క్యాన్సర్ ని జయిస్తా

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఇటీవలే తొంభయ్యవ వసంతం లో అడుగు పెట్టిన నాగేశ్వర రావు శరీరంలో కాన్సర్ కణాలు ప్రవేశించాయి. ఈ నెల మొదటి వారంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడం తో డాక్టర్ల వద్దకు వెళ్లాను. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు నాకు క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. అయితే ఇదేమీ ప్రమాద కరమైన జబ్బు కాదు. అన్ని వ్యాధులు లాగే దీనికి మందులు ఉన్నాయి. తగ్గి పోతుంది. చాలా మంది క్యాన్సర్ వచ్చిందనగానే భయ పడుతున్నారు. అసలు ఆ జబ్బు సోకిందని చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది భయ పడాల్సిన జబ్బు కాదు. అందుకే నేను ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాను. నాకు ఏమీ కాదు.

అభిమానులు, సన్నిహితులు నా ఆరోగ్యం గురించి దిగులు పడొద్దు. నేను సెంచరీ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఆ టార్గెట్ ని రీచ్ అవుతాను, ఆ నమ్మకం నాకు ఉంది. గుండెకి సర్జరీ జరిగి సుమారు నాలుగు దశాబ్దాలు పైగా గడిచినా నేను ఇంకా సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నాను. అందుకే డాక్టర్లు అందరికీ నన్ను రోల్ మోడల్ గా చూపిస్తున్నారు. క్యాన్సర్ విషయం లో కూడా నేను జయిస్తాను. వయసు మళ్ళిన వారిలో క్యాన్సర్ కణాల వృద్ధి తక్కువగా ఉంటుంది. ఇంతవరుకూ అభిమానుల ఆదరాభిమానాలే నన్నుకాపాడాయి. ఇప్పుడు కూడా వారి దీవెనలు నాకు ఉంటాయి. సుమారు 74 సంవత్సరాలుగా సినిమాల్లో పనిచేస్తున్నాను. ఇంత సుదీర్ఘ కాలం సినిమాల్లో పని చేసిన వారు ప్రపంచంలో ఎక్కడా లేరు.

ప్రస్తుతం మా అబ్బాయి నాగార్జున, మనమడు నాగ చైతన్యతో కలిసి ‘మనం’ సినిమాలో నటిస్తున్నాను. నాకు ఊపిరి ఉన్నంత వరుకూ సినిమాల్లో నటిస్తాను. దయచేసి అభిమానులు ఎవరూ నన్ను పరామర్శించడానికి రాకండి, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని అక్కినేని అభిమానులకి విజ్ఞప్తి చేశారు.

Send a Comment

Your email address will not be published.