కేవలం ప్రేమలేఖలే కావు

చలం…తెలుగు చదువరులను ఆలోచనలో పడేసిన రచయిత. గొడవపడేలా చేసిన రచయిత. అయితే ఒక్క మాట చెప్పుకోవాలి…ఆయనను తిట్టినా వారే ఆయన రచనలను ఎక్కువగా చదివారు అనడం సబబు. ఆయనింట నా చిన్నతనంలో ఉన్న రోజులు ఇప్పటికీ బాగా గుర్తే. దాదాపు స్కూల్ ఫైనల్ వరకు రెండు నెలల వేసవి సెలవులు వారింటే మా మా మకాం. అయితే నా బ్యాడ్ లక్ ఏమిటంటే అప్పట్లో ఆయనో గొప్ప రచయిత అనే సంగతి తెలీదు. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఆయన ఒక గొప్ప రచయిత అని తెలుసుకుని నాలుగైదు ఉత్తరాలు రాసి వాటికి ఆయన నుంచి జవాబులు అందుకున్న ఆనం లేకపోలేదు కానీ ఆయన లేకుండా పోయారు. ఆయ్యన రాసిన ఉత్తరాలు ఇప్పటికి పదిలంగా నా అరల్లోనే ఓ పుస్తకంలో ఉన్నాయి. ఆ ఉత్తరాల మాట ఎలా ఉన్నా ఆయన రచనల్లో నాకెంతో ఇష్టమైనవి ప్రేమలేఖలు. ఈ ప్రేమలేఖలు కేవలం ప్రేమలేఖలుగా చూడకూడదు. 1922 – 1947 సంవత్సరాల మధ్య ఆయనా ఈ లేఖలు రాసారు. అవి మొత్తం నలభై తొమ్మిది ప్రేమ లేఖలే కావచ్చు. కానీ అవి ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రేమగీతిక. ఒక్కో వచనగీతిక. అవి వేటికవే మధురం. లలితం. అవి చదువుతుంటే మన తెలుగు భాషకు ఇంతటి మాధుర్యం ఉందా అనిపించకమానదు. కవిత్వం మీద ఏ మాత్రం జిజ్ఞాస ఉన్న వాలకు ఇవి తప్పకుండా నచ్చుతాయి. వాటి మీద గౌరవం కలగక మానదు.

ఈ ప్రేమలేఖల పుస్తకానికి ఆయన ముందు మాట రాస్తూ “సృష్టిదైన విరహ బాధ తన మాధుర్య భారం వల్ల తనే పగిలి, మనిద్దరినీ కన్నది. జననమప్పుడు మాత్రమె ఆ ఒక్క ముహూర్తమే మనమైక్యమై ఉన్నది” అని అంటూ ప్రేమలేఖలనేవి ఎలా ఉండాలో చెప్పారు ఇలా…..

“ప్రేమలేఖలు అంటే ప్రియమైన మిత్రులకు రాయటం కాదు. పురుషులుగాని, స్త్రీలుగాని సెక్స్ భేధమైనప్పుడు ఆ ప్రేమలో వలెనె లేఖలో కూడా రొమాన్స్ పోయెట్రీ, టెండర్ నెస్ ఎక్కువగా కనిపిస్తాయి. …

నిర్వ్యాజమైన స్నేహం ఉంటేనే గాని స్వచ్చమైన హృదయాలు ఉంటేనేగాని మధురమైన లేఖలు పుట్టవు…..

ఈ దేశంలో భార్యాభర్తల మధ్య లేఖలు నడవవు. చాలామంది భార్యలకి అసలు రాయటమే చేత కాదు…

పురుషుడు రాయాలంటే ఆమె లెవెల్ కి దిగాలి. లేకపోతే అతని లేఖ ఆమెకి అర్ధం కాదు. లేఖలు రాసుకోవాలంటే మిత్రుల మధ్య వియోగం అవసరం.

స్త్రీ మీద పూజ్యభావం లేనిదీ యెట్లా కలుగుతుంది కవిత్వం….

ఎంతైనా కానీ విరహమే ప్రేమలేఖకి ముఖ్యమైన కారణం.

దేహాలు ఉపయోగించకుండా హృదయాలతో ప్రేమ నిలుపుకోగల మనుషులు చాల అరుదు….

ప్రియురాలు దగ్గిర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్ గా మాట్లాడటమే ప్రేమ లేఖ…

అంతరంగికమైన మిత్రుడితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ….

మన ఆత్మని వాళ్ళ ఆత్మలతో దూరాన్ని కాలాన్నీ జయించి ఐక్యం చెయ్యడానికి చేసే ప్రయత్నమే ప్రేమలేఖ. సర్వ కాల, సర్వావస్థలలో నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చెయ్యడమే ప్రేమలేఖ….

కాళిదాసు మేఘసందేశం ప్రేమలేఖలు కాక మరేమిటి? ఆ కవి హృదయంలో యెంత విరహ వేదన లేనిదీ ఆ కావ్యం రాయగలడు? ….”

అని ప్రేమలేఖలు సాగించి నన్ను ప్రేమపర్వంలోకి నడిపించిన, వాటిని ప్రేమించేలా చేసిన చలం ప్రేమలేఖలంటే నాకు అమిత గౌరవం…మర్యాద….

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.