గులాబి గాంగ్

పన్నెండేళ్ళ ఏళ్ళ వయస్సులో మంగళ సూత్రాన్ని కట్టించుకుని, అయిదుగురు పిల్లలను వెంట వెంటనే కని, పెద్దగా చదువు సంధ్యలు లేని ఒక పల్లెటూరు స్త్రీ ఏం చెయ్యగలదు? ….

అనే ఈ ప్రశ్నకు జవాబుగా  విశ్వరూపం ఎత్తి నిల్చున్న సంపత్ దేవి ఏర్పాటు చేసిన గులాబీ గాంగ్ సంస్థలో ఇప్పుడు దాదాపు ఇరవై వేల మంది సభ్యులు ఉన్నారంటే అది సామాన్యమైన విషయంకాదు. బాల్య వివాహం, వరకట్నం, అమ్మాయిలను చదివించక పోవడం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం  జరుపుతున్న  ఈ సంస్థ గురించి చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

ఎనిమిది ఏళ్ళ క్రితం సంపత్ దేవిలోనించి ఒక విప్లవ స్త్రీ విశ్వరూపం తీసింది.

ఆరోజు ఎప్పటి లాగే ఉత్తర ప్రదేశ్ లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న తన గ్రామంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు జరిగిన సంఘటన అది.

అప్పుడు ఒక ఇంటి వాకిట్లో ఒక గొంతు వినిపించింది. ఒక వ్యక్తీ తన భార్యను గుమ్మంలో నిల్చోబెట్టి  చిత్తమొచ్చినట్టు కొడుతున్నాడు. ఆమె ఈ  దెబ్బలు తట్టుకోలేక రోదిస్తోంది. అక్కడే ఉన్నఆమె  పిల్లలూ ఏడుస్తున్నారు. కానీ అతనేమీ కొట్టడం ఆపడం లేదు. అటువైపు వచ్చీ పోయేవాళ్ళు ఈ దృశ్యాన్ని ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప ఎవరు కొట్టవద్దని అడ్డు పడటం లేదు. కానీ సంపత్ దేవి అలా ఉత్తినే ఉండలేకపోయింది.

ఎందుకు కొడుతున్నావు? ఆమె కూడా నీలాగా ఒక మనిషేకదా….? కొట్టడం ఆపుతావా లేదా అని గట్టిగా అడిగింది.

కానీ ఆ సాడిస్టు భర్త ఆమె మాటలు లెక్క చెయ్యలేదు. నేను కొడుతున్నది ఎవరినో కాదు, నా భార్యనే…నా భార్యను కొట్టకూడదని చెప్పడానికి మీరెవరు? మీరు మీ  దారి చూసుకుని పొండి అని అతను అరిచాడు. ఆ మాటలు మరోకరినైతే అక్కడినుంచి వెళ్ళిపోయేలా చేసేదే. కానీ సంపత్ దేవి కొంచం సేపు తర్వాత ఆమె అక్కడినుంచి ఇంటికి చేరుకుంది. ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆ సాడిస్టు భర్త అకారణంగా తన భార్యను కొట్టడం గురించే ఆలోచించింది. ఇటువంటి సంఘటనలకు ముగింపు పలకాలనుకుంది. ఆ మొగుడి చేతిలో ఆమె దెబ్బలు తినవల్సిందేనా? లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. మరుసటి రోజు పొద్దున్నే ఆమె మరో కొందరు మహిళలతో కలిసి కర్రలు  పట్టుకుని ఆ బాధిత మహిళా ఇంట్లోకి దూసుకు వెళ్లి మొగుడిని చితక బాదారు.

ఇక ఆ మొగుడు మరో దారిలేక వారి కాళ్ళపై పడి తప్పిపోయిందని ప్రాధేయపడ్డాడు. ఇంకెప్పుడూ ఆమెను కొట్టనని లెంప లేసుకున్నాడు. మొత్తానికి తమ సంఘం అనుకున్నది సాధించినందుకు సంపత్ దేవి సంతోషించింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల మహిళలు కూడా ఈ సంఘంలో సభ్యులుగా చేరడానికి స్వచ్చంగా ముందుకు వచ్చారు.

అయిదుగురితో ప్రారంభమైన ఈ సంఘంలో ఇప్పుడు దాదాపు ఇరవై వేల మంది మహిళలు ఉన్నారు. వీరు తమకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండటం కోసం గులాబీ గాంగ్  అని సంఘానికి  పేరు పెట్టుకోవడంతోపాటు సభ్యులందరూ గులాబీ రంగు చీర కట్టుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ సంఘం పుట్టడంతో ఇప్పుడు ఆ పల్లెలోనే కాకుండా చుట్టుపక్కల ఏ గ్రామంలోనూ మహిళలను వేధించే వారి సంఖ్యా తగ్గింది అనడం అతిశయోక్తి కాదు. మహిళలను కొట్టడానికి భయపడుతున్నారు. వరకట్న వేధింపులు తగ్గాయి. అమ్మాయిలను చదివిస్తున్నారు.

ఇటీవల ఒక పోలీస్ ఒక బాధిత మహిళా ఫిర్యాదు చెయ్యడానికి వస్తే సదరు పోలీస్ ఆమెను పట్టించుకోకుండా కించపరచి మాట్లాడాడు. ఈ విషయం తెలియడంతోనే సంఘం సభ్యులు ఆ పోలీస్ వద్దకు వెళ్లి ఉతికి పారేశారు. అతను వారితో కాళ్ళ బేరానికి వచ్చాడు.

ఇలా ఉండగా,  ప్రముఖ నటి మాధురి దీక్షిత్ ఈ సంఘం పేరిట అంటే గులాబీ గాంగ్ అనే పేరు మీద తీసిన చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఈ గాంగ్ ని ఒక హంతకుల బృందంగా చిత్రించారు. ఈ విషయం తెలిసి తమను అవమానించే విధంగా తీసిన ఆ సినిమాను ఉద్యమించడం తో ఆ సినిమాను ఒక కల్పిత కథ అని సినీ యూనిట్ అత్యవసరంగా ఒక ప్రకటన చేసారు.

అలాగే గులాబి గాంగ్ అనే పేరుతో ఈ సంఘం గురించి మిషితా జైన్ అనే మహిళా దర్శకురాలు ఒక సినిమా తీసారు. ఈ సినిమాలో గులాబీ గాంగ్ సభ్యులే నటించారు.

Send a Comment

Your email address will not be published.