చివరికి జైట్లీ అందుకు వికాసం లేదని చెప్పడంతో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిరాశ చెందింది. తెలుగుదేశం మినహా మిగిలిన పార్టీలన్నీ రెండవ తేదీన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్ పిలుపు ఇచ్చాయి.

Send a Comment

Your email address will not be published.