గొబ్బిళ్ళో..గొబ్బిళ్ళో..

తెలుగు వాళ్ళకు పెద్ద పండుగ అని వేరేగా చెప్పక్కరలేని అచ్చమైన పండుగ పుష్యమాసంలో వచ్చే ఈ మూడు రోజుల పండుగ….భోగీ…మకర సంక్రాంతి….కనుమ….

ఇతర పండుగలా కాకుండా తిథి ప్రధానమైన పండుగ కాదు భోగీ….దక్షిణాయానానికి చివరి రోజున వచ్చే పండుగ భోగీ….అంతేకాదు ధనుర్మాసానికీ ఇదే ఆఖరి రోజు.

రైతన్న పంటలు చేతికంది సిరులు పండించే పండుగ కనుకే దీనికి భోగీ పండుగ అని చెప్పుకోవడం జరుగుతోంది. మరోవైపు పదకోశాలు చెప్పే అర్ధం మాత్రం మరోలా ఉంది. పెద్ద పండుగగా చెప్పుకునే మొదటి రోజునే భోగీ అని చెప్పాయి. ఇదిలా ఉండగా ఇంద్రుని గురించి చేసుకునే పండుగగానూ భోగీని ప్రస్తావిస్తారు. ఇంద్రుడిని మేఘానికి అధిపతిగా చెప్తుంటారు. మేఘాలు చేసే మేలు తెలిసిందే కదా….మేఘాల వాళ్ళ ప్రపంచానికి వర్షాలు వస్తాయి. రైతన్న పండించే పంటలకు వర్షం చాలా ముఖ్యమైన ఆధారం. అంటే వర్షం కోసం ఇంద్రుని పూజించడం ఆచారమైంది. ఇటువంటి పూజ వల్ల ద్వాపర యుగాన ఇంద్రుడికి గర్వం పెచ్చుమీరింది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచాలనుకుని గోవుల కాపర్లను కూడగట్టుకుని ఇంద్రుడి జోలికి పోకుండా రైతులకు మల్లె మనకు వర్షాల అవసరం లేదని, పశువులకు మేత ఇచ్చే గోవర్ధన గిరి మీదున్న పచ్చిక ప్రధానం కనుక ఆ పర్వతానికే పూజలు చేద్దాం అని చెప్తాడు. కృష్ణుడి మాటలతో ఏకీభవించిన గొల్లలు గోవర్ధన గిరికే పూజలు చేస్తారు. ఈ విషయం తెలిసి ఇంద్రుడికి చెడ్డ కోపం వస్తుంది. గొల్లల పని పట్టాలనుకుని భారీ వర్షం కురిపిస్తాడు. అప్పుడు గొల్లలు కృష్ణుడికి తమ కష్టాలను చెప్పుకుంటారు. అయితే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గొల్లలు కుటుంబాలన్నిటినీ ఆ పర్వతం కిందకు తీసుకొచ్చి ఆదుకుంటాడు. దానితో ఇంద్రుడు తాననుకున్నది జరగలేదని గర్వాన్ని వీడి కృష్ణుడికి తల ఒగ్గుతాడు. దానితో కృష్ణుడు ఇంద్రుడిని క్షమించి పూర్వంలాగా భోగీ రోజున ఇంద్రపూజ జరిగేట్టు ఆజ్ఞాపిస్తాడు. ఈ భోగీ రోజునే బలి చక్రవర్తి అణగిన రోజుగాను చెప్పుకుంటారు.

భోగీ పండగ నాడు వెలుగు ఇంకా పూర్తిగా రాకముందే నిద్ర లేచి తల స్నానం చేయడం వల్ల భోగీ పీడా మనల్ని వదిపెట్టి పోతుందని ఒక విశ్వాసం. అంతేకాదు ఆరోజు ఇరుగుపొరుగు వారిని పిలిచి చిన్న పిల్లలకు భోగీ పళ్ళు పోస్తారు. పోయిస్తారు. రేగిపళ్ళు, చెరకు ముక్కలు, బంతిపువ్వులు కలిపి పిల్లల తలమీద పోస్తారు. ఇలా చేయడం వల్ల ద్రిస్టి దోషం పోయి వారి ఆయుష్షు పెరుగుతుందని పెద్దల నమ్మిక.

ఇక మకరసంక్రాంతి విషయానికి వస్తే, సూర్యుడి సంచారం బట్టి ఏర్పడిన పండుగ రోజు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే రోజుని మకరసంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి అత్యంత పురాతనమైనది. ఈ రోజు నుండే ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణం అత్యంత పుణ్యకాలం. ఈ సంక్రమణం రోజు ఒంటిపూట భోజనం చేస్తారు. రాత్రి తినరు. దేవా, పితృ పూజలకు ఎంతో దివ్యమైన రోజులివి. ఈ సంక్రమణ కాలంలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, తిలలు, చెరకు, గోవు వంటివి దానం చేస్తారు. వస్త్ర దానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెతో శివుడి దగ్గర దీపం వెలిగించడం ఎంతో శ్రేష్టం. అంతే కాదు, ఈ రోజు నువ్వులను ఏదో రూపంలో తినాలని చెప్తుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజు పొంగలి తింటారు. కొన్ని చోట్ల బొమ్మల కొలువు పెడతారు. తాంబూలం ఇస్తారు. ఈ రోజు పొద్దున్నే అమ్మాయిలు నిద్ర లేచి వాకిలి చిమ్మి రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బిళ్ళు పెట్టి వాటికి కామంచి పళ్ళు నైవేద్యం పెడతారు. గొబ్బెమ్మను గౌరీ దేవిగా భావించి దాని చుట్టూ కన్నేలందరూ గొబ్బి తడుతూ పాటలు పాడతారు. అలా చేయడం వల్ల వారికి త్వరలోనే పెళ్లి అవుతుందని ఒక అభిప్రాయం.

సంక్రాంతి మరుసరి రోజు కనుమ పండుగనాడు పాడి పంటలు, గోసంపదను లక్ష్మీ స్వరూపంగా అర్చించడం ఆనవాయితీ. వాటిలోని పోషక శక్తిని వినియోగించుకునే మనం వాటిని ఆరాధించడం ఎంతైనా సమంజసం కదా?

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.