గీతా జయంతి

ప్రపంచంలో ఓ పుస్తకానికి పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక్క భగవద్గీతకే దక్కింది. భగవద్గీత జయంతిని ప్రతిఏటా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి పుష్య శుద్ధ పాడ్యమి వరకు ఉన్న పద్దెనిమిది రోజుల పాటు భారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ప్రారంభమైన రెండు రోజుల ముందు అంటే ఏకాదశి రోజున భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు. భగవద్గీత జ్ఞానసాగరం. భావ సముద్రం. భగవత్ప్రాప్తికి సమత్వమే గీటురాయి.

భగవద్గీత మానవ జన్మను సార్ధకం చేసుకోవడానికి దోహదపడే పవిత్ర గ్రంధం. ప్రతి ఒక్కరూ ఇది చదవాలి. చదవలేని వారు కనీసం వినాలి. అర్ధం చేసుకోవాలి. భగవద్గీత భగవంతుడు స్వయంగా గానం చేసిన దివ్య వాని. గీత మహత్యాన్ని శివుడు పార్వతీ దేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. అర్జునుడికి అవతారపురుషుడైన శ్రీకృష్ణుడు చెప్పగా ఆ గీతను వేదవ్యాసుడు రాశాడు.

స్వామీ వివేకానంద భగవద్గీత గురించి చెప్తూ “కృష్ణుడు అర్జునుడికి చెప్పినవి కేవలం మాటలు కావు …ఆవు జ్ఞానగుళికలు. ఆకాశాన్ని మెరుపుతీగ వెలిగించినట్టు కృష్ణుడి మాటలు అర్జునుడి మనోఫలకాన్ని ప్రకాశింపచేసాయి” అన్నారు.

జాతిపిత గాంధీజీ గీతను తనకు ఓ మార్గదర్శిగా అభివర్ణించారు. “నా మనసులో సందేహాల పరంపర ఎక్కువైనప్పుడు, నిరుత్సాహం నా ముఖం మీద తాండవిన్చినప్పుడు, ఆశాకిరణం ఒక్కటీ కనిపించక అంధకారంలో మునిగినప్పుడు నేను భగవద్గీత వైపు దృష్టి సారిస్తాను. అందులో ఏ ఒక్క శ్లోకం చదివినా నన్ను ఓదారుస్తుంది. తక్షణమే నా ముఖాన చిరునవ్వు పుడుతుంది. అందుకే నాకు భగవద్గీత ఓ గొప్ప గ్రంధం” అని ఆయన చెప్పుకున్నారు.

పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతలో మొత్తం 701 శ్లోకాలు ఉన్నాయి. పదకొండో శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ రంగమైన కురుక్షేత్రంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. జ్ఞాన, భక్తి, నిష్కామ, కర్మ తత్వ రహస్యాలను విపులంగా సులభంగా చెప్పిన గీత బోధను వ్యాసుడి అనుగ్రహం వల్ల ప్రత్యక్షంగా విన్న భాగ్యవంతుడు సంజయుడు. సంజయుడు దృతరాష్ట్రుడికి గీతను చెప్తూ వచ్చాడు. సంజయుడితో పాటు అర్జునుని రధంపై ఉన్న ఆంజనేయుడు కూడా గీతను వినగాలిగాడు.

గీతలో “గీ” అంటే “త్యాగం” అని, “త ” అంటే తత్వజ్ఞానం”. అనగా త్యాగాన్ని, తత్వ జ్ఞానాన్ని బోధించిన భగవద్గీత సమస్త వేదాల సారం. ఉపనిషత్తుల సారం.

భగవద్గీత గంగ కన్నా ఉత్తమమైనది. గీత అనే గంగలో మమేకమైన వారికి ముక్తితోపాటు ఇతరులనూ తరింపచేస్తారనడంలో సందేహం లేదు.

కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం జరగకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా యుద్ధం జరగనే జరిగింది. యుద్ధంలో ఆయుధం ముట్టబోనని చెప్పిన శ్రీకృష్ణుడు అర్జునుడి రధానికి సారధిగా ఉంటాడు. యుద్ధం మరి కాసేపట్లో ప్రారంభం అవుతుందనగా అర్జునుడు కౌరవుల పక్షాన్ని చూసి భీష్ముడి లాంటి వారితో పోరాడటమా అని చెప్పి బలహీనపడినప్పుడు శ్రీకృష్ణుడు గీతను బోధించి యుద్ధం చేయిస్తాడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులేకాక ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాల్సిన పవిత్ర గ్రంధం భగవద్గీత.
గీతా జయంతి రోజున భక్తులు గీతను పారాయణం చేయడమే కాకుండా ఉపవాసం ఉంటారు. ఆరోజు ఏకాదశి కావడం మరొక విశేషం. పూజలు, భజనలు చేయడం కద్దు. గీతా జయంతి ఘనంగా జరుపుకునే చోట గీత నాటకాన్ని కూడా ప్రదర్శించే సంప్రదాయం కూడా ఉంది. అలాగే చిన్న పిల్లలకు గీతా శ్లోకాలకు సంబంధించి పోటీలు కూడా పెడతారు. సాదువులు యోగులూ గీత మీద ఉపన్యాసాలు ఇస్తారు. అంతేకాదు భగవద్గీత ప్రతులను ఉచితంగా పంపిణీ చేస్తారు.

మలేషియాలో అక్కడ ఉన్న హిందూ సంస్థల సహకారంతో గీతా జయంతిని ఘనంగా నిర్వహిస్తుంటారు.
సింగపూర్ లో నెలరోజులపాటు గీతా జయంతి వేడుకలు జరుపుకోవడం విశేషం. అక్కడున్న హిందువుల దేవాలయాలలో గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలలోను ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం గమనార్హం.

ఎవరైనా మరణించినప్పుడు వారిని శ్మశాన వాటికకు తరలించేటప్పుడు గీతా శ్లోకాలు వినిపించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నిజానికి అప్పటికన్నా మనిషి బాల్యం నుంచే వారికి గీతా ప్రాశస్త్యాన్ని చెప్పగలిగితే పెరిగే కొద్దీ సమాజంలో ఎదురయ్యే చాలా సమస్యలకు పరిష్కారంతో పాటు సత్ప్రవర్తనతో మెలిగేందుకు భగవద్గీత ఎంతగానో దోహదపడుతుంది అనేది నిర్వివాదాంశం.

– గండూరి రేణుక, విజయవాడ

Send a Comment

Your email address will not be published.