గుమ్మడి సదా స్మరణీయులు

“నాన్న  చేత్తో పెట్టిన పెరుగన్నం… నా నాలుగేళ్ళప్పుడు నాన్న పొట్ట మీద కూర్చుని ఆటలాడటం….నేను పుట్టినప్పుడు అప్పటికప్పుడు బజారుకెళ్ళి బంగారు గాజులు కొనుకొచ్చినట్లు ఇంట్లో చెప్పుకోవడం….అందరితోను వినయవిధేయతలతో నడచుకోవాలని, ఎవరినీ చిన్నచూపు చూడకూడదని  నాన్న  చెప్పిన మాటలు, ఎవరినీ నొప్పించకూడదని చెప్పే తీరు….డబ్బే జీవితం కాకూడదని చెప్పడం…మా అందరికీ చెప్పే వాటిని ఆయన స్వయంగా పాటిస్తూ  ఆదర్శంగా నిలవడం చిరస్మరణీయం…..”

ఈ మాటలు మరేవరివో కావు…. గుమ్మడి కుమార్తె జాగలూరు లక్ష్మి గారివి.

తనకిచ్చిన పాత్రలో వంద శాతం జీవించి పలువురి ప్రశంసలు అందుకున్న  గుమ్మడి వేంకటేశ్వర రావు 1928 జూలై తొమ్మిదో తేదీన గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు సమీపాన గల ఒక పల్లెలో జన్మించారు. ఆయన విశేష ఆదరణగల క్యారెక్టర్ యాక్టర్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన గుమ్మడి ఎన్ టీ ఆర్, అక్కినేని నాగేశ్వరరావుల కన్నాచాలా ఆలస్యంగా నటించడం మొదలుపెట్టినప్పటికీ ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందటం  గమనార్హం.

గుమ్మడి తొలిసారిగా 1942 లో నటించారు. స్టేజిపై ఒక వృద్ధుడి వేషంలో నటించారు. మరో ఎనిమిది సంవత్సరాలకు ఆయన అంటే 1950 లో ఆయన అదృష్ట దీపుడు అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. 1955 లో వచ్చిన మిస్సమ్మలో అతిధి పాత్రలో కనిపించారు. తనకన్నా వయసులో పెద్దవారైన ఏ ఎన్ ఆర్, ఎన్టీఆర్ లకు తండ్రిగా కూడా నటించారు.

గుంటూరులోని హిందూ కాలేజీలో చదివిన గుమ్మడికి చిన్నప్పటి నుంచి నాటకాలన్నా, సినిమాలన్నా ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో ఆయన బాలనాగమ్మ సినిమాను పద్దెనిమిది సార్లు. కిస్మత్ అనే హిందీ సినిమాను పద్నాలుగు సార్లు చూసారు.

పౌరాణిక నాటకాలలో ఆయనకు మాధవపెద్ది వెంకట్రామయ్య స్ఫూర్తి. తోడల్లుడు రామకోటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించిన గుమ్మడి నటుడిగా ఎన్నో గెటప్స్ లో నటించారు.

క్యారక్టర్ యాక్టర్ గా నటించడం అనుకున్నంత సులభం కాదని చెప్పిన గుమ్మడి ఆయన ఎందరో హీరోలకు, హీరోయిన్లకు తండ్రిగా నటించారు.

మహామంత్రి తిమ్మరుసు సినిమాలో నటించినటైటిల్ రోల్  నటనను ఎప్పటికీ మరచిపోలేనని అంటూ ఉండేవారు.

హైదరాబాదులో మొదటిసారిగా నిర్మించిన మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గుమ్మడి ఇందులో జమునకు భర్తగా నటించారు.

అయిదు వందలకు పైగా చిత్రాలలో నటించి అందరి మన్ననలు అందుకున్న గుమ్మడి ఏ రోజూ చిత్ర నిర్మాణానికో దర్శకత్వం వహిమ్చాలనో అనుకోలేదు. అసలా ఆలోచనే దరికి రానివ్వని గుమ్మడి ఎన్టీఆర్, ఎఎన్ ఆర్, నాగయ్య, ఎస్ వీ రంగారావు, కన్నంబ, శాంతకుమారి, సావిత్రి, అంజలీదేవి తదితరులతో కలిసి నటించే అదృష్టం పొందారు.

ఆ రోజుల్లో వచ్చిన సినిమాల్లో ఓ ధ్యేయం ఉండేదని, అది ఈ తరంలో కొరవడిందని బాధపడుతుండే గుమ్మడి అదంతా కాలం మహిమ అని చెప్పేవారు. ఈ రోజుల్లో చిత్రాలు నిర్మిస్తున్న వారిలో చాలా మంది డబ్బులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, డబ్బులు వస్తాయనుకుంటే ఎలాంటి చిత్రాలు తియ్యదానికైనా ముందు వెనుకలు ఆలోచించడం లేదని ఓ ముఖాముఖిలో చెప్పి ఆందోళన వ్యక్తం చేసారు. అయితే సాంకేతికపరంగా చలచిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.

ఎంతగా పేరు ప్రఖ్యాతులు వచ్చినా నిరాడంబరుడిగా ఉండటం, అందరితో మంచిగా ఉండటం ఆయన సుగుణాలు. అత్యాశ అనేది లేదు. కర్మయోగిగా జీవిత సాగించిన గుమ్మడిని తెలుగు విశ్వా విద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన గుమ్మడి నటనా చాతుర్యానికి  డాక్టరేట్ ఇచ్చినట్టు వెల్లడించింది. ఆయన పొందిన అనేకానేక అవార్డులలో రాష్ట్రపతి నుంచి రజత పతకం కూడా ఉండటం విశేషం.

జాతీయ చలనచిత్ర అవార్డుల కమిటీలో మూడేళ్ళు జ్యూరీ సభ్యుడిగాను, రాష్ట్ర ప్రభుత్వతం ఇచ్చే నండీ అవార్డుల కమిటీలో రెండుసార్లు సభ్యుడిగాను ఉండిన గుమ్మడి ఎన్టీఆర్ అవార్డు కమిటీ, రఘుపతి వెంకయ్య అవార్డు కమిటీ సభ్యుడిగాను తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తిగా వినుతికెక్కిన గుమ్మడి తన జీవిత గాధను తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు అనే టైటిల్ తో రాసారు.

ఆరోగ్యం సహకరించకపొయినా ఆయన అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని నిర్మాతలు అభిప్రాయపడి నటించమని కోరగా గుమ్మడి సరేనని ఆయనకిద్దరు (1995), జగద్గురు శ్రీ కాశీ నాయన చరిత్ర (2008) చిత్రాల్లో నటించారు.

గుమ్మడికి … అయిదుగురు కుమార్తెలు. ఇద్దరు కొడుకులు. తీవ్ర అనారోగ్యంతో 2010 జనవరి 26వ తేదీన హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

ఆయన  చివరిసారిగా ఒక సభలో పాల్గొనడం అనేది మాయాబజార్ చిత్రాన్ని రంగులద్ది ప్రదర్శించిన కార్యక్రమంలో పాల్గొనడమే అని చెప్పుకోవాలి. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మాయాబజార్ లాంటి గొప్ప చిత్రాన్ని రంగుల్లో చూడటం కోసమే ఇంత సుదీర్ఘ కాలం తాను జీవించానని చెప్పారు.

అవసరానికి మించిన డబ్బుతో మనిషి ఏమి చేసుకుంటాడు అని చెప్పే గుమ్మడికి పొద్దున్నే లేచి వాతా పత్రిక చదవడం అలవాటు. ఆయనకు అప్పటికప్పుడు పిండిన పాలు కాచి ఒక గ్లాసుకు తగు మోతాదులో డికాషన్ కలిపి కాఫీ తాగడం అంటే మహా ఇష్టం. వర్షం కురిసినప్పుడు స్వయంగా పకోడా లు చేసి పిల్లలతో తినిపించి తానూ తినేవారు. పిల్లలను ఎప్పుడు పరుషపదజాలంతో కసురుకునే వారు కాదు. పిల్లలు ఏదైనా విషయంలో నిరాశ పరచినా సరే ఆయన కసురుకునే వారు కాదు. సౌమ్యంగా మందలించేవారు. షూటింగులు లేనప్పుడు ఆయన టైం అంతా కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపేవారు. ఆయన ఇంటి ఆవరణలోనే పిల్లలతో క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడేవారు. అలాగే మద్రాస్ మెరీనా బీచ్ కి పిల్లలను తీసుకు వెళ్లి అక్కడి తీరాన సరదాగా కాలక్షేపం చేసేవారు. ఆతర్వాత బీచ్ రోడ్డులోని ఓ రెస్టారంటులో కుల్ఫీ ఐస్ తిన్న తర్వాత ఇంటికి చేరుకునే వారు. వేసవి సెలవుల్లో ఆయన తలపాగా చుట్టుకుని ఎడ్ల బండి తొలి పిల్లల్ని ఆశ్చర్యపరిచేవారు. పిల్లల్ని కొల్లూరు థియేటర్ కు తీసుకు వెళ్లి సినిమాలు చూపించేవారు.

ఆయన పుస్తకాలు బాగానే చదివేవారు. ఆయన లైబ్రరీలో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, వేయి పడగలు, శరత్ చంద్ర సాహిత్యం, చలం రచనలు, జంధ్యాల పాపయ్య శాస్త్రి పుస్తకాలు ఉండేవి.

చిత్రకారులు అంటే మహా ఇష్టం. వారి కళాకౌశలాన్ని కొనియాడే గుమ్మడి ఓ మారు ప్రముఖ చిత్రకారులు బాపుగారిని ఒక్క స్ట్రోక్ లో గాంధి, నెహ్రు బొమ్మలు గీయమని కోరినప్పుడు బాపుగారు సరేనని ఆ ఇద్దరు నేతల చిత్రాలు గీసి చూపించారట.

మానవత్వానికి ప్రతిరూపంగా ఉంటూ ఆదర్శనీయుడిగా  జీవితాంతం జీవించిన గుమ్మడి సదా చిరస్మరణీయులు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.