కేసీఆర్ వరాల వర్షం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తర తమ బేధం లేకుండా ఈ మధ్య అన్ని వర్గాల మీదా వరాల వర్షం కురిపిస్తున్నారు. వారం రోజుల క్రితం ఆయన రైతులకు సంబంధించిన సభలో మాట్లాడుతూ,రైతులు సైతం ఆశ్చర్యపోయే విధంగా వారికి అనేక పథకాలు ప్రకటించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ ఉచితంగా ఎరువు సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయన గత ఎన్నికల సందర్బంగా ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన రైతులకు రుణ మాఫీ పథకాన్ని పూర్తిగా అమలు చేసిన సందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడానికి రైతాంగం ఏర్పాటు చేసిన సభ ఇది. ఆయన ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేసి, దేశంలో రికార్డు సృష్టించింది. ఇంతకూ ఉచిత ఎరువుల సరఫరాను ప్రకటించిన చంద్రశేఖర్ రావు, ప్రతి రైతు పేరిటా ఎరువుల నిమిత్తం నాలుగు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామని వివరించారు.

ఇక తాజాగా ఆయన ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్స్ పెంచుతూ ఒక ప్రకటన చేశారు. ముస్లిం వర్గాలకు ఇదివరకు నాలుగు శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. దీన్ని ఆయన పన్నెండు శాతానికి పెంచారు. గిరిజనులకు ఇదివరకు ఆరు శాతం రిజర్వేషన్ ఉండేది. దీన్ని పది శాతానికి పెంచారు. వీటికి కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ పెంపునకు రాష్ట్ర మంత్రి వర్గం, ఆ తర్వాత శాసనసభ ఆమోదం తెలిపాయి. మున్ముందు మరిన్ని వర్గాలకు పథకాలు ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Send a Comment

Your email address will not be published.