కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్!

ప్రస్తుతం రాయలసీమ, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాల మధ్య ఒక పెను సమస్యగా మారిన హైదరాబాద్ ను కీంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని సీమ, ఆంద్ర ప్రాంతాల నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా హొమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే మీద విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారు. కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ నాయకులు డిల్లీ లోనే తిష్ట వేసి కేంద్రంతో లాబీ చేస్తున్నారు.

మరో 20 రోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన నోటును కేంద్ర మంత్రి వర్గం ముందు ఉంచబోతున్నట్టు షిండే ప్రకటించిన తరువాత నుంచీ ఈ ఒత్తిడి మరీ ఎక్కువయింది. హైదరాబాదును పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి కేంద్రం ఇదివరకే అంగీకరించింది. ఈ పదేళ్ళూ అయినా నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించాలని సీమ, ఆంద్ర ప్రాంతాల నాయకులూ కోరుతున్నారు. అయితే దీని మీద విస్తృతంగా చర్చలు, సంప్రతింపులు జరగాల్సి ఉంటుందని, ఇవి పూర్తి అయ్యేవరకూ సహనంతో ఉండాలని హొమ్ శాఖ వారికి సూచించినట్టు తెలిసింది.

మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక తెలంగాణా అంశానికి ఒక తీర్మానం ద్వారా అనుమతి లభించిన తరువాత, ఈ నోటును న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతుంది. అది ఆమోదించిన తరువాత, దాన్ని మంత్రుల బృందానికి పంపిస్తారు. విద్యుత్తు, నీరు, రెవిన్యూ వంటి అంశాల విభజన మీద అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈలోగానే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింప చేయాలని సీమ, ఆంద్ర ప్రాంతాల నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు.

మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెట్టక ముందే రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం అంతకుముందు భావించింది కానీ, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నందు వల్ల కేంద్రం తన ఆలోచనను మార్చుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది. అయితే సీమాంధ్ర సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నందువల్ల కేంద్రం ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడానికి ఆలోచిస్తోంది. ముందుగా సీమాంధ్ర సభ్యులని ఊరడించాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాల్సి ఉంటుందన్న మాట.

సీమ ఆంధ్ర కోసం ప్రత్యేక ఫిలిం సిటీ

రాష్ట్రం విడిపోయే పక్షంలో తమకంటూ ప్రత్యేకంగా ఒక ఫిలిం సిటీ ఉండాలని ఆంద్ర ప్రాంత సినిమా వాళ్ళు భావిస్తున్నారు. ఆంద్ర లేక రాయలసీమ ప్రాంతాల్లో సరయిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఒక విశాలమయిన, అన్ని హంగులూ ఉన్న ఫిలిం నగరును నిర్మించుకోవాలని, అది తప్పనిసరిగా హైదరాబాదులోని ఫిలిం నగర్ కన్నా అద్భుతంగా ఉండాలని వారు భావిస్తున్నారు. తెలంగాణా తమ నుంచి విడిపోయిన తరువాత ఎలాగో విడిగా చెంబరును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని, అందువల్ల తమకంటూ విడిగా ఒక ఫిలిం సిటీ కూడా ఉండాలని ఆంద్ర ప్రాంత నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

విశాఖపట్నంలో గానీ, విజయవాడ సమీపంలో గానీ స్థలాన్ని గుర్తించడానికి నిర్మాతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఒంగోలులో రాజధానిని పెట్టినా తమకు విశాఖ లేదా విజయవాదలే సరైన ప్రదేశాలని నిర్మాతల మండలిలో కొందరు గత ఆదివారం హైదరాబాదులో జరిగిన ఇష్టాగోష్టిలో చర్చించుకున్నారు. ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఇందుకోసం అప్పుడే ప్రచారం కూడా ప్రారంభించారు. రామోజీ ఫిలిం సిటీ స్థాయిలో ఈ ఫిలిం సిటీ కూడా ఉండాలని, దాని చుట్టూ ఇల్లు నిర్మించుకోవాలని నిర్మాతలు పథకం వేస్తున్నారు. ఒక వెయ్యి ఎకరాల స్థలం ఫిలిం సిటీ కోసం, మరో వెయ్యి ఎకరాల స్థలం ఫిలిం నగరు కోసం అవసరం పడుతుంది. నిజానికి ప్రభుత్వం కొత్త రాజధానిని నిర్మించడానికి సుమారు పది వేల ఎకరాల స్థలం కోసం ఒంగోలు చుట్టుపక్కల వెతుకుతోంది. విభజన కార్యక్రమం ప్రారంభం కాగానే తమ పథకాని అమలు చేయాలని కొందరు రహస్యంగా ఒకరితో ఒకరు సంప్రతింపులు జరుపుకొంటున్నారు. ఇందులో ఆరుగు నిర్మాతలు ముఖ్యమంత్రిని కలుసుకొని తమ అభిప్రాయాన్ని చెప్పి అంగీకారం తీసుకున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.