గ్రామాల్లో తపాలా బ్యాంకులు!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా క్రమంగా ప్రాధాన్యం కోల్పోతున్న తపాలా కార్యాలయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తపాలా కార్యాలయాలకు ఆర్ధిక కార్యకలాపాలు అప్పగించ దలచుకుంది. గ్రామాల్లో ఉన్న వందలాది తపాలా కార్యాలయాలను మూసేయడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారని అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయాల ద్వారా బ్యాంకింగ్ పనులు చేయాలని నిర్ణయించుకుంది. ఈ పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లో ముందుగా అమలు చేయదలచుకుంది. ఈ కార్యాలయాలు అతి తక్కువ మొత్తాలలో సైతం రైతుల నుంచి పొదుపు మొత్తాలు తీసుకుని, చిన్న మొత్తాలలోనే రైతులకు రుణాలు కూడా ఇస్తాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ వివరాలు తెలియజేశారు. “గ్రామ గ్రామీణ సేవలు అందిస్తున్న తపాలా శాఖను కేంద్ర పథకాల అమలుకు సమర్థంగా ఉపయోగించాలను కుంటున్నాం. ఇందులో భాగంగా తొలి దశలో తెలంగాణా రాష్ట్రంలోని వందలాది గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెడతాం. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రారంభిస్తాం” అని ఆయన తెలిపారు. ఈ తపాలా బ్యాంకుల్లో ఇరవై అయిదు వేల రూపాయల వరకు పొదుపు చేయడానికి, ఋణం ఇవ్వడానికి వెసులుబాటు కల్పిస్తామని ఆయన తెలిపారు.

Send a Comment

Your email address will not be published.