గాంధీజీ – కొన్ని సంగతులు

Bapuమహాత్మా గాంధీ మన దేశ జాతిపిత. ఆయన ఆయుధాలు అహింస, సత్యాగ్రహం. బ్రిటీష్ వారి కబంధ హస్తాల నుంచి భారత దేశానికి స్వాతంత్ర్యం తెప్పించడంలో కీలక పాత్రధారి. ఇలా ఆయన గురించి కొన్ని విషయాలు అందరికీ తెలిసినవే. అయితే కొద్ది మందికే తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం…

– ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ నోబెల్ బహుమతికి గాంధీ పేరు అయిదు సార్లు నామినేట్ అయినా అన్నిసార్లూ తిరస్కరించారు.
– నాలుగు ఖండాలలో 12 దేశాలలో పౌరహక్కుల ఉద్యమానికి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సిద్ధాంతాలే కారణం.
– మహాత్మా గాంధి అంతిమయాత్ర దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవు మేర సాగింది.
– భారత దేశం 1948లో మొదటిసారిగా గాంధిజీ పేరిట ఒక స్టాంప్ ముద్రించింది. అది పది రూపాయల తపాల బిళ్ళ. 1948 లో ఆగస్ట్ 15 వ తేదీన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ తపాలా బిళ్ళను ఆయన స్మృత్యర్ధం విడుదల చేసారు.
– ఆయన రోజుకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రోజులు చాలానే ఉన్నాయి.
– దక్షిణాఫ్రికాలో బోయర్ పోరులో గాంధీజీ సైన్యంలో పాల్గొన్నారు. అయితే ఆ నాటి యుద్ధంతో ఇక ఎన్నడూ హింసకు తావివ్వని రీతిలో పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నారు.
– టాల్ స్టాయి, ఐన్ స్టీన్, హిట్లర్ తదితర నాయకులతో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించారు.
– దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత విజయోత్సవాన్ని జరుపుకుంటూ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం రోజు అక్కడ గాంధీజీ లేకపోవడం గమనార్హం.
– ఆయన ధరించిన వస్త్రాల పునరావశేషాలను తమిళనాడులోని మదురైలో గల గాంధి మ్యూజియంలో భద్రపరిచారు.
– ఆయన తమ జీవిత కాల చివరి రోజుల్లో ఏ రాజకీయ పార్టీలోనూ అధికారిక హోదా పొందలేదు. వాటికి దూరంగానే ఉన్నారు.
– ఆయన మరణించడానికి ముందు రోజు కాంగ్రెస్ ను రద్దు చేద్దామనే ఆలోచన చేసారు.
– మహాత్మా గాంధి పెట్టుకునే కళ్ళజోడు అంటే స్టీవ్ జాబ్స్ కి మహా ఇష్టం. అందుకోసమే ఆయన కూడా అలాంటి కళ్ళజోడు ధరించేవాడట!
– గాంధీజీ దగ్గర కృత్రిమ దంతాల సెట్టు ఒకటి ఉండేది. దానిని తన దగ్గరున్న ఓ గుడ్డలో ఉంచుకునే వారు.
– ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఐరిష్ స్టైల్ లో ఉండేది. ఆయనకు చదువు చెప్పిన గురువులలో ఓ ఐరిష్ వ్యక్తి కూడా ఉండేవారు.
– దేశ విదేశాలలో ఆయన పేరిట వీధులు ఉండటం, ఆయన విగ్రహాలు ఆవిష్కరించడం విశేషం. మన దేశంలో చిన్న చిన్న వీధుల మాట పక్కన పెడితే 53 ప్రధాన రోడ్లకు ఆయన పేరు పెట్టడం గమనార్హం. అలాగే విదేశాల్లో 48 వీధులకు ఆయన పేరు పెట్టారు.
– మన భారత దేశమే కాకుండా వివిధ దేశాలు గాంధీజీ బొమ్మతో స్టాంప్స్ ని విడుదల చేయడం విశేషం.
– విదేశాలలో మొట్టమొదటగా గాంధీజీ పై ఓ తపాలా బిళ్ళ విడుదల చేసిన దేశం అమెరికా.
– గాంధీజీ శత జయంతి సంవత్సరమైన 1969 లో నలభై దేశాలు ఆయన పేరిట తపాలాబిల్లలను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసాయి. ఆ ఏడాది భూటాన్ రెండు తపాలా బిళ్ళలు, సోమాలియా మూడు తపాలా బిళ్ళలు విడుదల చేసాయి. ఈ తపాలా బిల్లలన్నీ మహారాష్ట్రలోని నాసిక్ లో అచ్చయ్యాయి.
– మన దేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ గా ఉండిన రాజాజీ అధికారికంగా రాసే ఉత్తరాల కవర్లపై గాంధీజీ తపాలా బిల్లలనే అతికించే వారు. ఆయన పేరిట మొదటిసారిగా విడుదల చేసిన పది రూపాయల స్టాంప్ మొత్తం వందే ముద్రించారు.
– గాంధీజీ పై మొట్టమొదటగా ఓ పోస్ట్ కార్డ్ విడుదల చేసిన దేశం పోలాండ్.
– మన దేశం కాకుండా మొట్టమొదటగా గాంధీజీ పై ఆయన గుర్తుగా ఓ ఎన్వలప్ కవర్ విడుదల చేసిన దేశం రుమేనియా.
– దక్షిణాఫ్రికాలో మూడు ఫుట్ బాల్ జట్ల ఏర్పాటులో గాంధీజీ కృషి కూడా ఉంది. అవి, డర్బన్, ప్రిటోరియా, జోహాన్నెస్ బర్గ్ ప్రాంతాలలో వెలసిన జట్లు. అయితే ఆ మూడు ప్రాంతాలలోను ఫుట్ బాల్ జట్లకు ఒకటే పేరు ఉండేది. అదే పాసివ్ రెసి స్టర్స్ సాకర్ క్లబ్.
– దక్షిణాఫ్రికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగిన అహింస పోరాట ప్రచారానికి గాంధీజీ ఫుట్ బాల్ క్రీడను కూడా వినియోగించుకున్నారు.

– ————————
– సిరిచందన

Send a Comment

Your email address will not be published.