ఈసారి వందకు వంద శాతం పద్మశ్రీ పురస్కారానికి అర్హుడు అనిపించుకున్న వారిలో కోట శ్రీనివాస రావు ఒకరు.
” కోట” అంటూ అందరితోను ఆప్యాయంగా పిలిపించుకునే కోట శ్రీనివాసరావు గొప్ప నటుడు. ఏ పాత్రలోనైనే ఇట్టే జీవించే మహానటుడు. ఆయన నటనను మరెవరి నటనతోనూ పోల్చలేము. అటువంటి అద్భుత నటుడైన కోట కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి వెలుగులోకి వచ్చారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు ప్రసిద్ధ వైద్యులు. కోట శ్రీనివాస రావు 1945, జులై 10న జన్మించారు. కోటకు నాటకాలంటే ఆసక్తి ఎక్కువ. వెండితెరకు రాకముందు ఆయన స్టేట్ బ్యాంకులో పని చేసారు. 1968లో ఈయనకు పెళ్ళయ్యింది. ఆయన భార్య పేరు రుక్మిణి. కోట దంపతులకు ఇద్దరు అమ్మాయిలూ, ఒక అబ్బాయి. కొడుకు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అమ్మాయిల పేర్లు ప్రణవి, పల్లవి.
టాలీవుడ్ లోకి అడుగుపెట్టేసరికే ఆయనకునాటక రంగంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది. ఆయన నటించిన మొదటి చిత్రం పేరు ప్రాణం ఖరీదు. ఆయన ఓసారి నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్నే సినిమాగా తీయాలనుకున్నారు. ఆ విధంగా ఆయన సినీ రంగంలో శ్రీకారం చుట్టారు.
ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన పాత్ర “అహ నా పెళ్ళంట” సినిమాలో చేసిన పిసినిగొట్టు పాత్ర.
తన సినీ జీవితంలో ఆరు నందులకు అందుకున్న కోట 650కి పైగా చిత్రాలలో నటించిన కోట పొందిన పురస్కారాలు అనంతం. ఆయన రెండు తమిళ చిత్రాల్లోనూ (సామీ, తిరుపాచ్చి) నటించారు.
తనకు పద్మ పురస్కారం లభించినందుకు కోట మాట్లాడుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు. తానెప్పుడూ బాధ్యత మరువలేదని, తన ఎదుగుదలకు కారణమైన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.