గోల్కొండ కోట విశేషాలు

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో నిర్వహించారు. గుర్రపు స్వారీ చప్పుళ్ళు, సైనికుల కవాతులతో గోల్కొండ కోట మురిసిపోయింది. గోల్కొండ కోటలోని రాణీమహల్ దగ్గర తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర రావు జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. గోల్కొండ చుట్టూ ఎటు చూసినా సరికొత్త ఉత్సాహం, ఉత్తేజం నెలకొంది. ఈ కోటకు సంబంధించి చెప్పుకోవడానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్నైనా ఇక్కడ తెలుసుకుందాం…..

గోల్కొండ ఫోర్ట్ అనే మాట తెలుగు పదాలైన గొల్ల కొండ నుంచి వచ్చింది.

గోల్కొండ రాజ్యాన్ని క్రీస్తుశకం 1083 – 1323 మధ్య కాలంలో కాకతీయులు పాలించారు. వారి హయాములోనే గోల్కొండను మట్టితో నిర్మించారు. దీనిని తదనంతర పాలకులు గ్రానైట్ తో పునర్నిర్మించారు. ప్రత్యేకించి సుల్తాన్ ఖులీ, జంషెడ్ ఖుతుబ్ షా, ఇబ్రహీం ఖుతుబ్ షాల పాలనలో 1518 – 1580 సంవత్సరాల మధ్య గోల్కొండ కోట పునర్నిర్మాణానికి నోచుకుంది.

దేశంలో గొప్పగా పరిరక్షిస్తూ చూసుకునే కోటలలో గోల్కొండ కోట ఒకటి.

డిల్లీలోని ఎర్ర కోటనైనా దాడి చేసారు గానీ గోల్కొండ కోటను ఏ సైన్యం దాడి చేయలేకపోయింది. ఔరంగజేబ్ లక్ష మంది సైన్యంతో 1687 లో జనవరి – సెప్టంబర్ నెలల మధ్య గోల్కొండపై దాడి చేసి స్వాదీనపరచుకోవడానికి పోరాడాడు. కానీ అతను ఓడిపోయాడు. దండయాత్ర వల్ల ఫలితం లేదనుకున్న ఔరంగజేబ్ చివరికి అక్కడి భద్రతా సిబ్బందికి లంచమిచ్చిఅడ్డదారిలో కోటలోకి ప్రవేశించాడు.

కాకతీయుల కాలంలో గోల్కొండ కోట ఓ అవుట్ పోస్టులా ఉండేది.

గోల్కొండ కోట వజ్రాల పరిశ్రమకు కేంద్రంగా ఉండేది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం ఇక్కడినుంచే పుట్టుకొచ్చింది. అలాగే దరయ నూర్ వజ్రం కూడా ఇక్కడి నుంచే వెలుగులోకి వచ్చింది.

ఖుతుబ్ సాహీ రాజుల పాలన తర్వాత 1591 లో గోల్కొండ రాజధానిని హైదరాబాద్ కొత్త నగరానికి మార్చారు.

ఆయుధాలకు, ఘనమైన కత్తులకు, ఫిరంగులకు, ఈటెలకు గోల్కొండ కోట స్థావరంగా ఉండేది.

ఒక ఆయుధం గానీ వజ్రం గానీ అమ్మేందుకు గోల్కొండ స్టాంప్ ఇస్తే సరిపోయేది. దీనిని బట్టి ఆ స్టాంపుకుఉన్న విలువ ఏ పాటిదో తెలుసుకోవచ్చు.

1363 లో ఈ కోటను బహమనీ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది. వారి ఆధిపత్యం 1518 లో అంతమొందిన తర్వాత ఖుతుబ్ సాహీ రాజుల పాలనలో గోల్కొండ కోట వారి రాజ్యానికి రాజధానిగా మారింది.

గోల్కొండ కోటకు అసఫ్ ఝా సుబేదారుగా వ్యవహరించారు. 1713 లో నిజాం ఉల్ ముల్క్ గా ఆయన స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు ఇది నిజాముల పరమై 1948 వరకు వారి ఆధీనంలో ఉండేది.

కప్పం కట్టకుండా భద్రాచలంలో రామాలయం నిర్మించిన భక్త రామదాసును తానీషా బంధించి గోల్కొండలోనే ఉంచారు. అబుల్ హసన్ తానీషా కాలంలో దీనిని కారాగారంగా మార్చారు.

మహమ్మదీయ రాజవంశీకులైన వారు మరణిస్తే సమాధి చేసే ముందు మృతదేహాలకు స్నానాలు చేయించడం ఒక ఆచారం. తుర్కీ, పారశీక విధానాలను అనుసరించి గోల్కొండ కోటలో నిర్మించిన గదులలో మృతదేహాలకు స్నానాలు చేయించే వారు.

గోల్కొండ కోట ఆవరణలో అప్పట్లో ఒక ధాన్యాగారం ఉండేది. దానికి పేరు అంబర్ ఖానా అని పేరు. దీనిని క్రీస్తుశకం 1642 లో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఖైరత్ ఖాన్ అనే వ్యక్తి దీనిని నిర్మించినట్లు ఒక శాసనాన్ని బట్టి తెలిసింది.

గోల్కొండ కోటపై మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. ప్రతీ ఏడాది తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇక్కడ బోనాలు సమర్పిస్తారు.

గోల్కొండ ఆవరణలో ఒక ఉద్యానవనం ఉంది. దీని పేరు నగీనా బాగ్. మొగల్ ఉద్యానవనాలకు ఇదొక చక్కని నమూనా. చతురస్రాకారంలో ఉన్న ఈ ప్రాంతాన్ని నాలుగు సమభాగాలుగా విభజించారు.

గోల్కొండ కోట పరిధిలో ఒక ప్రార్ధనా మందిరం ఉంది. అందులో ఓ అందమైన గూడు ఒకటుంది. దీనిని మెహ్రాబ్ అంటారు. కమాన్ల రూపంలో ఉన్న మూడు ద్వారాలు, ఒక సమావేశ గది ఉన్నాయి. ఈ కట్టడానికి రెండు వైపులా కమాన్ల ద్వారాలు అలరారుతుంటాయి.

గోల్కొండ కోటలోకి శత్రువులు ప్రవేశించినప్పుడు పైన ఉన్న వారికి సమాచారం చేరవేయడానికి కింద చప్పట్లు కొడితే పైకి వినిపించేలా ధ్వని శాస్త్రం ఆధారంగా ఎంతో అద్భుతంగా దర్వాజాలను నిర్మించారు. ఆ ధ్వనిని బట్టి శత్ర్వులపై ప్రతి దాడు చేసేవారు. ఇక్కడి దర్వాజాల నిర్మాణంపై ఇప్పటికీ దేశ విదేశ నిపుణులు అధ్యయనం చేయడం విశేషం.

గోల్కొండ చుట్టూ తొమ్మిది దర్వాజాలు ఉన్నాయి. అవి వేటికవే ప్రత్యేకం. అవి ….మకాయి దర్వాజా, బహమనీ దర్వాజా, ఫతే దర్వాజా, జమాలీ దర్వాజా, బంజారా దర్వాజా, పటాన్ చెరువు దర్వాజా, బాలా హిస్సార్ దర్వాజా, బౌద్లీ దర్వాజా.

నిజాం మంత్రులుగా పని చేసిన అక్కన్న, మాదన్నల కార్యాలయాలు గోల్కొండ కోటలో ఉండేవి. వారు ఇక్కడినుంచే పాలనా వ్యవహారాలను చక్కబెట్టే వారు.

యుద్ధాల సమయంలో శత్రువుల రాకపోకలను గమనించేందుకు గోల్కొండ కోటలో కర్టెన్ వాల్ నిర్మించారు. దీనిపై సైనికులు నిరంతరం పహారా కాస్తూ నిఘా వేసి ఉండేవారు.

గోల్కొండ కోటలో చప్పట్లు కొట్టే మండపం ఉంది. దీనికి ఎత్తైన పైకప్పు ఉంది. దీనికి తెరచి ఉన్న కమాన్లు ద్వారాలుగా ఉన్నాయి. కోటలోకి ఎవరైనా వస్తే ఆ సమాచారాన్ని దర్బారు హాలులో ఉన్నవారికి తెలిసేలా ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టేవారు.

గోల్కొండ కోట రాజప్రాసాదంలోని చిన్న చిన్న గదులను సమావేశ మందిరంతోను, ఇతర నిర్మాణాలతోను కలిపే కట్టడాన్ని నక్కర్ ఖానా (దోబీ ఘాట్) అనేవారు. రాజప్రాసడంలోని మురికి నీరు ఇక్కడి ప్రధాన కూడలి నుంచి కాలువల ద్వారా బయటకు వెళ్ళేది. ఈ విషయం ఇటీవల నిర్వహించిన తవ్వకాలప్పుడు తెలియవచ్చింది.

గోల్కొండ కోటపై శిఖరాగ్ర భాగాన ఉన్న కట్టడం పేరు బారా దరి. అనేక కార్యక్రమాలకు ఇది వేదికగా నిలిచింది.

సేకరణ – యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.