తెలంగాణా రాష్ట్రం సాకారమయిన తరువాత మొదటిసారిగా వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించిన తెలంగాణా ప్రభుత్వం జాతీయ పతాకం ఎగరవేయడానికి గోల్కొండ కోటను ఎంచుకుంది. ఈ నెల 15న అక్కడే జెండా ఎగరేసి రాష్ట్ర ప్రజలనుద్దేసించి ప్రసంగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంకల్పించారు. అయితే సైన్యం నుంచి దీనికి చుక్కెదురయింది. ఈ కోట తమ అధీనంలో ఉందని, ఇందులో 51 ఎకరాల భూమిపై తమకు యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయని, అందువల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వేడుకలూ జరుపుకోకూడదని సైనికాధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. జెండా ఎగరవేయడానికి స్థలాన్ని ఎంపిక చేసేందుకు వచ్చిన రెవిన్యూ అధికారులను సైనికులు అడ్డుకుని వెనక్కు పంపించేశారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులకు, సైనికాధికారులకు మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కూడా జరిగింది. ముఖ్యమంత్రికి ఈ వార్త చేరడంతో ఆయన తమ అధికారులు, సైనికాధికారులకు మధ్య సమావేశం ఏర్పాటు చేశారు.