"గాలివాన పా. ప"

గాలివాన అనే మాట వినడంతోనే మనందరికీ గుర్తుకొచ్చే రచయిత పాలగుమ్మి పద్మరాజు. ఆయన రాసిన గాలివాన కథకు అంతర్జాతీయ స్థాయిలో బహుమతి రావడంతో మనమందరం గొప్పగా ఫీల్ అయ్యేలా చేసారు. న్యూ యార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ 1952 లో నిర్వహించిన కథల పోటీలో 23 దేశాల నుంచి 59 మంది కథలు వచ్చాయి. వాటిలో పాలగుమ్మి గారి కథ గాలివాన కూడా ఒకటి. ఈ కథకు ద్వితీయ బహుమతి లభించింది.

ఇంతకూ ఆ కథ ఏమిటంటే….ఒక భయానక అనుభవానికి లోనై ఆ అనుభవాన్ని మాత్రమె గాలివాన కథలో చిత్రించారు. ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకున్న ఒక వ్యక్తి క్షోభను చెప్పే కథ ఇది. ఈ కథలో ఆయన ఒక పరిస్థితిలో పరస్పర విరుద్ధమైన ఇద్దరి స్థితిని, ప్రవర్తనను మనముందు ఉంచారు. ఇద్దరిలో ఒకరు సాఫీగా స్థిరమైన జీవితం గడిపే వ్యక్తి అయితే మరొకరు ఒక బిచ్చగత్తె. ఆమెకు మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియని స్థితి. 1948 లో ఒకానొక అర్ధ రాత్రి వచ్చిన తుఫానులో ఇల్లు కూలిపోతుంది. ఆ కూలిన ఇంటి కింద ఆయన భార్య దాదాపు మూడు గంటలు చిక్కుకుపోయారు. ఆ రాత్రంతా భయం భయం. ఆనాటి రాత్రి అనుభవాన్నే ఆయన గాలివాన కథలో చిత్రించారు.

గొప్ప కథకుడిగా, భావకుడిగా దర్శకుడిగా, మాటల, పాటల రచయితగా తనదైన ఓ ముద్ర వేయించుకున్న పాలగుమ్మి పద్మరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని తిరుపతిపురంలో 1915 జూన్ 24వ తేదీన జన్మించారు. 1983 ఫిబ్రవరిలో డిల్లీలో కన్నుమూసారు. ఈ జనన, మరణ తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తి జీవితంలోను రెండు తేదీలు ఎంతో ప్రత్యేకమైనవని, అవి పుట్టిన, గిట్టిన తేదీలని ఆయన అంటుండేవారు.

గాలివాన కథకు బహుమతి వచ్చి ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చిన క్రమంలో బీ ఎన్ రెడ్డి గారు పాలగుమ్మిని మద్రాసుకు రప్పించుకుని బంగారు పాప సినిమాకు కథ రాయించారు. అది ఆయనకు తొలి సినిమా. అది హిట్టవడంతో ఆయన ఆ తర్వాత సినీ రంగంలో వెనుతిరిగి చూడలేదు. కానీ ఆయన చెప్తుండేవారు ఇలా….
సినీ ప్రపంచంలో అడుగు పెట్టడంతో తన స్వతంత్ర రచనా తీరుకు కాస్తంత భంగం కలిగినట్టు. ఎందుకంటే, సినిమాకు రాకముందు ఆయన ఏ కథ రాసినా అది సగటు మనిషికి నచ్చుతుందా అనే ప్రశ్న ఎప్పుడూ ఎడురుకాలేదట. కానీ సినీ జగత్తులో ఆయనకు ఆ ప్రశ్న అడుగడుగునా ఎదురైనట్టు చెప్పుకున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (1985) కూడా అయిన ఆయనకు మృత్యువు అంటే అదేదో చెప్పలేని ఆకర్షణ. పాలగుమ్మిగారికి అప్పుడు పన్నెండో ఏట. అప్పుడు ఆయన తాత గారు మరణించారు. తాతగారి మరణం ఆయనపై చెరగని ముద్ర వేసింది. ఆయన చివరి ఘడియలను ఆయన ప్రత్యక్షంగా చూసారట. అప్పటినుంచి ఆయనకు మృత్యు సమీపంలో ఉన్న ఏ వ్యక్తిని చూసినప్పుడు ఆయన కాళ్ళు అక్కడినుంచి ముందుకు కదిలేవి కావు. అంతే కాదు, తొలి కవిత కూడా ఆయన తాతగారి మరణం పైనే రాసారు. అలాగే తాతగారి మరణంతో కలిగిన అనుభవాలను ఆయన తన కథల్లో ఎక్కడో అక్కడ చెప్పుకోసాగారు. ఆ తర్వాత ఓ నాలుగేళ్ల పాపాయి చనిపోయినప్పుడు కూడా ఆయన కొన్ని పద్యాలు రాసారు. చివరికి ఆయన కవితా రచన కూడా ఇంచుమించు ఆగిపోవడం కూడా ఓ మృత్యువు వల్లే కావడం గమనార్హం.

ఆయన తొలి కథ శీర్షిక సుబ్బి. ఈ కథను ఆయన తన 22వ ఏట రాసారు.

కథానిక ఒక మెరుపులాంటిదాని ఆయన అభిప్రాయం. అయితే ఈ మెరుపు మెరిపించడానికి కీలకమైనదే రచనాగతమైన శిల్పం. ఇలా మెరిపించడం దాని స్వభావం. అయితే ఈ శిల్ప చమత్కృతి సాధించడం ఎలాగన్నది మరొక ప్రశ్న. కథలో ఏది ఎక్కవ స్పుటంగా చిత్రించడంలో నిర్ణయించడమే కథా శిల్పంలో కష్టమైనదని ఆయన అభిప్రాయం. కథానికలో ప్రతీ వాక్యం, ప్రతి భావచిత్రం మెరుస్తూ ఉండాలనే వారు పాలగుమ్మి.

ఆయన కెమిస్ట్రీ చదివిన తర్వాత 1939 – 1952 సంవత్సరాల మధ్య కాకినాడలోని ప్రభుత్వ పీ ఆర్ కాలేజీలో సైన్స్ లెక్చరర్ గా పనిచేసారు.

మూడు యాభైలకు పైగా కథలు రాసిన ఆయన నాటికలు, నాటకాలు, నవలలు కూడా అందించారు. బతికిన కాలేజీ, నల్ల రేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇందులో నల్ల రేగడి నవలను ఆధారంగా చేసుకుని మన ఊరి కథ సినిమా తీసారు. ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించారు.

భాగ్య రేఖ, భక్త శబరి, శాంతినివాసం, బికారి రాముడు, బంగారు పంజరం, రంగుల రాట్నం, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సర్దార్ పాపారాయుడు, స్త్రీ తదితర చిత్రాలకు ఆయన వర్క్ చేసారు. బికారి రాముడు, దేవుడిచ్చిన భర్త చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ఆల్ ఇండియా రేడియో కోసం ఆయన పట్నవాసం అనే నాటకాన్ని ఆరు నెలలు సీరియల్ గా ప్రసారం చేసారు. ఇందులో షావుకార్ జానకి ప్రధాన పాత్ర పోషించారు. ఈ నాటకానికి మంచి ఆదరణ లభించింది.

ఆయన తన 21వ ఏట సత్యానందం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సత్యానందం వయస్సు 12 సంవత్సారాలు.

ఆయన బహుభాషాకోవిదుడు. తెలుగు సరే సరి, ఇంగ్లీష్, సంస్కృతం, జర్మన్, ఫ్రెంచి, హిందీ, తమిళం, కన్నడం భాషలు ఆయనకు తెలుసు. కన్నడంలో ఒక చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా రాసారు.

మనుషుల్లో నెగిటివ్ క్యారక్టర్ ని పాజిటివ్ గా చూడటం ఆయనకు ఉన్న గొప్ప అలవాటు.

టెన్నిస్ ఆడటమంటే ఆయనకు చాలా ఇష్టం. ఆరోగ్యంపై ఎనలేని శ్రద్ధ చూపే వారు.

ఆయన రాసిన కథల్లోని పాత్రలలో చాలా వరకు మన చుట్టూ సజీవంగా ఉన్నవాళ్ళే. దీనివల్ల కొన్ని సార్లు ఆయనకు చిక్కులు కూడా ఎదురయ్యాయంటారు.

ఏదేమైనా ఆయన మన ఆంద్ర రచయిత కావడం మన గొప్పతనం.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.