నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 19 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, లక్షమందికి పైగా ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అయిదు ముఖ్యమయిన నిర్ణయాలపై సంతకాలు చేశారు. ఇందులో మొదటిది బెల్టు షాపులను రద్దు చేయడం. రెండవది, వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడం. మూడవది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచడం. నాలుగవది వృద్ధులు, వికలాంగుల పెన్షన్ పెంచడం, ఐదవది రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ను గ్రామాలకు సరఫరా చేయడం. ఆయన ఇక నుంచీ అయిదు రోజులు హైదరాబాద్ లోనూ, రెండు రోజులు గుంటూరులోనూ ఉంటారు.