చక్రి ఇక లేరు

“నేను సెలవు చెప్తేనేమో….నా పాట మీ చెంతనే ఉంది…”
————————————————————–
జగమంత కుటుంబం నాది ….అంటూ అనేక పాటలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన గిల్లా చక్రధర్ అలియాస్ చక్రి ఇక లేరు. ఈ మాట భౌతికంగా చెప్పుకోవాల్సిందే తప్ప ఆయన తన సంగీత ప్రపంచంతో తెలుగు సినీ పాట ఉన్నతవరకు మనతోనే ఉంటారు అనేది అక్షర సత్యం. అది అతిశయోక్తి కూడా కాదు. కారణం ఆయన స్వరపరచిన సంగీతం కానీ పాడిన పాటలు కానీ చిరస్మరణీయం కనుక.
తెలంగాణాలో ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్ పుత్రుడిగా ఉదయించిన చక్రి టాలీవుడ్ లో తన సంగీత సరస్వతితో కొండంత అభిమానాన్ని కూడగట్టుకున్న ఆయన  కథనం ఎంతో స్పూర్తిదాయకం.
1974 జూన్ 15వ తేదీన వరంగల్ జిల్లాలోని కంబాలపల్లి గ్రామంలో పుట్టిన చక్రికి తన తండ్రి చెప్పే బుర్రకథలు వినీ వినీ సగీతంపై మక్కువ పెరుగుతూ వచ్చింది. ఆయన తండ్రి పేరు వెంకట్ నారాయణ. వెంకట్ నారాయణ తన పల్లెలో వీలున్నప్పుడల్లా బుర్రకథలు వినిపిస్తుండే వారు. తన తండ్రి చెప్పే బుర్రకథలను ఎంతో శ్రద్ధగా వినే చక్రికి పాటపై ప్రేమ చిగురించింది. ఆయన కూడా పాడుతూ  ఉండేవారు. స్కూల్, కాలేజీ వార్షిక కార్యక్రమాల్లో చక్రి తన గొంతు వినిపించారు.
తన సొంత గ్రామంలో బాల్యాన్ని గడిపిన చక్రి పల్లె నుంచి మహబూబాబాద్ కి చేరుకున్నారు. చక్రి హనమకొండ లోని కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు. చిన్నప్పటినుంచే సినిమాలంటే చక్రికి వల్ల మాలిన ప్రాణం. డిగ్రీ అయిన తర్వాత చక్రి పెట్టెబేడా పుచ్చుకుని హైదరాబాదు చేరుకున్నారు. తెలుగు సినిమాల్లో పాడాలన్నది ఆయన కోరిక.
కానీ చక్రి అనుకున్నట్టు అదేమే అంత తేలికగా జరగలేదు. మ్యూజిక్ కంపోజర్ గా తొలి అవకాశం కోసం చక్రి చాలా ఏళ్ళు నిరీక్షించవలసి వచ్చింది. 2000లో పూరీ జగన్నాధ్ ఇచ్చిన అవకాశంతో బాచీ అనే సినిమాకు చక్రి  తొలిసారిగా సంగీతం సమకూర్చారు. ఆయన సంగీతం అందించి ఇటీవల విడుదల అయిన చివరి సినిమా ఎర్రబస్సు. ఈ పద్నాలుగేళ్ళ కాలంలో చక్రి 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. అనేక చిత్రాల్లో పాటలు పాడారు కూడా. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇట్లు  శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు స్వరపరచిన సంగీతం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు.
అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, అమ్మా నాన్నా తమిళమ్మాయి, శివమణి వంటి చిత్రాలతో లక్షలాది మంది అభిమానుల మన్ననలు అందుకున్న చక్రి 2003లో  సత్యం  అనే సినిమాలో ఓ మగువా అనే పాటకు ఫిలిం  ఫేర్ అవార్డు అందుకున్నారు.
వందమంది గాయనీ గాయకులను టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకున్న చక్రి దాదాపు అరవై అయిదు మందిని చలనచిత్ర పరిశ్రమకు  పరిచయం చేశారు.
సంగీతం అంటే చక్రి …. చక్రి అంటే సంగీతం అని అనిపించుకున్న ఆయన ఎక్కువ సమయం సంగీత వాయిద్యాలతోనే గడిపారు. మరోవైపు చక్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరికో సహాయం చేసిన చక్రి ఊబకాయం సమస్యతో ఎంతో బాధపడ్డారు. ఆరోగ్యం జాగర్త అని ఎందరు చెప్పినా అలాగే అన్నా అంటూ సంగీత లోకంలో మునిగిపోయిన చక్రి గుండెపోటుతో 2014 డిసెంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచారు.
మంచి స్వరకర్తగా, స్నేహశీలిగా పేరుప్రఖ్యాతులు గడించిన చక్రిని నలభై ఏళ్ళకే ఆ భగవంతుడు తన వద్దకు రప్పించుకున్నాడు.
సోమవారం ఉదయం (డిసెంబర్ 15వ తేదీ)  హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూసిన చక్రి అంతకుముందురోజు అంటే ఆదివారం తన స్టూడియోలో పని చేసి అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకున్నారు. అప్పటివరకు అంతా మామూలుగానే సాగింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత రెండున్నర గంటల వరకు తన భార్య శ్రావణితో కలిసి  టీవీ చూసిన చక్రి దంపతులు ఆ తర్వాత నిద్రపోయారు. తెల్లవారుజామున నాలుగున్నర అయిదు గంటల మద్య నిద్రలేచిన శ్రావణి తన భర్త శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న విషయం గమనించి కంగుతిన్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయితే అప్పటికే ఆయన పోయినట్టు వైద్యులు ప్రకటించారు. తన అభిమానిగా పరిచయమైన శ్రావణిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న చక్రికి ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లి, తమ్ముడూ ఉన్నారు. చక్రి దంపతులకు పిల్లలు లేరు.
ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ చెప్పినట్టు ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన తన పాటతో ఎప్పుడూ ఉంటారనడంలో సందేహం లేదు.
ఆయనకు, ఆయన పాటకు ఇదే వందనం. అభివందనం.

Send a Comment

Your email address will not be published.