క్రొత్త కార్యవర్గంతో నూతనోత్సాహం

 ఎన్నికల రిటర్నింగ్ అధికారి డా. వేణు గారు మరియు శ్రీ జగదీశ్వర రెడ్డి గారితో తెలుగు సంఘ కార్యవర్గం

న్యూజిలాండ్ తెలుగు సంఘం శ్రీ మగతల జగదీశ్వర రెడ్డి గారి అధ్యక్షతన క్రొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొంది.  ఈ కార్యవర్గంలో ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి, ఇద్దరు ఉప కార్యదర్సులుతో పాటు షుమారు 15మంది సభ్యులు ఉన్నారు.  1998లో ఈ తెలుగు సంఘం మొదటిసారిగా ఏర్పడడం జరిగింది.  అప్పుడు షుమారు 150 కుటుంబాలతో ఏర్పడిన ఈ తెలుగు సంఘం ప్రస్తుతం 1000కి పైగా కుటుంబాలతో (షుమారు 5000 మంది తెలుగు వారు) ఎంతో ఎదిగిందని అధ్యక్షులు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు తెలిపారు.

“ఒక దశాబ్దం క్రితం ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందనీ ప్రస్తుతం చాలా మంది తెలుగు వారు వేరే దేశాలకు వలస వెళ్ళకుండా న్యూ జిలాండ్ లోనే ఉండిపోతున్నారనీ” శ్రీ రెడ్డి గారు తెలిపారు.

“ఆర్దిక, సామాజిక పరిస్థితులు అనుకూలంగా వుండటం, మరియు తెలుగు సంఘం అనేక బహుళ సంస్కృతి కార్యక్రమాలు చేపట్టడం,  ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది స్వతహాగా పాల్గొనడం ద్వారా ఇక్కడి వాతావరణం అన్ని విధాలుగా అనువైనదిగా ఎక్కువమంది పరిగణిస్తున్నారు.  ఈ పరిస్థితులు తెలుగు సంఘం అభివృద్ధికి తోడ్పడుతున్నాయని” శ్రీ రెడ్డి గారు తెలిపారు.  “అంతే కాకుండా ప్రస్తుతం ఉద్యోగ రీత్యా గానీ వ్యాపార రీత్యా గాని మనలో చాలా మంది కుదుట పడటం ద్వారా తెలుగు సంఘానికి ఎక్కువ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం వుందని” శ్రీ రెడ్డి గారు తెలిపారు.

క్రొత్తగా వచ్చే తెలుగు కుటుంబాలకు మీరెలా కలుసుకోగాలుగుతున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ “ప్రతీ సంవత్సరం ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యుల్లో ఎక్కువ మంది క్రొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతుందనీ తద్వారా క్రొత్త వాళ్ళను చేరడం చాలా సులభ తరమౌతుందనీ ఈ పద్ధతిలో మేము చేసే కార్యక్రమాల్లో ఎక్కువమంది యుక్త వయసు వారు మరియు చిన్న పిల్లలు పాల్గొనటం జరుగుతుందనీ” తెలియజేసారు.

“దీపావళి, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, వినాయక మహోత్సవం వంటి తెలుగు వారి పండగలతో పాటు, హోళీ, కైట్ ఫెస్టివల్, ‘గొ గ్రీన్’, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఇలా స్థానిక సంఘాలతో కలిసి సంఘీభావాన్ని పెంపొందిస్తున్నట్లు” శ్రీ రెడ్డి గారు చెప్పారు. హైదరాబాదులో దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తికి రూ.1,12,౦౦౦.00 న్యూ జిలాండ్ తెలుగు సంఘం తరఫున అందజేసినట్లు తెలిపారు.

ప్రతీ ఏటా ఆక్లాండ్ సిటీ కౌన్సిల్ నిర్వహించే ఫండ్ రైసింగ్ ఈవెంట్ లో తెలుగు సంఘం కార్యవర్గం మరియు శ్రీమతి శ్రీలత మగతల (శ్రీ జగదీశ్వర రెడ్డి గారి సతీమణి) గారి సహాయంతో  వడ, దోస, ఇడ్లీ మొదలైన ఎన్నో రకాల మన తెలుగువారి వంటకాలు స్వయంగా తయారుచేసి $9000.00  లకు పైగా డబ్బుని సమకూరుస్తూ వుంటారు.  శ్రీ రెడ్డి గారి కుటుంబంలో తల్లిదండ్రులే కాకుండా వారి సంతానం ఇద్దరు కుమార్తెలు కూడా వారికి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వుంటారు.  చదువుతో పాటు తెలుగు కార్యక్రమాల్లో పాల్గొనడం చారిటీ కార్యక్రమాల్లో తల్లిదండ్రులిద్దరికీ సహాయం అందించడం వంశ పారంపర్యంగా వచ్చిందని శ్రీ రెడ్డి గారు చెప్పారు.

“Meals on wheels – Free delivery service”, “Walk a mile for a healthy smile” వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వుంటారు.

ప్రతీ సంవత్సరం తెలుగు సంఘం లోని సభ్యులందరికీ తెలుగు కాలెండర్ పంచిపెడుతూ వుంటారు.

భవిష్యత్ ప్రణాళికలో భాగంగా తెలుగు సంఘం సభ్యత్వాన్ని పెంచడం, పిల్లలకు తెలుగు నేర్పించడానికి బాల బడిని నిర్వహించడానికి ఒక బృహత్ ప్రణాళికను తయారుచేయడం, యువతరాన్ని తగినన్ని అవకాశాలు కల్పించడం చేపట్టనున్నట్లు శ్రీ రెడ్డి గారు చెప్పారు.

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ప్రస్తుతం న్యూ జిలాండ్ జట్టులో ఆడుతున్న శ్రీ తరుణ్ నేతుల, మిస్ న్యూ జిలాండ్ సింధుజ మన తెలుగువాళ్ళు కావడం తెలుగుజాతికి ఎంతో గర్వకారణమని శ్రీ రెడ్డిగారు చెప్పారు.

 

 

Send a Comment

Your email address will not be published.