ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

రాష్ట్రంలో ఘనంగా 67వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలోనూ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ నగరంలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలోని పెరేడ్ గ్రౌండ్స్ లో గత అయిదు దశాబ్దాలుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతోంది. ఈసారి కెసీఆర్ ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పి పంద్రాగస్ట్ సందర్భంగా గోల్కొండ కోటలో పతాకాన్ని ఆవిష్కరించడం విశేషం. తెలంగాణా రాష్ట్రానికి గర్వ కారణమయిన గోల్కొండ కోటలో జెండా ఎగురవేయడమంటే, ఈ ప్రాంత ప్రజల ఆత్మా గౌరవాన్ని కాపాడుకోవడమేనని ఆయన చెప్పారు. పతాకావిష్కరణ తరువాత ఆయన దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసారు. రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి తమ ప్రభుత్వం చేసిన పనులను, మున్ముందు చేయబోయే పనులను ఆయన వివరించారు.
ఇది ఇలా వుండగా కర్నూలులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత చంద్రబాబు వంద రోజుల్లో రాష్ట్ర చరిత్రను తిరగ రాస్తానని ప్రకటించారు.
విజయవాడ నగరాన్ని తాత్కాలిక పాలనా కేంద్రంగా చేసుకున్తున్నప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలను, కార్యక్రమాలను రాష్ట్రమంతటా విస్తరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అభివృద్ధినంతా హైదరాబాద్ నగరంలో కేంద్రీకరించి గతంలో తాము పొరపాటు చేసామని, ఆ పొరపాటును ఈసారి చేయబోమని ఆయన తెలిపారు.

Send a Comment

Your email address will not be published.